శ్రీవిష్ణుహృత్కమలవాసిని, ఐశ్వర్యప్రదాయిని అయిన శ్రీలక్ష్మీదేవి, వైకుంఠంలో మహాలక్ష్మిగా, భూలోకంలో సస్య లక్ష్మిగా, స్వర్గలోకంలో స్వర్గలక్ష్మిగా, రాజ్యాల్లో రాజ్యలక్ష్మిగా, భక్తుల ఇళ్ళలో గృహలక్ష్మిగా, వివిధ రూపాలను ధరించి, ఈ సృష్ఠిలోని సకలప్రాణుల జీవితాలలో వెలుగులను వెదజల్లుతూ ఉంటుంది. ప్రకాశవంతంగా ఉండే అన్ని వస్తువులలో, శోభాయమానమయిన రూపంలొ విరాజిల్లుతూ ఉంటుంది. అలాగే, పుణ్యం చేసిన వారికి కీర్తిరూపంలో, రాజుల్లో తేజస్సు రూపంలో, వైశ్యులలో వాణిజ్యరూపంలో, పాపాత్ముల ఇళ్ళలో కలహాలు, ద్వేషాల రూపంలొ, పరోపకార పరాయణుల్లో దయాస్వరూపంలో ప్రకాశిస్తూ ఉంటుంది.
మహాలక్ష్మి క్షణ కాలం కూడా, పతిని విడిచి ఉండదు. ఆయన ఒక అవతార రూపం ధరించగానే, ఆవిడ ఆయనకు అనుగుణమయిన అనురూపాన్ని ధరిస్తుంది. రాముడికి – సీతగా, కృష్ణుడికి – రుక్మిణిగా,ఇలా యెన్నొ రూపాలు ధరించి, పతి వెన్నంటి ఉంటుంది. వీరిరువురీ అభేధ్య స్థితే లక్ష్మీనరాయణ హృదయానికి ఆపాదించబడింది. నారాయణ హృదయంలో 37 శ్లొకాలు ఉండగా, లక్ష్మీ హృదయంలో 108 శ్లొకాలు ఉన్నాయి. ఇహలోక సౌఖ్యాలన్నిటినీ విడిచి, ఆధ్యాత్మిక జీవితం గడపాలని కొందరు అంటుంటారు. కాని, ఇహం కూడా పరంలో భాగమే! మన జీవితాలు ధనము చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. ఆధ్యాత్మిక విషయాలలో సమున్నత స్థాయికి చేరుకోవాలంటే, ఐహిక జీవితంలో కోరికలన్నీ, సంపదల ద్వారా తీరి, పరులకోసం కూడా ధనాన్ని సద్వినియోగ పరచి, తమ పనులను ఫలప్రదంగా పూర్తీ చేసుకుని, ఒక పరాకాష్టకు చేరుకుంటేనే, మనిషి ఆధ్యాత్మికత వైపు పయనం సాగించగలుగుతాడు. అందుకే భృగు మహర్షి ఇహ పర దాయిని అయిన ఆ జగన్మాతను, ఇహలోక సౌఖ్యాలను కోరుతూ, అంతర్లీనంగా మోక్షాన్ని ప్రసాదించమన్న సందేశాన్ని ఈ శ్లోకం లో ఇమిడ్చారు. అత్యంత మహిమాన్వితమయిన ఈ ‘లక్ష్మీ నారాయణ హృదయం’ లో మొదటి భాగమయిన ‘నారాయణ హృదయాన్ని’ క్రిందటి సంచికలో అందించాము. ఇష్టకామ్యార్ధ సిద్ధికి మొదట ‘నారాయణ హృదయం ‘చదివి, తరువాత ‘లక్ష్మీ హృదయం’ చదివి, తిరిగి మరలా నారాయణ హృదయం చదవాలి.
శ్రీ లక్ష్మీ హృదయం
హరిః ఓం || అస్య శ్రీ ఆద్యాది శ్రీమహాలక్ష్మీ హృదయ స్తొత్ర మహామంత్రస్య భార్గవ ఋషిః, అనుష్టుబాది నానాఛందాంసి, ఆద్యాసి శ్రీమహాలక్ష్మీ సహిత నారాయణో దేవతా||
శ్రీం బీజం, హ్రీం శక్తిః ,ఐం కీలకం| ఆద్యాది శ్రీమహాలక్ష్మీ ప్రసాదసిద్ధ్యర్ధే జపే వినియోగః||
ఓం|| ఆద్యాది శ్రీమహాలక్ష్మీ దేవతాయై నమః హృదయే, శ్రీం బీజాయై నమః గుహ్యే, హ్రీం శక్త్యైః నమః పాదయోః,ఐం బలాయైః నమః మూర్ధాదిపాదపర్యంతం విన్యసేత్||
ఓం||శ్రీం, హ్రీం, ఐం, కరతలకరపార్స్వయోః, శ్రీం అంగుష్ఠాభ్యాం నమః, హ్రీం తర్జనీభ్యాం నమః, ఐం మధ్యమాభ్యాం నమః, శ్రీం అనామికాభ్యాం నమః, హ్రీం కనిష్ఠికాభ్యాం నమః, ఐం కరతల కరపృష్ఠాభ్యాం నమః||
శ్రీం హృదయాయ నమః, హ్రీం శిరసే స్వాహా, ఐల్ శిఖాయై వౌషట్, శ్రీం కవచాయ హుం, హ్రీం నేత్రాభ్యాం వౌషట్, ఐం అస్త్రాయ ఫట్, భూర్భువస్సువరోం ఇతి దిగ్బంధః ||
అధ ధ్యానం
హస్తద్వయేన కమలే ధారయంతీం స్వలీలయా!
హార నూపుర సంయుక్తాం మహాలక్ష్మీం విచింతయేత్ ||
భావం: తనలీలావిలాసంతో ఇరుహస్తాల్లో కమలాలు ధరించి, హారాలు, మువ్వలగజ్జలు వంటి అనేక ఆభరణాలను ధరించిన మహాలక్ష్మీదేవిని స్మరిస్తున్నాను.
కౌశేయ పీతవసనామరవిందనేత్రాం పద్మాద్వయాభయవరోద్యతపద్మహస్తాం |
ఉద్యఛ్ఛతార్క సదృశాం పరమాంకసంస్థాం ధ్యాయేద్ విధీశనత పాదయుగాం జనిత్రీం ||
భావం: పద్మ దళముల వంటి కన్నులు కలది, పద్మముల వంటి కోమల హస్తాలతో అభయాన్ని ఇచ్చేది, ఉదయ భానుడి వంటి ప్రకాశవంతమయిన దేహము కలది, ఎరుపు-పసుపు మేళవించిన వస్త్రాలు ధరించినది, పరమార్ధ ప్రదాయిని, లోకమాత అయిన మహాలక్ష్మీదేవి పాదపద్మములను స్మరించుచున్నాను.
శ్రీ లక్ష్మీ కమలధారిణ్యై సింహవాహిన్యై స్వాహా ||
భావం: సింహవాహిని, కమల ధారిణి అయిన శ్రీలక్ష్మీదేవిని స్మరించుచున్నాను.
( ఈ శ్లోకాన్ని 10, 16,32, 56, లేక 108 సార్లు జపించాలి.)
పీతవస్త్రాం సువర్ణాంగీం పద్మహస్తద్వయాన్వితాం|
లక్ష్మీం ధ్యాత్వేతి మంత్రేణ స భవేత్ పృధివీపతిః||
భావం: బంగారు మేనిఛాయతో , పీతవస్త్రాలను (పసుపు రంగు) వస్త్రాలను , ఇరు హస్తాలలో పద్మాలు ధరించిన లక్ష్మీదేవిని పై విధంగా ధ్యానించిన వారికి మహారాజయోగం పడుతుంది.
మాతులుంగ గదాఖేటే పాణౌ పాత్రంచ బిభ్రతీ|
వాగలింగంచ మానంచ బిభ్రతీ నృపమూర్ధని||
భావం: తన చేతులలో గద, డాలు,నిమ్మ పళ్ళతో నిండిన పాత్ర ధరించి, వాగలింగాన్ని గౌరవించే రాజుల నుదిటిపై వెలుగొందే లక్ష్మిని ధ్యానించుచున్నాను.
