రుద్ర సమాగమం
------------------
భావరాజు పద్మిని - 4/6/15
పాడెనెక్కినంత బతుకు పండిపోయే
కాటికెళ్ళినంత కధ మారిపోయే
మేలుపూతలు పూసి, పెంచు మేనికాంతి
మండు కట్టెలలోన మసిబారిపోయే
నీలాల కురులంటు జాలువారిన సొగసు
నిముషాల్లో నిలువెల్లా నిగిరిపోయే
తప్పొప్పులెంచుతూ తరచి చూచిన కళ్ళు
ఇంద్రియములు తోడుగా పేలిపోయే
కన్నవారినైనా కాలదన్నిన కాళ్ళు
కరకు కట్టెలలోన కాలిపోయే
అన్నినావేననుచు బారజాచిన చేయి
ఏమందుకోలేక ఇగిరిపోయే
పొట్టకూటి కొరకు పొట్టలు గొట్టిన బుద్ధి
కపాలమోక్షమున కరిగిపోయే
నీకు తోడు నేను – అన్న ఆప్తులంత
ఆమడ దూరానే ఆగిపోగా ...
రక్తమాంసములన్ని రగిలి బూడిద కాగ
ఒంటరైన ఆత్మ వగచుచుండ ...
అపుడు వచ్చునట నీకై భస్మధారి.
ఏకాకి ఆత్మలకు ఆత్మజ్ఞానము నొసగి,
జన్మ బంధమని, మృత్యువే స్వేచ్చని,
తెలిపి తన బిడ్డలను దరిజేర్చి ఓదార్చ,
మరుభూముల తిరుగుచుండు భూతపతి..
మరణ భయమేల తెలుసుకొనవే మనసా,
కరుణ గాచును నిన్ను కైలాసనాధుడు.
నటనలు ముగిసే నవజన్మంబిది,
మృత్యువనగా రుద్ర సమాగామమే !