జయదేవుడు -
అష్టపదులు
కొంతమంది
పుట్టుకతోనే భక్తులై, జ్ఞానులై ఉంటారు. 13 వ శతాబ్దానికి చెందిన, వ్యాసుని అవతారంగా భావించే ' జయదేవుడు' ఇటువంటి వారిలో ఒకరు. ఈయన జీవితం, పూర్ణ భావంతో, భక్తి విశ్వాసాలతో, సాధన చేస్తే, భగవంతుడే, అనేక రూపాల్లో వచ్చి మనల్ని రక్షిస్తాడని,తెలియజేస్తుంది. బాల్యంలోనే , ఆశుకవిత్వం చెప్పిన ఏకసంధాగ్రహి, జగన్నాధుని భక్తుడు, జయదేవుడు. ఈయన కీర్తనలు పాడుతుంటే, జగన్నాధ స్వామి లీలలన్ని, కళ్ళకు కట్టినట్టు కనిపించడంవల్ల, ఆ పాటలన్నీ బహుళ ప్రజాదరణ పొంది, ప్రతి నోటా, వినిపించసాగాయి.
జగన్నాధుని
భక్తుడయిన కళింగ రాజు, తన పాటలు కాక, జయదేవుడి పాటలు ఎక్కువ ప్రాచుర్యం పొందడం సహించలేక, పండితుల సలహాతో, ఇరువురి కీర్తనలను ఒక రాత్రి, జగన్నాధుని గుడిలో ఉంచుతాడు. ఉదయానికి, రాజుగారి గ్రంధం ముక్కలుముక్కలయ్యి ఉండడం చూసి, రాజు అభిమానపడి, ప్రాణత్యాగం చెయ్యబోతాడు. అప్పుడు
జగన్నాధుని విగ్రహంలో నుంచి, 'రాజా! మీ ఇద్దరి కవితలూ గొప్పవే, ఈర్ష తో, అధికార బలంతో, నువ్వు ప్రవర్తించడం వల్ల, నీ కీర్తనలు నేను స్వీకరించలేదు, ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి కనుక, నీ పాటలను కూడా కొన్నిటిని
స్వీకరిస్తున్నాను,' అన్న మాటలు వినిపించాయి.
జయదేవుని భార్య
పద్మావతి, అతని కవితా స్పూర్తి. ఆయన రాసిన గీతాలను, తన అసమాన నాట్య పటిమతో, చక్కగా అభినయించి చూపేది. ఆ మహా
భక్తుని, భార్యగా ఉండడం గొప్ప అదృష్టంగా భావించిన మహాపతివ్రత ఆమె. ఒక సారి, జయదేవుడు ప్రక్క ఊరిలో, భాగవత సప్తాహం చేసాడు. జయదేవుడు ప్రతిఫలం
ఆశించడని తెలిసిన షావుకారు, నలుగురు సేవకులను రహస్యంగా ఆయన వెంట వెళ్లి, తనిచ్చిన మణిమాణిక్యాలు, బంగారం, , పద్మావతికి ఇచ్చిరమ్మని పంపాడు. ఆ
నలుగురు సేవకులూ,స్వార్ధంతో కుమ్మక్కయ్యి, జయదేవుడి, కాళ్ళు-చేతులు నరికేసి, ఒక పాడుబడిన బావిలో పడేసారు. ఆ
దారిలో వెళుతున్న వింధ్య రాజు, బావిలోంచి, 'కృష్ణా! కృష్ణా!' అన్న మాటలు విని, ఆయనను బయటకు తీయించేసరికి, లీలగా, ఆయన కాళ్ళు- చేతులు తిరిగి వచ్చేసాయి. ఆ రాజు జరిగింది తెలుసుకుని, సంతోషించి, తన రాజ్యంలో కూడా భాగవత సప్తాహం
జరపాలని,ఆయనను పద్మావతీ సమేతంగా తీసుకువెళ్ళాడు. ఆ సప్తాహానికి, లోగడ ఆయనను బావిలో పడేసిన నలుగురు దొంగలూ వచ్చారు. భక్తి
పారవశ్యంలో ఉన్న జయదేవుడు, వాళ్ళను చూడగానే, హఠాత్తుగా వెళ్లి, కౌగిలించుకున్నాడు. వాళ్ళను
సత్కరించి పంపాల్సిందిగా, రాజుకు చెప్పాడు. అయితే, వెళ్ళే దారిలో, వాళ్ళు మట్టిలో సగానికి కూరుకుపోయారు.
జయదేవుడికి, వారి దీనావస్థకు, దయ కలిగి, 'హే కృష్ణా! వీళ్ళను రక్షించు తండ్రి!' అని ప్రార్ధించాడు. భక్తుని మాట మన్నించి, వారిని రక్షించాడు దేవుడు.
పద్మావతికి, వింధ్య రాణికి మంచి స్నేహం కుదిరింది. ఒక రొజు, రాణి గారు పంతం కొద్దీ, పద్మావతిని పరీక్షించాలని, భటుడితో, 'జయదేవుడు, వేటలో పులి బారిన పడి చనిపోయాడని', అబద్ధం చెప్పిస్తుంది. ఆ వార్త
వినగానే, ప్రాణాలు విడుస్తుంది పద్మావతి. సిగ్గుతో ప్రాయశ్చితం చేసుకోబోయిన
రాజదంపతులను, జయదేవుడు వారించి, ఒక అష్టపదిని గానం చేస్తాడు. శ్రీ
కృష్ణ పరమాత్మ కరిగిపోయి, పద్మావతిని తిరిగి బ్రతికించాడు. ఈ
ఉదంతం, అష్టపదులకు ఉన్న మహత్తును, సంజీవిని శక్తిని తెలియజేస్తుంది.