ఓం, శ్రీం, హ్రీం, ఐం||
వందే లక్ష్మీం పరశివమయీం శుద్ధజంబూనదాభాం
తేజోరూపాం కనకవసనాం సర్వభూషోజ్జ్వలాంగీం|
బీజాపూరం కనకకలశం హేమపద్మం దధానాం
ఆద్యాం శక్తిం సకలజననీం సర్వమాంగళ్య యుక్తాం|| 1 ||
భావం: దైవత్వానికి ప్రతిరూపమయినది, స్వచ్చమయిన బంగారం వలె దివ్యతేజస్సు కలది, కనక వస్త్ర ధారిణి , సకల ఆభరణాలతో మెరిసే దేహము కలది, దానిమ్మగింజలతో నిండిన కనక కలశాన్ని,పద్మాలను చేత ధరించినది, ఆదిశక్తి , లోకమాత అయిన లక్ష్మికి ప్రణామములు.
శ్రీమత్సౌభాగ్యజననీం స్తౌమి లక్ష్మీం సనాతనీం |
సర్వకామ ఫలావాప్తి సాధనైక సుఖావహాం || 2 ||
భావం: తన ఉపాసనతో సకలసౌభాగ్యాలను కలిగించేది, అన్ని కోరికలనూ తీర్చేది, అదృష్టదాయిని,సనాతని అయిన లక్ష్మిని నుతించుచున్నాను.
స్మరామి నిత్యం దేవేశి త్వయా ప్రేరితమానసః |
త్వదాజ్ఞాం శిరసా ధృత్వా భజామి పరమేశ్వరీం|| 3 ||
భావం: నీ వలన ప్రేరితమయిన మనస్సుతో, నీ ఆజ్ఞను శిరసావహించి, పరమేశ్వరివయిన నిన్ను నిత్యం తలచుకుంటాను దేవీ !
సమస్తసంపత్సుఖదాం మహాశ్రియం
సమస్తకల్యాణకరీం మహాశ్రియం |
సమస్తసౌభాగ్యకరీం మహాశ్రియం
భజామ్యహం జ్ఞానకరీం మహాశ్రియం || 4 ||
భావం: సమస్త సంపదలను ప్రసాదించేది, సమస్త మంగళాలను కలిగించేది, సౌభాగ్యదాయిని, జ్ఞానప్రదాయిని అయిన మహాలక్ష్మీదేవిని భజిస్తున్నాను.
విజ్ఞాన సంపత్సుఖదాం మహాశ్రియం
విచిత్రవాగ్భూతికరీం మనోరమాం |
అనంతసౌభాగ్యసుఖప్రదాయినీం
నమామ్యహం భూతికరీం హరిప్రియాం || 5 ||
భావం: మానసిక ఉల్లాసాన్ని కలిగించేది, హరిప్రియ, వాగ్దాయిని, సర్వసంపదలను ప్రసాదించేది, విజ్ఞాన సంపద ద్వారా శాశ్వత ఆనందాన్ని ప్రసాదించేది అయిన మహాలక్ష్మికి వందనములు.
సమస్తభూతాంతరసంస్థితా త్వం
సమస్తభక్తేశ్వరి విశ్వరూపే |
తన్నాస్తి యత్త్వద్వ్యతిరిక్తవస్తు
త్వత్పాదపద్మం ప్రణమామ్యహం శ్రీః || 6 ||
భావం: తల్లీ! నువ్వు సర్వంతర్యామినివి. భక్తులందరికీ ఆరాధ్యదేవతవు. విశ్వరూపిణివి. నువ్వు కానిది ఏదీ ఈ లోకంలో లేదు. అట్టి నీ పాదపద్మములకు నమస్కారములు.
దారిద్ర్య దుఃఖౌఘ తమోనిహంత్రి
త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ |
దీనార్తివిచ్ఛేదన హేతుభూతైః
కృపాకటాక్షైరభిషించ మాం శ్రీః || 7 ||
భావం: దుఃఖాన్ని, దారిద్ర్యాన్ని హరించే, నీ పాదపద్మముల సన్నిధిని నాకు ప్రసాదించు. నా లోని ఆర్తిని, దీనత్వాన్ని తొలగించే నీ కృపాద్రుష్టిని నాపై వర్షింపచెయ్యి తల్లీ !
విష్ణుస్తుతిపరాం లక్ష్మీం స్వర్ణవర్ణ స్తుతిప్రియాం |
వరదాభయదాం దేవీం వందే త్వాం కమలేక్షణే || 8 ||
భావం: ఓ కమలేక్షణా! విష్ణు స్తుతిని వినుటకు ఇష్టపడే దానివి, బంగారు మేనిఛాయ కలదానివి అగు నీవు నీ వరద హస్తంతో నాకు అభయం ఇవ్వు తల్లీ!
అంబ ప్రసీద కరుణాపరిపూర్ణదృష్ట్యా
మాం త్వత్కృపాద్రవిణగేహమియం కురుష్వ |
ఆలోకయ ప్రణతహృద్గతశోకహంత్రి
త్వత్పాదపద్మయుగళం ప్రణమామ్యహం శ్రీః || 9 ||
భావం: అమ్మా! నీ పరిపూర్ణమయిన కృపాదృష్టితో, నా ఇంటిని దయాధనంతో నింపు. నా కలతలను తొలగించు. ఓ మహాలక్ష్మీ, నీ పాదపద్మములకు ప్రణామములు.
శాంత్యై నమోస్తు శరణాగతరక్షణాయై
కాంత్యై నమోస్తు కమనీయగుణాశ్రయాయై |
క్షాంత్యై నమోస్తు దురితక్షయకారణాయై
ధాత్ర్యై నమోస్తు ధనధాన్య సమృద్ధిదాయై || 10 ||
భావం: నిన్ను ఆశ్రయించిన వారిని రక్షించే శాంతమూర్తివి. అనేక సుగుణాలతో ప్రకాశించే దివ్యకాంతివి. అన్ని బాధలను క్షణాలలో నిర్మూలించే సహనశీలివి. ధనధాన్యాలతో అందరినీ కరుణించే భూమాతవు. నీకు అనేక నమస్కారములు.
శక్త్యై నమోస్తు శశిశేఖర సంస్థితాయై
రత్యై నమోస్తు రజనీకరసోదరాయై
భక్త్యై నమోస్తు భవసాగరతారకాయై
మత్యై నమోస్తు మధుసూదనవల్లభాయై || 11 ||
భావం : చంద్రుడిని అలంకారంగా చేసుకున్న శక్తివి, చంద్ర సహోదరివయిన రతివి, భక్తితో ఆశ్రయించిన వారిని సంసారసాగరం దాతించె భక్తివి, మధుసూదనుడి పత్నివయిన మతివి అయిన నీకు నమస్కారములు.
లక్ష్మ్యై నమోస్తు శుభలక్షణలక్షితాయై
సిద్ధ్యై నమోస్తు సురసిద్ధసుపూజితాయై |
ధృత్యై నమోస్తు మమ దుర్గతిభంజనాయై
గత్యై నమోస్తు వరసద్గతిదాయకాయై || 12 ||
భావం: అనేక శుభ లక్షణాలకు నెలవయిన లక్ష్మివి.దేవతలు, మునులు కొలిచే సిద్ధివి, దుర్గతులను నాశనం చెసే ధ్రుతివి, సద్గతిని చూపే మార్గదర్శివి అయిన నీకు నమస్కారములు.
దేవ్యై నమోస్తు దివి దేవగణార్చితాయై
భూత్యై నమోస్తు భువనార్తివినాశకాయై |
శాంత్యై నమోస్తు ధరణీధరవల్లభాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమవత్సలాయై || 13 ||
భావం: దివిలో దేవగణాలచే పూజింపబడే దేవివి,భువిలో ఆర్తి హరించే భూతివి, ధరణిని ధరించే విష్ణువుకు సతివి, శాంతమూర్తివి, పురుషోత్తముడి వాత్సల్యాన్ని పొందిన పుష్టివి అయిన నీకు నమస్కారములు.
సుతీవ్ర దారిద్ర్య తమోపహంత్ర్యై
నమోస్తు తే సర్వ భయాపహంత్ర్యై |
శ్రీవిష్ణువక్షస్థల సంస్థితాయై
నమోనమః సర్వవిభూతిదాయై || 14 ||
భావం: అతి భయంకరమయిన దరిద్ర్యాన్ని కూదా హరించేదానివి, అన్ని భయాలను తొలగించే దానివి, అన్ని శుభాలను కలిగించే విష్ణు వక్షస్థల వాసినివి, అయిన నీకు నమస్కారములు.
