Saturday, June 25, 2016

పద్మపు దేవత

చాలాకాలంగా లక్ష్మీదేవి మీద ఒక కవిత రాయాలని ఒక ఆజ్ఞ. వాయిదాలు వేస్తూ వస్తున్నాను. ఇవాళ సాయంత్రం గుడికి వెళ్తే అమ్మ వదలలేదు. ఇదిగో వెంటబడి, ఇలా రాయించుకుంది. పలికినది ఆమె దయే! అందుకే ఆమె పారాణి పాదాలకే అంకితం.

పద్మపు దేవత
------------------
అమ్మ అనుగ్రహంతో - భావరాజు పద్మిని
25/6/2016

సూర్యకాంతికి కమలము విచ్చును
చంద్రకిరణముల విరియక ముడుచును
ఏమి చిత్రమో నళిన నయనుని
కన్నులు సోముని సోదరి జూడగ
నీల నీరజములై విప్పారును

నిండు పున్నమిన సంద్రము పొంగును
మండుటెండకది మౌనము దాల్చును
ఏమి చిత్రమో అంబుధి యల్లుని
యుల్లము సిరి సిరినగవులమిసిమిని
గాంచి మోదమున మరి యుప్పొంగును

పంకము నందునె పద్మము బుట్టును
పంకము లేకనె నాభిన పద్మము
బుట్టిన వైనము చెప్పెద వినుము
పద్మపు దేవత పట్టపు రాణియై
హరి తనువందున తా పుష్పించెను



సుధను గ్రోలినను అమరులగుదురు
సుధను గ్రోలకనె పంచిన మోహిని
సదా సాక్షిగా నిలచుట నెటులన
సరసిజలోచని ప్రేమామృతమును
మక్కువ ద్రాగెడు హరిభృంగమిది

వాక్కుకు మనసుకు అందని విభుని
వలపున గట్టిన వన్నెల రాణివి
మధుసూదనుడికి మరులను పంచి
మదనుని తల్లిగ జేసిన మాతవు
మంగళకారిణి మాధవ ప్రేయసి

చల్లని తల్లివి చక్రికి చెలువవు
నీమది నీరజనాభుని నెలవు
నీఒడి నళినదళాక్షుని కొలువు
నీజత నున్ననె తనదు విభవమని
చాటి చెప్పెనుగ వేంకటేశుడై !!