అసలు “జయదేవుడు” అనగానే, ఎవరికైనా అష్టపదులు గుర్తుకు వస్తాయి. ఈ అష్టపదులు 'గీతగోవింద మహాకావ్యం' లోనివి. ఇందులో మొత్తం 24 అష్టపదులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి, ప్రత్యేకమయిన రాగంతో, తాళంతో రచింపబడ్డాయి. ఈ గీతి
కావ్యంలో ఉన్నది మూడే పాత్రలు – రాధ, కృష్ణుడు మరియు సఖి. విరహవేదన ఈ
కావ్యంలోని విషయం.
ఇందులో లౌకికంగా
శృంగారం కనిపించినా, ఆధ్యాత్మికతే ప్రధాన విషయం. భక్తి, శృంగారం ఇందులో ఎంతో మధురంగా
కలసిపోయాయి. ఇందులోని సఖి నాయికా-నాయకుల విరహవేదనను పరస్పరం తెలియజేసి వారిని
సన్నిహితపరచడానికి ప్రయత్నిస్తూ – ప్రేయసీ ప్రియుల ఆనంద సమాగమానికి
తోడ్పడుతుంది. అష్టపదులలోని అర్ధాలను మనం చక్కగా విశ్లేషణ చేసి, ఆ మహాత్ముడి హృదయాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి.
తనను తాను
ప్రేమించని మనిషి ఉండడు కదా! అలా, మీరెంతో, ప్రేమించే మీ ప్రాణాన్నిరెండు భాగాలు చేసి, ఇద్దరు వ్యక్తుల్లో పెట్టారనుకోండి , అప్పుడా రెండు ప్రాణాలు కలవడానికి
ఎంతగా తపిస్తాయి? ఉదాహరణకు, ఒకరినొకరు అమితంగా ప్రేమించే
భార్యా- భర్తలు, ప్రేయసీ- ప్రియులు ఉన్నారనుకోండి, వారి అనుబంధం ఎలా ఉంటుంది? ఒకరి కన్నీరు ఉప్పెనై మరొకరిని కలచివేస్తుంది. ఒకరి సంతోషం
పూలజల్లై మరొకరిని పులకింపచేస్తుంది. వారు లేని మన జీవితం వ్యర్ధం అనిపిస్తుంది.
కలయిక వసంతం, ఎడబాటు - పొరబాటు గ్రీష్మం, విరహం -బాధ శిశిరం, అనురాగం వర్షం, మమత శరదృతువులవుతాయి. అన్ని ఋతువులూ
మేళవించిన భావాలు వీటిల్లో కనిపిస్తాయి. ఇదీ లౌకికంగా, సరళ భాషలో చెప్పాలంటే, అష్టపదులలోని భావ ఝరి.
ఇక ఆధ్యాత్మికంగా
చెప్పాలంటే, ప్రతి ప్రాణి ఆత్మ(జీవాత్మ) ,ఆ పరమాత్మ నుంచి ఉద్భావించినదే! మన
పురాణాల పరంగా, మానవ జీవిత పరమార్ధం, జీవాత్మ అనుక్షణం పరమాత్మ కోసం
తపించి, జపించి, తిరిగి ఆ పరమాత్మలో లీనమవ్వడమే.
దీన్నే మోక్షం అంటారు. కోట్లాది మందిలో ఏ కొద్ది మందికో, ఆ ఉన్నతి పొందే అర్హత, జ్ఞానం ఉంటాయి.
భక్తుడు తనను
తాను నాయికగా భావించి భగవంతుని పొందుకోసం చెందే ఆరాటమే *మధుర భక్తి*. ఈ మధుర భక్తి
సంప్రదాయమే, అష్టపదుల కావ్య వస్తువు. రాధ జీవాత్మ, కృష్ణుడు పరమాత్మ. జీవేశ్వరుల ఐక్యమే, ఇందులోని రహస్యం. ఈ అష్టపదులలో, అష్టాక్షరీ మంతమయిన 'ఓం నమో నారాయణాయ' వలె, ఎనిమిది చరణాలు ఉంటాయి. శ్రీ భాగవతం వలె, 12 భాగాలుగా (సర్గలుగా) విభజించబడింది.
అహంకారంతో అలమటించే రాధను చెలికత్తె(ఆచార్యస్థానీయురాలై) బృందావనంలో విహరించే
శ్రీకృష్ణ వైభవాన్ని చెబుతూ, శ్రీకృష్ణుని దగ్గరకు చేరమని
ప్రోత్సహిస్తుంది. రాధ మధురభాక్తితో, కృష్ణుని చేరడం ఇందులోని విశిష్టత.