జయతు జయతు లక్ష్మీర్లక్షణాలంకృతాంగీ
జయతు జయతు పద్మా పద్మసద్మాభివంద్యా |
జయతు జయతు విద్యా విష్ణువామాంకసంస్థా
జయతు జయతు సమ్యక్సర్వసంపత్కరా శ్రీః ||15||
భావం: చక్కటి ఆభరణాలను ధరించిన లక్ష్మివి, బ్రహ్మాది దేవతలచే కొలువబడే పద్మవు, విష్ణువుకు యెడమ తొడపై కూర్చునే విద్యవు, అన్ని సంపదలను ప్రసాదించె శ్రీలక్ష్మివి అయిన నీకు జయమగుగాక !
జయతు జయతు దేవీ దేవసంఘాభిపూజ్యా
జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా |
జయతు జయతు నిత్యా నిర్మలజ్ఞానవేద్యా
జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్థా || 16 ||
భావం: దేవతలచే పూజింపబడే దేవివి, భృగు మహర్షి కుమార్తె అయిన భద్రవు, భాగ్య స్వరూపానివి, శుద్ధ జ్ఞానాన్ని ప్రసాదించే నిత్యవు, అన్ని ప్రాణులలో నివసించే సత్యవు అయిన నీకు జయమగుగాక !
జయతు జయతు రమ్యా రత్నగర్భాంతరస్థా
జయతు జయతు శుద్ధా శుద్ధజాంబూనదాభా |
జయతు జయతు కాంతా కాంతిమద్భాసితాంగీ
జయతు జయతు శంతా శీఘ్రమాగచ్ఛసౌమ్యే || 17 ||
భావం: వెలలేని రత్నముల గర్భాంతరాలలో ఉండే రమ్యవు, స్వచ్చమయిన బంగారంలాగా వెలిగే శుద్ధవు, ప్రకాశవంతమయిన అంగాలతో వెలిగే కాంతివి, శాంతవు, సౌమ్యవు అయిన నీకు జయమగుగాక. నువ్వు త్వరగా రా తల్లీ.
యస్యాః కలాయాః కమలోద్భవాద్యా
రుద్రాశ్చ శక్రప్రముఖాశ్చ దేవాః |
జీవంతి సర్వేపి సశక్తయస్తే
ప్రభుత్వమాప్తాః పరమాయుషస్తే || 18 ||
భావం: శివుడు, ఇంద్రుడు, మొదలయిన దేవతలు నీ శక్తి వల్లనే మనగలుగుతున్నారు. నీ వల్లనే తరగని ఆయుష్షును , ఆధిపత్యాన్ని పొందుతున్నారు. నీ కళళతో కమలం నుండి ఉధ్భవించిన నీకు నమస్కారములు.
||ముఖబీజం||
ఓం – హ్రాం – హ్రీం – అం – ఆం – యం – దుం – లం – వం ||
లిలేఖ నిటిలే విధిర్మమ లిపిం విసృజ్యాంతరం
త్వయా విలిఖితవ్యమేతదితి తత్ఫలప్రాప్తయే |
తదంతికఫలస్ఫుటం కమలవాసిని శ్రీరిమాం
సమర్పయ సముద్రికాం సకలభాగ్యసంసూచికాం || 19 ||
భావం: బ్రహ్మ నా నుదుట వ్రాసిన తలరాతను , నీ రాతతో తిరగరాసి, నాకు శుభం కలిగేలా దీవించు తల్లీ. ఆ శుభాలనుండి మంచి ఫలితాలు కలిగేలా, నీ అదృష్ట ముద్రికను కూడా వాటి వద్ద వ్రాయి తల్లీ.
||పాదబీజం||
ఓం – అం – ఆం – ఈం – ఏం – ఐం – కం – లం – రం
కలయా తే యథా దేవి జీవంతి సచరాచరాః
తథా సంపత్కరీ లక్ష్మి సర్వదా సంప్రసీద మే || 20 ||
భావం: సకల చరాచర జగత్తు, ఉనికికి కారణం నువ్వే! సంపదలను ప్రసాదించే లక్ష్మివయిన నీవు, సదా నాపై ప్రసన్నురాలిగా ఉండు దేవీ !
యథా విష్ణుర్దృవం నిత్యం స్వకలాం సన్న్యవేశయత్ |
తథైవ స్వకలాం లక్ష్మి మయి సమ్యక్సమర్పయ || 21 ||
భావం : విష్ణువు అనునిత్యం తన కళల నుంచీ కొంత భాగం దేవతలకు ఎలా అందిస్తాడో, ఓ లక్ష్మీ, అదే విధంగా నీవు కూడా నీ కళలలో కొంత భాగాన్ని నాకు అనుగ్రహించు.
సత్వసౌఖ్యప్రదే దేవి భక్తానామభయప్రదే |
అచలాం కురు యత్నేన కలాం మయి నివేశితాం || 22 ||
భావం:భక్తులకు అన్ని శుభాలను కలిగిస్తూ అభయమిచ్చే ఓ దేవీ! నీ కళలతో నాయందు నివసిస్తూ స్థిరంగా ఉండు.
ముదాస్తాం మత్ఫాలే పరమపదలక్ష్మీః స్ఫుటకలా
సదా వైకుంఠశ్రీర్నివసతు కలా మే నయనమోః |
వసేత్సత్యే లోకే మమ వచసి లక్ష్మీర్వరకలా
శ్రియశ్శ్వేత ద్వీపే నివసతు కలా మే స్వకరమోః || 23 ||
భావం : పరమపదదాయిని అయిన లక్ష్మీ కళ నా ఫాలమందు, వైకుంఠవాసిని అయిన లక్ష్మికళ నా కన్నులయందు, బ్రహ్మ యొక్క లక్ష్మీ కళ నా వాక్కునందు , శ్వేత ద్వీపమందు నివసించే లక్ష్మీకళ నా కరములయందు ఉండుగాక.
|| నేత్ర బీజం ||
ఓం – ఘ్రాం – ఘ్రీం – ఘ్రేం – ఘ్రైం – ఘ్రోం – ఘ్రౌం – ఘ్రం – ఘ్రః ||
తావన్నిత్యం మమాంగేషు క్షీరాబ్ధౌ శ్రీకలా వసేత్ |
సూర్యాచంద్రమసౌ యావత్ తావల్లక్ష్మీపతిశ్రియౌ || 24 ||
భావం: సూర్యచంద్రులు ఉన్నంత వరకు లక్ష్మీనారాయణులు నాకు తోడుగా ఉండుగాక. పాలసముద్రమందు నివసించే లక్ష్మీదేవి యొక్క కళలు నా అంగముల యందు స్థిరనివాసము ఏర్పరచుకోనుగాక.
సర్వమంగళసంపూర్ణా సర్వైశ్వర్యసమన్వితా |
అద్యాదిశ్రీమహాలక్ష్మీః త్వత్కలామయి తిష్ఠతు || 25 ||
భావం: ఓ ఆదిలక్ష్మీ! సకల శుభాలకూ నెలవయిన, సకల సంపదలు కలిగిన, నీ కళ నాయందు స్థిరనివాసం ఏర్పరచుకొనుగాక.
అజ్ఞానతిమిరం హంతుం శుద్ధజ్ఞానప్రకాశికా |
సర్వైశ్వర్యప్రదామేస్తు త్వత్కలా మయి సంస్థితా || 26 ||
భావం: అన్ని సంపదలనూ కలిగించే నా యందు కొలువున్న నీ కళ, నాలోని అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, శుద్ధజ్ఞానమనే వెలుగులను నింపుగాక.
అలక్ష్మీం హరతు క్షిప్రం తమస్సూర్యప్రభా యథా |
వితనోతు మమ శ్రేయస్త్వత్కలా మయి సంస్థితా || 27 ||
భావం: సూర్యుడు తన కిరణాలతో చీకట్లను పారద్రోలినట్లు, నాయందు ఉన్న నీ కళ నా దారిద్ర్యాన్ని తక్షణమే హరించి, శుభములను కలిగించుగాక !
