Monday, February 18, 2013

అర్ధనారీశ్వర స్తోత్రం


శ్రీ ఆదిశంకరాచార్య విరచిత 'అర్ధనారీశ్వర స్తోత్రం'....తాత్పర్యం తో సహా మీ అందరి కోసం.
చాంపేయగౌరార్ధశరీరకాయై - కర్పూరగౌరార్ధశరీరకాయ,
ధమ్మిల్లకాయై చ జటాధరాయ - నమః శివాయై చ నమః శివాయ || ౧ ||
తాత్పర్యము : సంపెంగ పువ్వు లాగా యెర్రని అర్ధదేహము కల శివకు(పార్వతికి) నమస్కారము. కర్పూరము వలె తెల్లని అర్ధదేహము కల శివునికి నమస్కారము, కొప్పుకల శివకు, జడలు కల శివునికి నమస్కారము.
కస్తూరికాకుంకుమచర్చితాయై - చితారజఃపుంజ విచర్చితాయ,
కృతస్మరాయై వికృతస్మరాయ - నమః శివాయై చ నమః శివాయ || ౨ || 
తాత్పర్యము : కస్తూరిని కుంకుమను మైపూత గావించుకొనిన శివకు, కాముని బ్రతికించు శివకు నమస్కారము. చితి యందలి బూడిదను పూసుకొనిన శివునకు, మారుని సంహరించు శివునకు నమస్కారము.
ఝణత్క్వణత్కంకణనూపురాయై - పాదాబ్జరాజత్ఫణినూపురాయ,
హేమాంగదాయై భుజగాంగదాయ - నమః శివాయై చ నమః శివాయ || ౩ ||
తాత్పర్యము : ఝణం ఝణమని మ్రోయు కడియములు, అందెలు కలిగిన, బంగారు భుజకీర్తులు కలిగిన శివకు నమస్కారము. పాదపద్మమున విరాజిల్లుచున్న పాపరేడే అందెగా కలిగి , పాము పడగయే కేయూరముగా కల శివునకు నమస్కారాము .
విశాలనీలోత్పలలోచనాయై - వికాసిపంకేరుహలోచనాయ,
సమేక్షణాయై విషమేక్షణాయ - నమః శివాయై చ నమః శివాయ || ౪ ||
తాత్పర్యము : విశాలమయిన నల్లకలువలవంటి కన్నులు కలదియు, వికసించిన యెర్ర తామరలవంటి కన్నులు కలవాడును, సరి కన్నులు కలదియు, బేసి కన్నులు కలవాడు నగు శివకు, శివునకు నమస్కారము .

మందారమాలాకలితాలకాయై - కపాలమాలాంకితకంధరాయ,
దివ్యాంబరాయై చ దిగంబరాయ - నమః శివాయై చ నమః శివాయ || ౫ ||
తాత్పర్యము : మందారపుష్పమాలికచే అలంకరింపబడిన ముంగురులు కల శివకు నమస్కారము. కపాలమాలచే జిహ్నితమయిన కుడివైపుమెడ కల శివునకు నమస్కారము. ఎడమవైపున దివ్యాంబరము, కుడివైపున దిగంబరము అగు అర్ధనారీశ్వర  మూర్తికి నమస్కారము .
అంభోధరశ్యామలకుంతలాయై - తటిత్ప్రభాతామ్రజటాధరాయ,
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ - నమః శివాయై చ నమః శివాయ || ౬ ||
తాత్పర్యము : మబ్బు వలె నల్లని కేశములు కలదియు, మెరుపు తీగల వలె గట్టేర్రనగు జడలను ధరించినవాడును , తన్ను మించు వేరొకరు లేనిదియు , నిఖిలమును మించినవాడునగు శివాశివులకు నమస్కారము .
ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై - సమస్తసంహారకతాండవాయ,
జగజ్జనన్యై జగదేకపిత్రే - నమః శివాయై చ నమః శివాయ || ౭ ||
తాత్పర్యము : ప్రపంచమును సృష్టించుటకు అభిముఖమయిన మృదు నర్తనము కలదియు, సర్వలోక సంహారక మగుచుండ తాండవము కలవాడును, జగజ్జననియు , జగత్పతియు అగు శివకు, శివునికి నమస్కారము.
ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయై - స్ఫురన్మహాపన్నగ భూషణాయ,
శివాన్వితాయై చ శివాన్వితాయ - నమః శివాయై చ నమః శివాయ || ౮ ||
తాత్పర్యము : అధికముగా ప్రకాశించుచున్న రత్నకుండలములు కలదియు , స్పురించుచున్న మహాసర్పమే కర్ణాభరణముగా కలవాడును , సర్వశుభ లక్షణములు కలదియు , సర్వశుభలక్షణములు కలవాడును అగు శివాశివులకు నమస్కారము. 
ఏతత్పఠేదష్టక మిష్టదం యో - భక్త్యా సమాన్యో భువి దీర్ఘజీవీ,
ప్రాప్నోతి సౌభాగ్య మనంత కాలం - భూయాత్సదా తస్య సమస్తసిద్ధిః || ౯ ||
తాత్పర్యము : ఇష్టములను నెరవేర్చు ఈ ఎనిమిది శ్లోకములను భక్తితో చదివేవారు ఈ లోకంలో చిరకాలం జీవిస్తారు. గౌరవములు పొందుతారు. వారికి ,అనంత సౌభాగ్యములు కలిగి, సర్వసిద్ధులు సమకూరుతాయి.

No comments:

Post a Comment