ఎల్లప్పుడూ, యమునా తీరంలో ఇసుక తిన్నెల మీద, చల్లని పిల్ల గాలులు వీస్తుంటే, పిల్లన గ్రోవి ఊదుతూ, సంచరించే శ్రీకృష్ణుడిని, నిరంతరం హృదయంలో తలచుకుంటూ, జయదేవుడు ఉన్మాదిగా, కృష్ణాన్వేషిగా, అస్థిరుడిగా తిరిగేవాడు. 19 వ అష్టపది,' ప్రియే..చారుశలే..' లో, రాధ కోపాన్ని తగ్గించడానికి, శ్రీకృష్ణుడి వేడుకోలును వర్ణిస్తూ, 'రాధా,చిగురుటాకుల వంటి నీ కోమలమయిన పాదాలను
నా శిరసుపై ఉంచు, అవి నా విరహాగ్నిని ఉపశమింప చేస్తాయి( స్మర గరళ ఖండనం మామ శిరసి
మండనం దేహి పద పల్లవ ముదారం..) అన్న చరణాన్ని వ్రాసి, ,దేవుడి తలపై రాధ పాదాలు ఉంచమనడం తప్పని ,భావించిన జయదేవుడు చింతించి ,ఆ చరణాన్ని తొలగించి, స్నానానికి వెళతాడు. తిరిగి వచ్చేటప్పటికి తను మొదట వ్రాసిన పదాలే,అక్కడ వ్రాసి ఉండడం చూసి, ఆశ్చర్యపోతాడు. జయదేవుడి రూపంలో
సాక్షాత్తు, ఆ శ్రీకృష్ణుడే వచ్చి, ఆ పదాన్ని పూర్తి చేసి, భోజనం చేసి వెళ్ళాడని, తన భార్య ద్వారా తెలుసుకుని,అమితానందం పొందుతాడు. ఈ విధంగా ఈ కావ్య రచన ద్వారా, జయదేవుడికి భగవత్ దర్శనం లభించింది కనుక, 19 వ అష్టపదిని 'దర్శనాష్టపది ' అంటారు. ఇందులోని పదాలు పంచదారపలుకులు, వర్ణనలు వెన్నెల తునకలు, మాధుర్యం, కోమలత్వం మేళవించిన అపూర్వ కావ్యం…. గీత గోవిందం.
అష్టపది -1
మొదటి అష్టపదిలో,దశావతారాలను స్తుతించి, తన కావ్యం నిర్విఘ్నంగా పూర్తి
కావాలని ప్రార్ధిస్తారు, జయదేవులు. 'మత్స్యావతారంలో, వేదాలను ఓడవలె ఉద్ధరించావు, కూర్మావతారంలో, ఇంకా భూమిని మోస్తున్నావు, వరాహావతారంలో, నీ కోరలందు ఎత్తిన భూమి, చంద్రునిలో మచ్చలా నల్లగా ప్రకాశిస్తోంది.
వసతి దశన శిఖరే
ధరణీ తవ లగ్నా
శశిని కళంక కలేవ
నిమగ్నా ।
కేశవ! ధృత
సూకరరూప! జయ జగదీశ! హరే! ॥
నారసింహావతారంలో
తామర పూవు లాంటి కొనగోటితో, హిరణ్యకశిపుని చీల్చేసావు, వామనావతారంలో ముల్లోకాలు ఆక్రమించి, నీ కాలి గోటి నుంచి గంగా నదిని
సృష్టించావు.
తవ కరకమల వరే
నఖమద్భుత శృంగం
దళిత హిరణ్యకశిపు
తను భృంగం ।
కేశవ! ధృత
నరహరిరూప! జయ జగదీశ! హరే! ॥
శ్రీరాముడివై, లోకక్షేమం కోసం దశకంఠుడిని కూల్చావు. బలరామ రూపంలో నాగలి దెబ్బకు,యమునానది పరుగెత్తి నీ వైపు వచ్చేలా చేసావు. కృష్ణావతారంలో, పశుబలి నిరోధించావు, కల్క్యవతారంలో తోకచుక్క వంటి
కత్తితో, దుర్మార్గులను సంహరించడానికి అవతరిస్తావు.'అంటూ కీర్తిస్తారు.
వేదానుద్ధరతే
జగంతి వహతే భూగోళ ముద్బిభ్రతే
దైత్యం దారయతే
బలిం ఛలయతే క్షత్రక్షయం కుర్వతే ।
పౌలస్త్యం జయతే
హలం కలయతే కారుణ్యమాతన్వతే
మ్లేచ్ఛాన్మూర్ఛయతే
దశాకృతి కృతే కృష్ణాయ తుభ్యం నమః ॥
*********************************************************************************
అష్టపది -2
శ్రిత కమలా
కుచమండల! ధృత కుండల! ఏ
కలిత లలిత వనమాల!
జయ జయ దేవ! హరే! ||
దినమణిమండల మండన!
భవ ఖండన! ఏ
మునిజనమానస హంస!
జయ జయ దేవ! హరే! ॥
కాళియ విషధర
గంజన! జన రంజన! ఏ
యదుకులనళిన
దినేశ! జయ జయ దేవ! హరే! ॥
రెండవ అష్టపదిలో, శ్రీకృష్ణుడి గుణ రూప వర్ణన. 'పాదాల వరకు తులసి మాల ధరించినవాడు,కుండల ధారి, ముని మానస సంచారి, యదు కులోద్ధారి, కాళీయ సంహారి, సూర్యమండలాన్ని వెలిగించేవాడు, రాక్షస సంహారి, భాక్తజనోద్ధారి, నవ నీల మేఘ సుందరుడు, మంధర ధారి,మునుపు రామావతారి, అగు శ్రీకృష్ణుడి పాద పద్మాలకు మంగళం.' అంటూ మంగళ గీతం
సమర్పిస్తారు.