ఐశ్వర్యమంగళోత్పత్తిః త్వత్కలాయాం నిధీయతే |
మయి తస్మాత్కృతార్థోస్మి పాత్రమస్మిస్థితేస్తవ || 28 ||
భావం: నీ కళలు నాయందు ఉండుట వల్లనే నాకు సంపదలు, శుభములు కలుగుచున్నవి. నీవుండుటకు తగిన నెలవయి, నేను కృతార్ధుడనయితిని. తల్లీ, నీకు కృతఙ్ఞతలు.
భవదావేశభాగ్యార్హో భాగ్యవానస్మి భార్గవి |
త్వత్పృసాదాత్పవిత్రోహం లోకమాతర్నమోస్తుతే || 29 ||
భావం: ఓ భార్గవీ! నీవు నాయందు నివసించుటవలన, నేను భాగ్యవంతుడిని అయితిని. ఓ లోకమాతా! నీ అనుగ్రహం వలన నేను పునీతుడనయ్యాను . నీకు నా నమస్కారములు.
పునాసి మాం త్వత్కలయైవ యస్మాత్
అతస్సమాగచ్ఛ మమాగ్రతస్త్వం |
పరంపదం శ్రీర్భవ సుప్రసన్నా
మయ్యచ్యుతేన ప్రవిశాదిలక్ష్మీః || 30 ||
భావం: నీ కళలచే నన్ను పునీతం చేసావు. ఓ దివ్య లక్ష్మీ! నా యందు దయ ఉంచి, నా ఎదుటకు వచ్చి, అచ్యుతునితో కూడి, నాయందు ప్రవేశించుము.
శ్రీవైకుంఠస్థితే లక్ష్మి సమాగచ్ఛ మమాగ్రతః |
నారాయణేన సహ మాం కృపాదృష్ట్యావలోకయ || 31 ||
భావం: వైకుంఠవాసినివయిన ఓ లక్ష్మీ!నారాయణుడితో కూడి, నా ఎదుటికి వచ్చి, నీ కృపా దృష్టిని నాపై ప్రసరింప చేయుము.
సత్యలోకస్థితే లక్ష్మి త్వం మమాగచ్ఛ సన్నిధిం |
వాసుదెవేన సహితా ప్రసీద వరదా భవ || 32 ||
భావం: సత్యలోకమందున్న ఓ లక్ష్మీ! నన్ను కరుణించి,వాసుదేవునితో కూడి, నా వద్దకు వచ్చి, నన్ను అనుగ్రహించు.
శ్వేతద్వీపస్థితే లక్ష్మి శీఘ్రమాగచ్ఛ సువ్రతే |
విష్ణునా సహిత దేవి జగన్మాతః ప్రసీద మే || 33 ||
భావం: శ్వేత ద్వీపమందు నివసించే ఓ లక్ష్మీ! సత్సంకల్పంతో వేగిరమే రా! ఓ జగన్మాతా! నాయందు ప్రసన్నురాలివయి విష్ణువుతో కూడి వేగిరమే రమ్ము.
క్షీరాంబుధిస్థితే లక్ష్మి సమాగచ్ఛ సమాధవే |
త్వత్కృపదృష్టిసుధయా సతతం మాం విలోకయ || 34 ||
భావం: క్షీరసముద్రమందు నివశించే లక్ష్మీ, మాధవునితో కూడి రమ్ము. నీ అమృత దృష్టిని దయతో సదా నాపై ప్రసరింపచేయుము.
రత్నగర్భస్థితే లక్ష్మి పరిపూర్ణహిరణ్మయి |
సమాగచ్ఛ సమాగచ్ఛ స్థిత్వాశు పురతో మమ || 35 ||
భావం: రత్నగర్భవయిన ఓ లక్ష్మీ! నీవు సంపూర్ణ స్వర్ణ మయివి. రా తల్లీ, త్వరగా నా ముందుకు రా.
స్థిరా భవ మహాలక్ష్మి నిశ్చలా భవ నిర్మలే |
ప్రసన్న కమలే దేవి ప్రసన్న హృదయా భవ || 36 ||
భావం: ఓ మహాలక్ష్మీ! నా వద్ద స్థిరంగా ఉండు. పద్మమునందు నివసించే నిర్మలమయిన, ప్రసన్నమయిన దేవీ! నాపై దయ ఉంచి, అచంచలవై నా వద్ద నిలువుము.
శ్రీధరే శ్రీమహాలక్ష్మి త్వదంతస్స్థం మహానిధిం |
శీఘ్రముద్ధృత్య పురతః ప్రదర్శయ సమర్పయ || 37 ||
భావం: సకల సంపదలకూ నెలవయిన ఓ మహాలక్ష్మీ! నీలో ఉన్న అమూల్య సంపదలను త్వరగా వెలికి తీసి, నాకు తెచ్చి ఇమ్ము.
వసుంధరే శ్రీవసుదే వసుదోగ్ధ్రి కృపామయి |
త్వత్కుక్షిగతసర్వస్వం శీఘ్రం మే సంప్రదర్శయ || 38 ||
భావం: ఓ వసుంధరా! శ్రీ వసుదా! దయామయీ! నీ వద్ద గల నిధులన్నీ నాకు చూపించి, శీఘ్రమే నాపై వర్షింప చేయుము.
విష్ణుప్రియే రత్నగర్భే సమస్తఫలదే శివే |
త్వత్గర్భగతహేమాద్రీ సంప్రదర్శయ దర్శయ || 39 ||
భావం: ఓ విష్ణుప్రియా! నీవు రత్నములను నీ గర్భమునందు ధరించినదానవు. ఓ శివా! నీవే అన్నిటినీ ప్రసాదించే దానవు. నీ గర్భమందున్న నిధులను, స్వర్ణాన్ని, దయతో నాకు చూపించుము.
రసాతలగతే లక్ష్మి శీఘ్రమాగచ్ఛ మే పురః |
న జానే పరమం రూపం మాతర్మే సంప్రదర్శయ || 40 ||
భావం: పాతాళము నందు ఉన్న ఓ లక్ష్మీ! త్వరగా నా పురానికి రా! నీ దివ్య స్వరూపము నాకు తెలియదు తల్లీ…దయతో సాక్షాత్కరించు.
ఆవిర్భవ మనోవేగాత్ శీఘ్రమాగచ్ఛ మే పురః |
మా వత్స భైరిహేత్యుక్తా కామంగౌరివ రక్ష మాం || 41 ||
భావం: తల్లీ, మనోవేగంతో నా పురానికి వచ్చి, ‘బిడ్డా, భయపడకు,’ అంటూ కామధేనువు లాగా నాకు అభయమిచ్చి, నన్ను రక్షించు.
దేవి శీఘ్రం మమాగచ్ఛ ధరణీగర్భసంస్థితే |
మాతస్త్వద్భృత్యభృత్యోహం మృగయే త్వాం కుతూహలాత్ || 42 ||
భావం: భూగర్భము నందు నివసించే ఓ దేవీ, త్వరగా నా వద్దకు రా! నీకొరకు ఉత్సుకతతో వేచే, నీ సేవకులకు సేవకుడను.
ఉత్తిష్ఠ జాగృహి మయి సముత్తిష్ఠ సృజాగృహి |
అక్షయ్యా హేమకలశా సువర్ణేన సుపూరితా || 43 ||
నిక్షేపాన్నే సమాకృష్య సముద్ధృత్య మమాగ్రతః |
సమున్నతాననా భూత్వా సమ్యగ్దేహి ధరాతలాత్ || 44 ||
భావం( 43& 44): అమ్మా, లే , లేచి త్వరగా రా, నా పట్ల సదుద్దేశంతో, బంగారంతో నిండిన అక్షయ హేమ కలశాన్నివెలికి తీసి చూపి, మోదముతో నాకు ప్రసాదించు.
మత్సన్నిధిం సమాగచ్ఛ మదాహితకృపారసా |
ప్రసీద శ్రేయసాం దోగ్ధ్రి లక్ష్మీర్మే నయనాగ్రతః || 45 ||
భావం: ఓ లక్ష్మీ! దయతో నా కళ్ళముందుకు రా తల్లీ! వచ్చి నాకు కీర్తిని, ధనాన్ని అనుగ్రహించు.
అత్రోపవిశ్య లక్ష్మి త్వం స్థిరా భవ హిరణ్మయీ |
సుస్థిరా భవ సంప్రీత్యా ప్రసన్నా వరదా భవ || 46 ||
భావం: బంగారుమేనిఛాయ కల లక్ష్మీ! నా వద్దకు వచ్చి, నా ఎదుట స్థిరముగా కూర్చొని, ప్రసన్నంగా, ఆత్మీయంగా నన్ను అనుగ్రహించు.
