ఎవరా వేలుపు?
--------------------
భావరాజు పద్మిని -21/2/17
ధనము చేతనే ధరను విభవమని
సంపదలిచ్చెడి దెవరని తిరిగితి
తనదు భక్తుని కుబేరుని చేసిన
తెల్లని దొరయే తారస పడెను
ఇంతుల పెన్నిధి సౌభాగ్యమ్మని
ఇచ్చెడి దెవరిని ఇటునటుజూచితి
సర్వమంగళను సగము మేనిలో
బెట్టిన భవుడే బొడమెను కనులకు
కష్టములెన్నడు కోరదు మనసు
సుఖముల కొరకే పరుగులు తీసెను
సకల శుభములను సులువుగ నిచ్చెడి
శుభకరుడితడని చాటెను చరితము
దీర్ఘాయువుకై పూజలు సేయగ
దిక్కై బ్రోచెడి దేవర నడిగితి
మరణము బాపి భక్తుల గాచిన
మృత్యుంజయుడిని చూపెను చిత్తము
జన్మమె కామపు కొలిమిన కాలగ
గతి ఎవరని నే గడగడ లాడితి
కాముని కంటను కాల్చిన కపర్ధి
కాచును నన్నని జెప్పెను శాస్త్రము
విషయము తెలిపే విద్దెల నిచ్చెడి
వేల్పుకొరకు నే వెదకుచునుండితి
దక్షిణ ముఖుడయి జ్ఞానమొసగెడి
దేవుడొకరు దరి దొరికెను నాకు
కర్మపు సర్పము కోరల చిక్కిన
జన్మల బాపే జతకై నెమకితి
పాములజుట్టి గరళము మ్రింగిన
జంగమదేవర జోడనె సత్వము
ఇహమున పరమున ఇన్నిటి నిచ్చెడి
ఈశ్వరుడే ఇట కొలువై ఉండగ
వేరు వేల్పులకై వెదకగనేల
పశుపతి పదముల పట్టుము మనసా!