శ్రీ జయదేవ
కవేరిదం కురుతే ముదం ఏ
మంగళముజ్జ్వల
గీతం జయ జయ దేవ! హరే! ॥
*********************************************************************************
అష్టపది -3
3 వ అష్టపదిలో , అద్భుతమయిన బృందావన వర్ణన
ఇవ్వబడింది ...
వసంత ఋతువులో
కృష్ణ విరహంతో, కృష్ణుడిని వెతుకుతూ, వడిలిన అడవి మల్లె పువ్వు లాగా , సుకుమారమయిన శరీరంతో విహరిస్తున్న
రాధతో, చెలికత్తె, ఇలా అంటున్నది.
మన మనసులు కూడా
గోపికలై, యమునా తీరవిహారి అయిన కృష్ణుడిని, వేణు గాన సమ్మోహనుడిని, బృందావనంలో దర్శిస్తున్నట్టుగా భావించుకుందాం. బృందావనం...
లలిత లవంగ లతా
పరిశీలన కోమల మలయ సమీరే ।
మధుకర నికర
కరంబిత కోకిల కూజిత కుంజ కుటీరే ॥
విహరతి హరిరిహ
సరస వసంతే నృత్యతి
యువతీ జనేన సమం
సఖి! విరహి జనస్య దురంతే ॥
వసంత ఋతువు...
చల్లని గాలి కోమలమయిన లవంగ తీగల పైనుంచి వీస్తోంది... తుమ్మెదల ఝుంకారాలు , కోకిల రావాలు కలసి, పొదరిళ్ళలో ప్రతిధ్వనిస్తున్నాయి.
పొగడ పూల గుత్తుల మీద వాలే గండు తుమ్మెదలతో నిండు వసంతం ప్రకాశిస్తోంది.
కానుగ చెట్లను
అల్లుకున్న చిగురుటాకులతల నుండి, కస్తూరి వాసనలు విరజిమ్ముతున్నాయి.
విరహాన్ని చీల్చే ,మన్మధుడి పదునయిన గోళ్ళ వంటి మోదుగ పూలతో వసంత ఋతువు శోభాయమానంగా
ఉంది.
మదన మహీపతి కనక
దండ రుచి కేసరకుసుమ వికాసే ।
మిళిత శిలీముఖ
పాటల పటల కృత స్మర తూణ విలాసే ॥
మన్మధరాజుకు
పట్టిన బంగారు గొడుగులా ఉన్న నాగకేసర పుష్పాలు( నాగమల్లి పూలు) గమ్మత్తయిన
పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. పాటల పుష్పాలపై గుంపులుగా వాలిన తుమ్మెదలు, మన్మధుడి అంబుల పొదిలా కనిపిస్తున్నాయి.
వికసించిన మొగలి
పూలు, తెల్లటి కరుణ వృక్షాల పూలు, మన్మధుడి 'కుంతలమనే' ఆయుధం లాగ, విరహుల గుండెలు రగులుస్తున్నాయి.
మాధవికా పరిమళ
లలితే నవ మాలతి జాతి సుగంధౌ ।
ముని మనసామపి
మోహనకారిణి తరుణా కారణ బంధౌ ॥
గురివింద తీగలు
అల్లుకున్న మామిడి చెట్లతో,మాలతీ, మాధవీ పూల వాసనలు గుబాళిస్తుండగా, మునులను సైతం లొంగ దీయగల పరిమళం
అంతటా వ్యాపించి ఉంది.
యమునా నదీ జలాలతో
పవిత్రమయిన ఆ బృందావనంలో, కృష్ణుడు ప్రియురాండ్లతో కలిసి, ఆనందంగా ఆడుతూ, పాడుతూ విహారం చేస్తున్నాడు. ఆ
ప్రదేశానికి పోదాం రావమ్మ, రాధా!
దర విదళిత మల్లీ
వల్లి చంచత్పరాగ
ప్రకటిత పట
వాసైర్వాసయన్కాననాని ।
ఇహ హి దహతి చేతః
కేతకీ గంధ బంధుః
ప్రసర దసమబాణ
ప్రాణవద్గంధవాహః ॥
అప్పుడే విరిసే
మల్లెల పరిమళాలను, గేదంగి పూల పరిమళాలను మోసుకొస్తున్న వసంత గాలి,మన్మధుడి ప్రాణ వాయువులా ఉంది. మావి చిగురులు తిన్న కోకిలా రావాలు, మకరందం త్రాగిన గండు తుమ్మెదల ఝుంకారాలు, బాటసారుల మనసులో, తమ ప్రియురాళ్ళ తలపులను రేపుతూ, ఆరాటపెడుతున్నాయి. ఇట్టి వసంతంలో, అనేక నారీమణుల మధ్య సమీపంగా, క్రీడిస్తున్న కృష్ణుడిని, రాధకు చూపిస్తూ, చెలికత్తె, ఇలా అంటున్నది.