అనీతాంస్తు త్వయా దేవి నిధీన్వై సంప్రదర్శయ |
అద్య క్షణేన సహసా దత్వా సంరక్ష మాం సదా || 47 ||
భావం: ఓ దేవీ! నీవు తెచ్చిన సంపదలను నాకు చూపించి, తృటిలో అవన్నీ నాకు అనుగ్రహించి, నన్ను రక్షించు.
మయి తిష్ఠ తథా నిత్యం యథేంద్రాదిషు తిష్ఠసి |
అభయంకురు మే దేవి మహాలక్ష్మి నమోస్తుతే || 48 ||
భావం: ఇంద్రాది దేవతల వద్ద నీవు ఎలా ఉంటావో, అలాగే స్థిరంగా నా వద్ద ఉండి , నాకు అభయాన్ని ఇవ్వు. ఓ మహాలక్ష్మీ దేవీ, నీకు ప్రణామములు.
సమాగచ్ఛ మహాలక్ష్మి శుద్ధజాంబూనదస్థితే |
ప్రసీద పురతః స్థిత్వా ప్రణతం మాం విలోకయ || 49 ||
భావం: స్వచ్చమయిన బంగారంలో నివసించే ఓ మహాలక్ష్మీ! ప్రసన్నురాలవై నా వద్దకు వచ్చి, నీకు ప్రణమిల్లె నన్ను కటాక్షించు.
లక్ష్మీర్భువంగతా భాసి యత్ర యత్ర హిరణ్మయీ |
తత్ర తత్ర స్థితా త్వం మే తవ రూపం ప్రదర్శయా || 50 ||
భావం: నీవు భువిలో ఎక్కడ ఉన్నా, బంగారంలా మెరుస్తావు. తల్లీ , అక్కడే ఉంటూ నీ స్వరూపాన్ని నాకు దర్శింపచేయ్యి.
క్రీదంతీ బహుధా భూమౌ పరిపూర్ణకృపా మయి |
మమ మూర్ధని తే హస్తమవిలంబితమర్పయి || 51 ||
భావం: ఓ దయామయీ! ఈ భువి నీకు ఆట స్థలము. నీవెక్కడ క్రీడిస్తున్నా, దయతో నీ అభయ హస్తాన్ని నా శిరస్సుపై ఉంచు.
ఫలభగ్యోదయే లక్ష్మి సమస్తపురవాసిని |
ప్రసీద మే మహాలక్ష్మి పరిపూర్ణమనోరథే || 52 ||
భావం: అదృష్టాన్ని పెంపొందించే ఓ లక్ష్మీ! సర్వవ్యాపి వయిన నీవు, నా యందు దయ ఉంచి, నా కోరికలను తీర్చుము.
అయోధ్యాదిషు సర్వేషు నగరేషు సమాస్థితే |
వైభవైర్వివిధైర్యుక్తైః సమాగచ్ఛ ముదాన్వితే || 53 ||
భావం: అయోధ్యాది అన్ని పట్టణాలలో ఉండే లక్ష్మీ! అనేక విధములయిన, నాకు యుక్తమయిన సంపదలతో నన్ను అనుగ్రహించు.
సమాగచ్ఛ సమాగచ్ఛ మమాగ్రే భవ సుస్థిరా |
కరుణారసనిష్యంద నేత్రద్వయవిలాసిని || 54 ||
భావం: కరుణా రసముతో వెలిగే కన్నులు కల ఓ దేవీ! నీవు రా , వచ్చి నా వద్ద సుస్థిరంగా ఉండు.
సన్నిధత్స్వ మహాలక్ష్మి త్వత్పాణిం మమ మస్తకే |
కరుణాసుధయా మాం త్వమభిషిచ్య స్థిరం కురు || 55 ||
భావం: ఓ మహాలక్ష్మీ! నీవు వచ్చి, నీ అభయహస్తాన్ని నా శిరస్సుపై ఉంచి, నన్ను ఆశీర్వదించు. తేనే వంటి నీ దయాదృష్టితో నన్ను అభిషేకించి, నా మనస్సు నిశ్చలంగా ఉండేలా దీవించు.
సర్వరాజగృహే లక్ష్మి సమాగచ్ఛ బలాన్వితే |
స్థిత్వాశు పురతో మేద్య ప్రసాదేనాభయం కురు || 56 ||
భావం: సకల రాజ గృహాలలో నివశిస్తూ, వారికి బలాన్ని ప్రసాదించే ఓ లక్ష్మీ! నా గృహానికి కూడా విచ్చేసి, నాకు అభయమివ్వు తల్లీ.
సాదరం మస్తకే హస్తం మమత్వం కృపయార్పయ |
సర్వరాజ స్థితే లక్ష్మి త్వత్కలా మయి తిష్ఠతు || 57 ||
భావం: అమ్మా !సాదరంగా నీ చేతిని నా తలపై ఉంచి, ప్రేమతో, దయతో నన్ను ఆశీర్వదించు. రాజులందరిలో రాజ కళగా కొలువున్న ఓ లక్ష్మీ! నీ కళ నన్ను కూడి ఉండుగాక.
అద్యాది శ్రీమహాలక్ష్మి విష్ణువామాంకసంస్థితే |
ప్రత్యక్షం కురు మే రూపం రక్ష మాం శరణాగతం || 58 ||
భావం: ఆదిలక్ష్మిగా, విష్ణుమూర్తి వామాంకము నందు కొలువున్న శ్రీ మహాలక్ష్మీ! నీ దివ్య రూపాన్ని నాకు సాక్షాత్కరింప చేసి, నీ శరణా గతుడనయిన నన్ను రక్షించు.
ప్రసీద మే మహాలక్ష్మి సుప్రసీద మహాశివే |
అచలా భవ సుప్రీతా సుస్థిరా భవ మద్గృహే || 59 ||
భావం: ఓ మహాలక్ష్మీ! నా యందు ప్రసన్నురాలవు కమ్ము. ఓ మహాశివా! మోదముతో, అచంచలవై, సుప్రసన్నవై, స్థిరముగా నా గృహమందు నివశించు.
యావత్తిష్ఠంతి వేదాశ్చ యావచ్చంద్ర దివాకరౌ |
యావద్విష్ణుశ్చ యావత్త్వం తావత్కురు కృపాం మయి || 60 ||
భావం: వేదాలు ఉన్నంతవరకూ, సూర్యచంద్రులు ఉన్నంతవరకూ, లక్ష్మీనారాయణులు ఉన్నంతవరకూ, నీవు నాపై దయ చూపించు, కృపామాయీ!
చాంద్రీ కలా యథా శుక్లే వర్ధతే సా దినే దినే |
తథా దయా తే మయ్యేవ వర్ధతామభివర్ధతాం || 61 ||
భావం: చంద్ర కళలు శుక్లపక్షంలో దినదినాభివృద్ధి చెందినట్లు, నాపై నీ దయ అంతకంతకూ వృద్ధి చెందుగాక!
యథా వైకుంఠనగరే యథా వై క్షీరసాగరే |
తథా మద్భవనే తిష్ఠ స్థిరం శ్రీవిష్ణునా సహ || 62 ||
భావం: వైకుంఠమ్ లో, పాల సముద్రంలో, నీవు ఎలా స్థిరంగా ఉంటావో, అలాగే విష్ణువుతో కూడి, నా గృహమందు స్థిరంగా నివసించు.
యోగినాం హృదయే నిత్యం యథా తిష్ఠసి విష్ణునా |
తథా మద్భవనే తిష్ఠం స్థిరం శ్రీవిష్ణునా సహ || 63 ||
భావం: యోగుల మనస్సులలో విష్ణువు స్థిరనివాసం ఏర్పరచుకున్నట్లు, నా గృహమందు నీవు విష్ణువుతో కూడి స్థిరముగా నివసించుము.
నారయణస్య హృదయే భవతీ యథాస్తే
నారాయణోపి తవ హృత్కమలే యథాస్తే |
నారాయణస్త్వమపి నిత్యవిభూతథైవ
తౌ తిష్ఠతాం హృదిమమాపి దయాన్వితౌ శ్రీః || 64 ||
భావం: ఓ లక్ష్మీ! నారాయణుడి హృదయంలో నీవు, నీ హృదయకమలములో నారాయణుడు ఎలా ఉంటారో, అలా మీరు ఇరువురూ నా హృదయంలో ఉంటూ, నా పై దయ చూపించండి.