****************************************************************************
అష్టపది -4
చందన చర్చిత నీల
కళేబర పీతవసన వనమాలీ ।
కేలి చలన్మణి కుండల
మండిత గండ యుగ స్మిత శాలీ ॥
హరిరిహ ముగ్ధ
వధూనికరే విలాసిని విలసతి కేళి పరే ॥
'ఓ రాధా, చందనము పూసిన నల్లని దేహము కలవాడు, పీతాంబరం( పసుపు పట్టు వస్త్రం),తులసిమాల ధరించినవాడు, చెవులకు కదలాడే మణి కుండలాలు
ధరించిన వాడు, అయిన కృష్ణుడు, ముగ్ధలయిన గోపికలతో నవ్వుతూ, విలాసంగా ఉన్నాడు.
పీన పయోధర భార
భరేణ హరిం పరిరభ్య సరాగం ।
గోప వధూరనుగాయతి
కాచిదుదంచిత పంచమ రాగమ్ ॥
కాఽపి విలాస
విలోల విలోచన ఖేలన జనిత మనోజం ।
ధ్యాయతి ముగ్ధ
వధూరధికం మధుసూదన వదన సరోజమ్ ॥
ఒక గోపిక
కృష్ణుడి నేత్ర విలాసం వల్ల, మోహ వశురాలై, మైమరచి, అతడి ముఖాన్నే చూస్తోంది. మరొక
గోపిక కృష్ణుడిని, ఆలింగనం చేసుకుంటోంది, మరియొక గోపిక జలక్రీడలకు కృష్ణుడిని
ఆహ్వానిస్తోంది. ఒక యువతి, అతని వేణు గానానికి అనుగుణంగా, గాజుల చప్పుడుతో నృత్యం చేస్తూ, అతడి మెప్పు పొందుతోంది.
కాఽపి కపోల తలే
మిలితా లపితుం కిమపి శ్రుతి మూలే ।
చారు చుచుంబ
నితంబవతీ దయితం పులకై రనుకూలే ॥
కేళి కళా కుతుకేన
చ కాచిదముం యమునా జల కూలే ।
మంజుల వంజుల కుంజ
గతం విచకర్ష కరేణ దుకూలే ॥
కర తల తాళ తరళ
వలయావళి కలిత కలస్వన వంశే ।
రాసరసే సహ నృత్య
పరా హరిణ యువతీ ప్రశశంసే ॥
కృష్ణుడు ఒక
కాంతను కౌగిలించు కొనుచున్నాడు, ఒక భామను ముద్దులాడుతున్నాడు, ఒకామె వెంట పడుతున్నాడు, ఒక కాంతను సంతోషపెడుతున్నాడు. అలా
మనోహరుడయిన ఆ హరి,అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ, నల్ల కలువల వంటి కోమలమయిన
అవయువములతో మదనోత్సవం జరిపిస్తూ, గోపికల అంతరంగం, బహిరంగము చేతా ప్రేమించ బడుతున్నవాడై, విహరిస్తున్నాడు.
శ్లిష్యతి కామపి
చుంబతి కామపి రమయతి కామపి రామాం ।
పశ్యతి సస్మిత
చారు తరామపరామనుగచ్ఛతి వామామ్ ॥
శ్రీ జయదేవ
భణితమిద మద్భుత కేశవ కేళి రహస్యం ।
బృందావన విపినే
లలితం వితనోతు శుభాని యశస్యమ్ ॥
ఆ సమయంలో, ప్రేమాతిశయం చేత పరవశించిన రాధ, కృష్ణుని కౌగలించుకుని, 'కృష్ణా! నీ వదనము సుధామయము. అందుకే, నీవు పాడే ప్రతి గీతం అమృతమయంగానే
ఉంటుంది,' అని పొగుడుతూ, ఆ నెపంతో చుంబిస్తూ ఉండగా, ముగ్ధమనోహరంగా నవ్వుతూ ప్రకాశిస్తున్నాడు కృష్ణుడు.
ఇక్కడ చిన్న
విషయాన్ని గమనించాలి. ప్రతి ప్రాణి, భగవంతుడిని అన్వేషిస్తూ, ధ్యానిస్తూ, తమకు అత్యంత ఆప్తుడు భగవంతుడేనని
భావిస్తూ,తమ కష్టాలను నివారించమని, జ్ఞానాన్ని ప్రసాదించి, మంచి నడవడిక ఇవ్వమని, తమకి తోడూ- నీడగా ఉండమని, భగవంతుడికై తపిస్తూ ఉంటుంది. సూక్ష్మంగా, ఆత్మ తన మజిలీ అయిన పరమాత్మకై అతని ప్రేమకై, అనుగ్రహానికై తపిస్తుంది. అయితే అందరికీ ఆధ్యాత్మికంగా అంత స్థాయి, పరిణితి ఉండకపోవచ్చు. భగవంతుడు కరుణామూర్తి కనుక 'యద్ భావం తద్ భవతి...' అంటే, ఎలా ఎవరు కోరుకుంటారో, అలా అనుగ్రహిస్తాడు. ఎంతో గొప్పదయిన ఈ రహస్యం, సులభంగా మనకు అర్ధం కావడానికి,జయదేవకవి గోపికల పరంగా, రాధ పరంగా రచించి మనకు అందించారు.
అందుకే, కేవలం ఈ కావ్యాన్ని, కేవలం శృంగార పరంగా కాక, ఆధ్యాత్మిక పరంగా అర్ధం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. మరి భగవంతుడు
మనను సరిగ్గా అనుగ్రహించడం లేదని, తన పక్కవారినే చక్కగా వెన్నంటి
కాపాడతాడని, కోరిన కోరికలన్నీ తీర్చట్లేదని, ఆయన మీద అలిగేస్తాం కదా! ఇదే భావం
రాధ పరంగా చెబుతున్నారు కవి. కృష్ణుడు అందరు స్త్రీలను, తనతో సమానంగా భావించడం, రాధకు ఈర్ష కలిగించింది. తను, మిగిలిన గోపికలు సమానం ఎలా అవుతారు. తన పట్ల ఎక్కువ ప్రేమ
చూపించాలి కదా! అందుకే అలిగి, ఒక పొదరింట చేరి, దుఖంతో, తన చెలికత్తెతో ఇలా అంటున్నది...
*****************************************************************************
అష్టపది 5 :
'ఓ చెలీ, కృష్ణుడు నన్ను లెక్క సేయక, పరిహసించినా, నా మనసు ఆ వేణుగాన సమ్మోహనుడినే కోరుకుంటోంది. మేఘాల్లో ఇంద్రధనస్సులా, నల్లని కేశాల్లో గుండ్రటి నెమలి
పింఛము ధరించిన కృష్ణుడు, నాలో ఉన్నాడు.
మంకెన పువ్వు
వంటి ఎర్రనయిన పెదాలపై చిరునగవుతో ప్రకాశించేవాడు, తన మణి భూషణాల కాంతితో, చీకటిని పోగొట్టు వాడు అయిన కృష్ణుడు నాకు గుర్తొస్తున్నాడు. మేఘాల
మధ్య చందమామలా- నుదుట కస్తూరి తిలకం ధరించినవాడు, నా కొరకు రావి చెట్టు మొదట ఎదురు
చూసేవాడు, నా మానస చోరుడు, కలి కల్మషము నివారించువాడు, అనేక మంది పులకిత గోపికలచే చుట్టబడినవాడు, నారదాది మునులచే, ఇంద్రాది దేవతలచే
సేవింపబడుతున్నవాడయిన , ఆ మోహనుడినే, నా మనసు స్మరిస్తున్నది...' నన్ను విడచి ఇతరులతో
క్రీడించువాడునూ, యువతులలో ఎంతో తృష్ణ గలవాడును అయిన కృష్ణుని మరలా నామనస్సు
కోరుకొనుచున్నది. నా మనసు అతని గుణగానమే చేయుచున్నది. భ్రమచేతనైనా అది అతని పట్ల
కోపము పొందదు. అతని దోషములను మరచుచున్నది. పైగా సంతోషము పొందుచున్నది. ఏమి చేయనే చెలీ!
ఓ సఖి, చిన్న చిన్న పువ్వుల గుత్తులతో సొగసైన అశోక వృక్షములు గల సరస్సులతో, విరాజిల్లు ఉద్యానవనములలోని గాలి
సయితం నన్ను
బాధిస్తున్నది. తుమ్మెదల గానముచే రమణీయమైన శిఖరాలు గల మామిడి చెట్ల మొగ్గలు సైతం
నాకు సుఖకరంగా లేవు. తియ్యటి చిరునవ్వు మాటలతో, నన్ను మురిపించువాడు, నా అనురాగాన్ని అర్ధం చేసుకుని, నన్ను రంజింప చేయువాడు, అయిన కృష్ణుడికి, నామనసు తెలిపి, ఇక్కడికి తీసుకురావే!' అంటూ, తన విరహ వేదనను అంతా వివరించి, అభ్యర్దిస్తుంది రాధ.
మిత్రులారా, నిజమయిన మనసు భగవంతుడి భావనలో లీనమయినప్పుడు, మన స్థితి అతనికి విన్నవించాలా? అక్కడ రాధ మనసు తెలిసిన మాధవుడిది, అదే పరిస్థితి. రాధను బాధించితినే, అని పశ్చాత్తాప పడుతున్న గోవిందుడు, గోపికలందరినీ త్యజించి, రాధని వెదుకుతూ, ఒక పొదరింటిలో విషాదంగా కూర్చుని, తనలో తను ఇలా అనుకుంటున్నాడు,' గోపికలతో కూడి ఉన్న నన్ను చూసి, రాధ అలిగి వెళ్ళిపోయింది. నేను అపరాధిని కాబట్టి వెళ్లోద్దని, చెప్పలేకపోయాను. నా ప్రియురాలు, రాధ లేని నాకు ధనమెందుకు, ఇల్లెందుకు, జీవితమెందుకు? కోపంతో ఎర్రబడ్డ రాధ మొహం, తనపై వాలే తుమ్మెదలను చూసి, చికాకుపడే ఎర్రతామరలా ఉంది. అయినా, నేను ఎక్కడో రాధను వెదుకుతూ,బాధపడడం ఎందుకు?