విజ్ఞానవృద్ధిం హృదయే కురు శ్రీః
సౌభాగ్యవృద్ధిం కురు మే గృహే శ్రీః |
దయాసువృష్టిం కురుతాం మయి శ్రీః
సువర్ణవృష్టిం కురు మే కరే శ్రీః || 65 ||
భావం: నా మనస్సు నందు విజ్ఞానాన్ని, నా గృహమునందు అదృష్టాన్ని, పెంపొందించు లక్ష్మీ ! నా పై దయా వృష్టిని, నా చేతుల్లో కనక వృష్టిని కురిపించు లక్ష్మీ!
న మాం త్యజేథాః శ్రితకల్పవల్లి
సద్భక్తి చితామణి కామధేనో |
న మాం త్యజేథా భవ సుప్రసన్నే
గృహే కళత్రేషు చ పుత్రవర్గే || 66 ||
భావం: ఆశ్రితకల్పవల్లి వయిన నీవు నన్ను విడువకు. సద్భక్తులకు కామధేనువు, చింతామణి వంటి నీవు, నన్ను విడనాడకు. సుప్రసన్నంగా, నన్నే కాక నా భార్యాబిడ్డలను కూడా అనుగ్రహించు.
||కుక్షిబీజం||
ఓం – అం – ఆం – ఈం – ఏం – ఐం ||
అద్యాదిమాయే త్వమజాండబీజం
త్వమేవ సాకార నిరాకృతీత్వం |
త్వయా ధృతాశ్చాబ్జ భవాండ సంఘాః
చిత్రం చరిత్రం తవ దేవి విష్ణోః || 67 ||
భావం: ఓ ఆదిమాయా! నీవు ఈ విశ్వానికే మూలమయిన అండానివి. సాకార, నిరాకార స్వరూపిణివి. శివుడు, బ్రహ్మాది దేవతలకు సహరించేదానావు. ఇక విష్ణువుతో నీ చరిత్ర అత్యంత మహిమాన్వితమయినది.
బ్రహ్మరుద్రాదయో దేవా వేదాశ్చాపి న శక్నుయుః |
మహిమానం తవస్తోతుం మందోహం శక్నుయాం కథం || 68 ||
భావం: బ్రహ్మరుద్రాదులకు, వేదాలకు సైతం నీ మహిమను పొగడ సాధ్యము కాదు. ఇక, మందబుద్ధినయిన నేను నిన్ను ఎలా స్తుతించాను తల్లీ!
అంబ త్వద్వత్సవాక్యాని సూక్తాసూక్తాని యాని చ |
తాని స్వీకురు సర్వజ్ఞే దయాలుత్వేన సాదరం || 69 ||
భావం: జగన్మాతా, నీ పుత్రుదనయిన నా మాటలు నీకు నచ్చినా, నచ్చకపోయినా, సర్వజ్ఞు రాలవయిన నీవు, నా భావాన్ని గ్రహించి, ఆదరంతో నాపై దయ చూపించు.
భవంతం శరణం గత్వా కృతార్థాస్స్యుః పురాతనాః |
ఇతి సంచింత్య మనసా త్వామహం శరణం వ్రజే || 70 ||
భావం: నా పూర్వీకులు నిన్ను శరణు కోరి, క్రుతార్దులయినారని, నా మనసునందు భావిస్తూ, నేను కూడా నీకు సంపూర్ణ శరణాగతుడినయ్యాను.
అనంతా నిత్యసుఖినః త్వద్భక్తాస్త్వత్పరాయణాః |
ఇతి వేద ప్రమాణాద్ధి దేవి త్వాం శరణం వ్రజే || 71 ||
భావం: సత్పరాయణులయిన నీ భక్తులు ఎల్లలు లేని నిత్యానందాన్ని పొందుతారనే వేదవాక్యం ప్రకారం, నేను నిన్ను శరణు కోరి ఉన్నాను.
తవ ప్రతిజ్ఞా మద్భక్తా న నశ్యంతీ త్యపి క్వచిత్ |
ఇతి సంచింత్య సంచింత్య ప్రాణాన్ సంధారయామ్యహం || 72 ||
భావం: నీ భక్తులకు ఎప్పటికీ నాశనం లేదు, అన్న నీ ప్రతిజ్ఞను నమ్మి, నీ కోసం నా ప్రాణాలు నిలుపుకుంటూన్నాను తల్లీ.
త్వధీనస్త్వహం మాతః త్వత్కృపామయి విద్యతే |
యావత్సంపూర్ణకామాః స్యాం తావద్దేహి దయానిధే || 73 ||
భావం: ఓ తల్లీ! నీకు అధీనుడను. ఓ దయానిధీ! నాపై దయ చూపించు. నీ దయ ఉంటే , నా ఆశయాలు, కోరికలూ అన్నీ తీర్చుకోగలను.
క్షణమాత్రం న శక్నోమి జీవితుం త్వత్కృపా వినా |
న హి జీవంతి జలజా జలం త్యక్త్వా జలాశ్రయాః || 74 ||
భావం: నీటిని విడిచి చేపలు క్షణమయినా జీవించలేనట్లు, నీ దయ లేక నేను క్షణ కాలమయినా జీవింప జాలను.
యథా హి పుత్రవాత్సల్యాత్ జననీ ప్రస్నుతస్తనీ |
వత్సం త్వరితమాగత్య సంప్రీణయతి వత్సలా || 75 ||
యది స్యాత్తవ పుత్రోహం మాతా త్వం యది మామకీ |
దయాపయోధరస్తన్య సుధాభిరభిషించ మాం || 76 ||
భావం(75&76): తల్లి తన బిడ్డపై వాత్సల్యంతో, స్తన్యాన్ని దాచి, త్వరగా బిడ్డ వద్దకు వెళ్లి, పాలిచ్చి, బిడ్డను త్రుప్తిపరచినట్లు, నీవు నన్ను నీ బిడ్డగా భావిస్తే, నీ అమృతమయమయిన దయాస్తన్యంతో నన్ను అభిషేకించు.
మృగ్యో న గుణలేశోపి మయి దోషైకమందిరే |
పాంసూనాం వృష్టిబిందునాం దోషాణాంచ న మే మతిః || 77 ||
భావం: అసంఖ్యాకమయిన ఇసుక రేణువులు, వాన చినుకుల లాగా, నా పాపాలూ లేక్కలేనివి. అనేక దోషాలకు నిలయమయిన పాపాలఖనిని, నాలో ఒక్క సుగుణం కూడా లేదు.
పాపినామహమేకాగ్రో దయాలూనం త్వమగ్రణీః |
దయనీయో మదన్యోస్తి తవ కోత్ర జగత్త్రయే || 78 ||
భావం: నేను పాపులలో అగ్రగణ్యుడిని . నీవు పరమ దయామయివి. అందుకే, నీ దయను పొందదగిన అర్హత, మొట్టమొదట నాకే ఉంది తల్లీ!
విధినాహం న సృష్టశ్చేత్ న స్యాత్తవ దయాలుతా |
అమయో వా న సృష్టశ్చేదౌషధస్య వృథోదయః || 79 ||
భావం: నేను పుట్టకుండా ఉన్నట్లయితే, నీ దయ వ్యర్ధమయ్యేది. సృష్టిలో రోగాలే లేనప్పుడు, ఔషధాలు అన్నీ వ్యర్ధమే కదా!
కృపా మదగ్రజా కిం తే అహం కిం వా తదగ్రజః |
విచార్య దేహి మే విత్తం తవ దేవి దయానిధే || 80 ||
భావం: నీ దయ పెద్దదో, నేను పెద్దవాడినో, నీవే విచారించుకొని, దయానిదివయిన నీవు నాకు ధనాన్ని ప్రసాదించు.