నా మనసులోనే ఉన్న
రాధకు, నా వేదన విన్నవించుకుంటాను. ఓ చెలీ! నా అపచారం వల్ల నీవు మనసు
కష్టపెట్టుకున్నావు. లేకపొతే, ఎందుకు నన్ను విడిచి వెళతావు? నీకు దణ్ణం పెడతాను, బ్రతిమాలుకుంటాను. నన్ను మన్నించు. నీవు నా ఎదుటే తిరుగుతున్నట్టు , నాకు అనిపిస్తోంది. నన్ను కరుణించి, నీ దర్శన భాగ్యం ఇప్పించు.'
చూసారా, దేవ దేవుడికి ఎంత నిరాడంబరతో. నిజమయిన మనసుతో ఆర్తిగా తపించే, భక్తుడి కోసం భగవంతుడూ, అంతగానే తపిస్తాడు. భక్తి మార్గం
దుర్లభం, ప్రేమ మార్గం సులభం. అందుకే, జయదేవ కవి,ప్రేమను కావ్య వస్తువుగా ఎన్నుకున్నారు. అంతర్లీనంగా భక్తి
సందేశాన్ని ఇచ్చారు. రాధ అంత ప్రేమతో తపిస్తే, అది ఆమె మనసులోనే ఉన్న కృష్ణుడిని
చేరకుండా ఎలా ఉంటుంది? భగవంతుడయినా సులభుడే. ప్రేమంటే
ఏమిటి? నేను, నాది అన్న ఎల్లలు ,అహంకారం చెరిగిపోయి, మనము, మనది అన్నబంధంతో అల్లుకుపోవడమేగా!
నువ్వు లేని నేను అసంపూర్ణమని, వ్యర్ధమని, భావించడమేగా.
కృష్ణుడు, మన్మధుడితో ఇలా విన్నవించుకుంటున్నాడు, 'ఓ మదనా, ప్రియురాలు లేని నన్ను శివుడిగా
భావించి, నాపై నీ పుష్ప బాణాలు విసరకు. నా మెడలోని తామరతూడుల హారాన్ని, సర్పమని భావించకు. చందనమును భస్మము అనుకోకు, మెడకు అంటిన నల్ల కలువ రేకులు విషము కాదు. అసలే నేను నా ప్రియురాలి
కనుబొమలనే విల్లు నుంచి, ఎక్కుపెట్టిన చూపులనే బాణ పరంపరతో
గాయపడి ఉన్నాను.
నల్లటి పెద్ద జడ, వెచ్చటి స్పర్శ అందమయిన ముఖ కవళికల విలాసాలు, దొండపండు లాంటి పెదవులు, చక్కటి వాక్చాతుర్యం, ఎంతటి ముగ్ద రాధ! నీ అస్త్రాలన్నింటిని, రాధాలో అమర్చి, నాపై సంధించావా? లేకపొతే, నా మనసు ఎంతగా ఆమెలో లీనమై, ఆరాధిస్తూ ఉన్నా, ధ్యానిస్తూ ఉన్నా, విరహ వేదన ఎందుకు తగ్గడంలేదు?'అలా ,యమునా తీరంలోని పొదరింటిలో , నిరాశగా ఉన్న కృష్ణుడి వద్దకు రాధ చెలికత్తె వచ్చి ఇలా అంటోంది.
చెలీ వర్ణనలు అద్భుతంగా ఉంటాయి, చదవండి.
(సావిరహే తవ దీనా... 8 వ అష్టపది)
'ఓ కృష్ణా, నీ ఎడబాటు వల్ల దుఖితురాలయిన రాధ, మన్మధుడి బాణాలకు భయపడి, నీ మనసులోనే దాక్కుంటోంది. చల్లటి
చందనాన్ని, చందన వృక్షపు గాలులను, విషంగా భావిస్తోంది. చంద్రకిరణాలను
దూషిస్తోంది. మన్మధుడు తనపై సంధించే బాణాలు, తన మనసులో ఉన్న నీకు తగిలి, నిన్ను బాదిస్తాయేమో, అని తామారాకులను తన ఎదపై కవచంగా
ధరిస్తోంది. కుసుమ తల్పంపై, నీ విరహంతో, మేఘములవలె కన్నీళ్ళు కురిసే కళ్ళతో, రాహువు కొరికిన చంద్రుడిలా ఉంది
రాధ. కస్తూరితో నీ రూపాన్ని చిత్రించి, భరించరాని వేదనతో, నిన్నే తలస్తూ, వెర్రిగా నవ్వుతూ, పరిగెడుతూ, ఏడుస్తూ, నిన్నేధ్యానిస్తున్నది. 'ఓ గోవిందా! నీ చరణాలను ఆశ్రయిస్తాను, నన్ను కరుణించు,' అని ప్రార్ధిస్తున్నది.
'ఓ కృష్ణా! రాధ నీ వియోగం వల్ల
కృశించినది. ఆమె తన నిట్టూర్పులనే కార్చిచ్చుచే దహింపబడుతోంది. కాడలూడిన కమలము లాగ, కన్నీరు నిండిన కళ్ళతో, నువ్వు వస్తావేమోనని,మాటి మాటికీ, ప్రతి దిక్కును చూస్తోంది. వియోగ
బాధతో మరణించు దాని వలె, 'హరీ, హరీ' అని జపిస్తోంది. అయినా, నీ క్షణకాల విరహాన్ని భరించలేని రాధ,ఇంత సుదీర్ఘ ఎడబాటును ఎట్లు
భరించగలదు? ఈ స్థితి నుండి ఆమెకు విముక్తి కలికించని ఎడల, నీవు వజ్రము కన్నా కఠినుడవని, అనిపించుకోగాలవు సుమా !.' అంది.