మాతా పితా త్వం గురుసద్గతిః శ్రీః
త్వమేవ సంజీవనహేతుభూతా |
అన్యం న మన్యే జగదేకనాథే
త్వమేవ సర్వం మమ దేవి సత్యం || 81 ||
భావం: లక్ష్మీ! నీవే నాకు తల్లివీ, తండ్రివీ, గురువువూ, సద్గతిదాయినివి. నీవే నా జీవన హేతువువు. ఓ జగన్మాతా! నీవు తప్ప నాకు వేరే ఎవరూ కనిపించట్లేదు. నాకు అన్నీ నువ్వే తల్లీ, ఇది సత్యం.
|| హృదయబీజం ||
ఓం – ఘ్రాం – ఘ్రీం – ఘ్రూం – ఘ్రైం – ఘ్రౌం – ఘ్రః – హుంఫట్ కురు కురు స్వాహా ||
అద్యాదిలక్ష్మీర్భవ సుప్రసన్నా
విశుద్ధవిజ్ఞాన సుఖైకదోగ్ధ్రి |
అజ్ఞానహంత్రీ త్రిగుణాతిరిక్తా
ప్రజ్ఞాన నేత్రీ భవ సుప్రసన్నా || 82 ||
భావం: ఓ ఆదిలక్ష్మీ! నా యందు ప్రసన్నురాలవు కమ్ము. అజ్ఞానాన్ని హరించి, శుద్ధ విజ్ఞానాన్ని ప్రసాదించే త్రిగుణాతీతమయిన దేవీ, నా పట్ల ప్రసన్నురాలవై, నా జ్ఞాన నేత్రానివి కమ్ము.
అశేషవాగ్జాడ్య మలాపహంత్రీ
నవం నవం సుష్ఠు సువాక్యదాయినీ |
మమైవ జిహ్వాగ్రసురంగవర్తినీ
భవ ప్రసన్నా వదనే చ మే శ్రీః || 83 ||
భావం: మాటలోని రుగ్మతలను తొలగించి, నూతన పదాలతో కూడిన వాగ్దాటిని ప్రసాదించే దేవీ, నా నాలుక చివర, ప్రసన్న వదనవై, నా ముఖమునందు, నివసించుము.
సంస్తసంపత్సు విరాజమానా
సమస్తతేజస్సు విభాసమానా |
విష్ణుప్రియే త్వం భవ దీప్యమానా
వాగ్దేవతా మే వదనే ప్రసన్నా || 84 ||
భావం: అన్ని సంపదలలో నివసించేదానవు, అన్ని తేజస్సులుగా ప్రకాశించేదానావు. ఓ విష్ణుప్రియా, వాగ్దేవతా రూపములో, ప్రసన్న వదనవై, నా ముఖమునందు నివసిస్తూ, నన్ను వెలిగించు.
సర్వప్రదర్శే సకలార్థదే త్వం
ప్రభాసులావణ్య దయాప్రదోగ్ద్రి |
సువర్ణదే త్వం సుముఖీ భవ శ్రీః
హిరణ్మయీ మే నయనే ప్రసన్నా || 85 ||
భావం: నీ దయ అన్నిటినీ ప్రకాశింపచేస్తుంది. నీ దివ్య కాంతి, అందరికీ వెలిగే అందాన్ని ఇస్తుంది. ఓ హిరణ్మయీ! ఓ లక్ష్మీ! సుముఖంగా నా కళ్ళలో ఉంటూ, నన్ను వెలిగించు.
సర్వార్థదా సర్వజగత్పృసూతిః
సర్వేశ్వరీ సర్వభయాపహంత్రీ |
సర్వోన్నతా త్వం సుముఖీ చ నః శ్రీః
హిరణ్మయీ మే భవసుప్రసన్నా || 86 ||
భావం: అన్ని కోరికలనూ తీర్చే విశ్వమాతవు. అన్ని భయాలను పోగొట్టే సర్వేశ్వరివి. అందరికంటే గోప్పదానావు, స్వర్ణమయివి, ప్రసన్నవు, నా పట్ల దయ చూపించు తల్లీ.
సమస్త విఘ్నౌషు వినాశ కారిణీ
సమస్తభక్తోద్ధరణే విచక్షణా |
అనంతసమ్మోద సుఖ ప్రదాయినీ
హిరణ్మయీ మే నయనే ప్రసన్నా || 87 ||
భావం: అన్ని విఘ్నాలనూ తొలగించేదానావు, భక్తులను ఉద్ధరించి, అనంత సుఖాలను, అదృష్టాన్ని, విచక్షణను ప్రసాదించే నీవు, నా కన్నుల యందు కొలువుండు హిరణ్మయీ!
దేవీ ప్రసీద దయనీయతమాయ మహ్యం
దేవాధినాథ భవ దేవగణాది వంద్యే |
మాతస్తథైవ భవ సన్నిహితా దృశోర్మే
పత్యా సమం మమ ముఖే భవ సుప్రసన్నా || 88 ||
భావం: ఇంద్రాదిదేవతలచే పూజించబడేదానవయిన ఓ దేవీ! అజ్ఞాన అంధకారములో ఉన్న నన్ను కరుణించి, నా కళ్ళలో నివసించు. విష్ణువుతో కూడి, నా ముఖమందు నివసించు.
మా వత్స భైరభయదానకరోర్పితస్తే
మౌళౌ మమేతి మయి దీనజనానుకంపే |
మతః సమర్పయ ముదా కరుణాకటాక్షం
మాంగళ్యబీజమిహ నః సృజ జన్మ మాతః || 89 ||
భావం: నీవు దయామయివి, దీన జనులకు అభయమిచ్చే దానవు కనుకనే,నా తలపై నీ చేతిని ఉంచి, ‘బిడ్డా, భయపడకు,’ అంటూ అభయమిచ్చావు.ఓ మాతా! నీ కరుణా దృష్టితో, నాలో సద్భావనలను జనింప చెయ్యి.
||కంఠబీజం||
ఓం – శ్రాం – శ్రీం – శ్రూం – శ్రైం – శ్రౌం – శ్రం – శ్రాః ||
కటాక్ష ఇహ కామధుక్ తవ మనస్తు చింతామణిః
కరః సురతరుః సదా నవనిధిస్త్వమేవేందిరే |
భవేత్తవ దయారసో రసరసాయన చాన్వహం
ముఖం తవ కలానిధిర్వివిధ వాంచితార్థప్రదం || 90 ||
భావం: నీ చూపు కామధేనువు, నీ మనసు చింతామణి, నీ చెయ్యి కల్పవృక్షము, ఓ ఇందిరా! నీ లో నవనిధులు ఉన్నాయి. ఓ కళా నిధీ, అన్ని కోరికలనూ తీర్చే నీ ముఖబింబము నుండి ఉద్భవించే దయారసము అమోఘమయినది.
యథా రసస్పర్శనతోయసోపి
సువర్ణతా స్యాత్ కమలే తథా తే |
కటాక్షసంస్పర్శనతో జనానాం
అమంగళానామపి మంగళత్వం || 91 ||
భావం: పరసువేదిని తాకినా లోహం బంగారమయినట్లు, ఓ కమలా, నీ అనుగ్రహ దృక్కులు నన్ను తాకగానే, పాపినయిన నేను పున్యాత్ముడను అవుతాను.
దేహీతి నాస్తీతి వచః ప్రవేశాత్
భీతో రమే త్వాం శరణం ప్రపద్యే |
అతః సదాస్మిన్న భయప్రదా త్వం
సహైవ పత్యా మమ సన్నిధేహి || 92 ||
భావం: నీవు ఇస్తావో, ఇవ్వవో అన్న భయాన్ని విడచి, నిన్ను శరణాగతి కోరి ఉన్నాను. శరణాగతులను రక్షించే నీవు, నీ పతితో కూడి, నా ఎదుటకు రమ్ము.
కల్పద్రుమేణ మణినా సహితా సురమ్యా
శ్రీస్తే కలామయి రసేన రసాయనేన |
అస్తామతో మమ చ దృక్కరపాణిపాద
స్పృష్ట్యా సువర్ణవపుషః స్థిరజంగమాః స్యుః || 93 ||
భావం: ఓ రమ్యా! చింతామణి తో, నీ కళల తో కూడి నీవు, ఈ చరాచర జగతిలో ఎవరిని స్ప్రుశిస్తావో, వారి కళ్ళు, చేతులూ, కాళ్ళు అన్నీ, పరసువేది తాకినట్లు స్వర్నమయమయి , స్థిరంగా ప్రకాశిస్తాయి.
అద్యాదివిష్ణోః స్థిరధర్మపత్ని
త్వమంబ పత్యా మమ సన్నిధేహి |
అద్యాదిలక్ష్మి త్వదనుగ్రహేణ
పదే పదే మే నిధిదర్శనం స్యాత్ || 94 ||
భావం: ఆదిలక్ష్మివయిన నీవు విష్ణువుకు ధర్మపత్నివి. అమ్మా! నీ పతితో కూడి వచ్చి , నిదులవంటి ఆదిలక్ష్మీ మొదలయిన నీ స్వరూపాలను ఒక్కటొక్కటే చూపిస్తూ, నన్ను అనుగ్రహించు.
అద్యాదిలక్ష్మీహృదయం పఠేద్యః
స రాజ్యలక్ష్మీమచలాం తనోతి |
మహాదరిద్రోపి భవేద్ధనాడ్యః
తదన్వయే శ్రీః స్థిరతాం ప్రయాతి || 95 ||
భావం: ఈ ఆదిలక్ష్మీ హృదయము చదివిన వారు ఎంతటి దరిద్రులయినా,రాజ్యలక్ష్మీ కటాక్షం వాళ్ళ ధనవంతులవుతారు. లక్ష్మి వారి వంశంలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది.
యస్యస్మరణమాత్రేణ తుష్టా స్యాద్విష్ణువల్లభా |
తస్యాభీష్టం దదాత్యాశు తం పాలయతి పుత్రవత్ || 96 ||
భావం: అట్టి భక్తుడు తనను స్మరించినంతనే దేవి సంతుష్టురాలై, వారి కోరికలన్నీతీర్చి, బిడ్డ వలే, వారిని రక్షిస్తుంది.
ఇదం రహస్యం హృదయం సర్వకామఫలప్రదం |
జపః పంచసహస్రం తు పురశ్చరణముచ్యతే || 97 ||
భావం: ఈ రహస్య హృదయం అన్ని కోరికలనూ తీర్చే శక్తి ఉన్నది. ఐదు వేల సార్లు చదివితే, కోరిన కోరిక సిద్ధిస్తుంది.
త్రికాలమేకకాలం వా నరో భక్తిసమన్వితః |
యః పఠేచ్ఛృణుయాద్వాపి స యాతి పరమాం శ్రియం || 98 ||
భావం: మూడు సార్లు జపించినా, విన్నా, లేక భక్తితో, ఒక్క సారి చదివినా, అతనికి కీర్తి, ఐశ్వర్యం లభిస్తుంది.
మహాలక్ష్మీం సముద్దిశ్య నిశి భర్గవవాసరే |
ఇదం శ్రీహృదయం జప్త్వా పంచవారం ధనీ భవేత్ || 99 ||
భావం: ఈ మహాలక్ష్మీ హృదయాన్ని,ఐదు శుక్రవారాలు రాత్రిళ్ళు చదివితే, అతడు ఐశ్వర్యవంతుడు అవుతాడు.
అనేన హృదయేనాన్నం గర్భిణ్యా అభిమంత్రితం |
దదాతి తత్కులే పుత్రో జాయతే శ్రీపతిః స్వయం ||100||
భావం: ఈ హృదయాన్ని అభిమంత్రించిన అన్నం గర్భిణీ స్త్రీలకు ఇస్తే, స్వయంగా విష్ణువే వారికి పుత్రుడయ్యి జన్మిస్తాడు.
నరేణాప్యథవా నార్యా లక్ష్మీహృదయమంత్రితే |
జలే పీతే చ తద్వన్శే మందభాగ్యో న జాయతే ||101||
భావం: లక్ష్మీ హృదయాన్ని మంత్రించిన నీటిని తాగిన వారి వంశంలో అభాగ్యులు, దరిద్రులు పుట్టరు.
య ఆశ్వయుజ్మాసి చ శుక్లపక్షే
రమోత్సవే సన్నిహితే చ భక్త్యా |
పఠేత్తథైకోత్తరవారవృద్ధ్యా
లభేత సౌవర్ణమయీం సువృష్టిం ||102||
భావం: ఆశ్వీజ శుక్ల పక్షమందు , శ్రీరామ నవమి నవరాత్రులలో, రోజుకొక్క మారు పెంచుకుంటూ, భక్తితో చదివిన వారి ఇంట కనకవ్రుష్టి కురుస్తుంది.
య ఏకభక్త్యాన్వహమేకవర్షం
విశుద్ధధీః సప్తతివారజాపీ |
స మందభాగ్యోపి రమాకటాక్షాద్
భవేత్సహస్రాక్షశతాధికశ్రీః ||103||
భావం: వారానికి ఒక సారి చప్పున ఒక ఏడాది చదివితే, ఎంతటి దురదృష్టవంతుడయినా , లక్ష్మీ దేవి కటాక్షం వలన ఇంద్రునివలె సంపన్నుడవుతాడు.
శ్రీశాంఘ్రిభక్తిం హరిదాసదాస్యం
ప్రసన్న మంత్రార్థదృడైకనిష్ఠాం |
గురోస్మృతిం నిర్మలబోధబుద్ధిం
ప్రదేహి మాతః పరమం పదం శ్రీః ||104||
భావం: విష్ణుభక్తి, దాస్యం, అర్ధం తెలుసుకుని, ఈ మంత్రాన్ని ఏకాగ్రతతో చదవడం, గురువును తలచుకుంటూ, శుద్ధ జ్ఞానంతో పారాయణ చేసే వారు లక్ష్మీ కటాక్షం వలన మోక్షాన్ని పొందుతారు.
పృథ్వీపతిత్వం పురుషోత్తమత్వం
విభూతివాసం వివిదార్థసిద్ధిం |
సంపూర్ణకీర్తిం బహువర్షభోగం
ప్రదేహి మే లక్ష్మి పునః పునస్త్వం ||105||
భావం: ఓ లక్ష్మీ ! నన్ను మరలా మరలా ఈ భూమికి అధిపతిని చెయ్యి. నేను పురుషోత్తముడను కనుక, తరగని కీర్తిని, సకల సంపదలను, సౌఖ్యాలను చాలా ఏళ్ళు అనుభవించేలా దీవించు.
వాదార్థసిద్ధిం బహులోకవశ్యం
వయః స్థిరత్వం లలనాసు భోగం |
పాత్రాదిలబ్ధిం సకలార్థసిద్ధిం
ప్రదేహి మే భర్గవి జన్మ జన్మని ||106||
భావం: ఓ భార్గవీ! జన్మ జన్మలకూ నాకు వాక్ ధాటిని, ఆకర్షణా శక్తిని, దీర్ఘాయుష్షు ను, స్త్రీ సుఖాన్ని, పుత్రపౌత్రాభి వృద్ధిని, సంపదలను, ప్రసాదించు.
సువర్ణవృద్ధిం కురు మే గృహే శ్రీః
సుధాన్య వృద్ధిం కురు మే గృహే శ్రీః |
కల్యాణవృద్ధిం కురు మే గృహే శ్రీః
విభూతివృద్ధిం కురు మే గృహే శ్రీః ||107||
భావం: నా గృహమందు బంగారం వృద్ధి పొందనీ, ధాన్యం పెరగనీ, శుభములు జరగనీ, సంపదలు వృద్ధి పొందనీ, ఓ లక్ష్మీ, నాకు అవన్నీ అనుగ్రహించు.
||శిరోబీజం||
ఓం . యం – హం – కం – లం – వం – శ్రీం ||
ధ్యాయేలక్ష్మీం ప్రహసితముఖీం కోటిబాలార్కభాసాం
విద్యుద్వర్ణాంబరవరధరాం భూషణాఢ్యాం సుశోభాం |
బీజాపూరం సరసిజయుగం బిభ్రతీం స్వర్ణపాత్రం
భర్త్రా యుక్తాం ముహురభయదా మహ్యమప్యచ్యుతశ్రీః ||108||
భావం: చక్కటి చిరునగుమోము, కోటి సూర్యుల తేజస్సు, మెరుపు వర్ణము కల వస్త్రాలు ధరించినది, ఆభరణాలు, దానిమ్మ గింజలు నిండిన సువర్ణ కలశాన్ని చేత ధరించినది, కమల దారిణి, భర్తను అనుసరిస్తూ, అచ్యుతుని తేజస్సుకు కారణమయినది, భక్తులకు మరలా మరలా అభయాన్ని ఇచ్చేది అయిన లక్ష్మిని ధ్యానిస్తున్నాను.
||ఇతి శ్రీలక్ష్మీహృదయం సంపూర్ణం ||