అప్పుడు చెలితో, కృష్ణుడు, తాను ఒక పూతీగ వద్ద ఉంటానని, రాధను అక్కడికి తీసుకు రమ్మని, చెబుతాడు. సఖి రాధను చేరి, తనతో ఇలా అంటున్నది.
'రాధా, కృష్ణుడు నీ వియోగంతో ఎంతో బాధ
పడుతున్నాడు. వికసించే పూవులు, చల్లని గాలి, చంద్ర కిరణాలను నిందిస్తున్నాడు. తుమ్మెదల ఝుంకారాలు వినలేక, చెవులు మూసుకుంటున్నాడు. మనోహరమయిన తన గృహాన్ని వదిలి, అడవుల వెంట తిరుగుతున్నాడు. అంతటి ఆ కృష్ణపరమాత్మ నేలమీద
దొర్లుతున్నాడు.. వైశాఖ మాసాన్ని, రాధా మాసమని అందరూ అంటుంటే, ఆ మాసాన్నిస్మరిస్తూ ఉన్నాడు, అన్య కాంతలను కోరట్లేదు. వనమందు
పక్షి రెక్క పడినా, ఆకు కదలినా, నువ్వు వస్తున్నావని, ఎదురు చూస్తున్నాడు. నీ మేని ధూళి సోకినా చాలని, భావిస్తున్నాడు. నువ్వు పక్కనున్నప్పుడు, నీ మెడలోని
ముత్యాల హారం, నల్లని కృష్ణుడి పై పడినప్పుడు, అతడు, తెల్లని కొంగలున్న మేఘములా ప్రకాశిస్తాడు.అప్పుడు
నీవు మేఘం పై మెరుపులా వెలుగుతావు.
బంగారు వన్నె కల
రాధా, విశాల నేత్రీ ! యమునా తీరంలో, వేణువుపై నీ పేరుతో కృష్ణుడు
పాడుతున్నాడు. గోవిందుని విచారమయిన మనసులా, అంతటా చీకటి అలముకుంది. ఎంతో
అభిమానం కల కృష్ణుడిని, ఆలస్యం చెయ్యక చేరుకో.' అని చెప్పింది.
గోవిందుడి వద్దకు
వెళ్ళడానికి కూడా, శక్తి లేని రాధ, పొదరింటి వద్దకు, కృష్ణుడినే తీసుకురమ్మని పంపుతుంది. చెలి కృష్ణుని చేరి, ' కృష్ణా, రాధ నీ దగ్గరకు రావాలని, ఆనందోత్సాహముతో బయలుదేరి, విరహవేదన చేత అడుగులు తడబడగా, నడవలేక నేలపై పడిపోతున్నది. నీ కోసం అన్నీ దిశలా వెదుకుతున్నది.
తనను తాను చక్కగా అలంకరించుకుని, తానే నీవని భ్రమిస్తోంది. చీకటినే, నీవనుకుని, కౌగిలించుకుంటోంది.'అని రాధను గురించి వివరిస్తుండగా, చంద్రోదయమయ్యింది. బృందావనమంతా, పండు వెన్నెల వ్యాపించింది. చంద్రోదయం మూలంగా, రహస్యంగా కలసుకోవడం కుదరదు కనుక, కృష్ణుడు లేకుండా, విషాదంతో, నోట మాట రాక, ఒంటరిగా వచ్చిన సఖిని చూసి, రాధ కృష్ణుడిని అపార్ధం చేసుకుని, నిందిస్తుంది. 'అయ్యో, ఇప్పుడు నేనేమి చెయ్యాలి? నా రూపం, వయసు, అందం అన్నీ వ్యర్ధములయినవి. ఈ వసంత
వెన్నెల రాత్రి విరహాగ్నిని భరించే కన్నా, మరణమే మేలు. సఖీ, చింతించకు, అతని నిర్దయకు, నా గుండె పగిలి, అతని యందు లగ్నమయ్యి ఉండుట వల్ల, అతని వద్దకే వెళుతుంది చూడు. ఒకనాడు తెల్లవారు జామున,మేమిరువురము, మందిరము నుంచి బయటకు వచ్చినప్పుడు, పొరబాటున, నా నల్లని వస్త్రాన్ని కృష్ణుడు, కృష్ణుడి పీతాంబారాన్ని నేను, ధరించాము. అప్పుడు , చెలులు నవ్వుతుండగా ,సిగ్గు పడుతున్న నన్నుచూసీ, చిలిపిగా నవ్వుతున్న ఆ కృష్ణుడిని తలుస్తూ, ప్రాణములు విడుస్తాను.'
అలా రాత్రంతా, కృష్ణుడి తలపులతో గడిపిన రాధ, ప్రభాత సమయంలో, వినయంగా తన ముందు నిలబడి, తన తప్పును మన్నించమని వేడుకుంటున్న
కృష్ణుడితో, ఇలా అంటున్నది...
రాధ తన వద్దకు
వచ్చిన కృష్ణుడిని, ఇలా నిందిస్తోంది. 'ఓ కేశవా! పోపోమ్ము. మాయా మాటలాడకు.
రాత్రంతా, నీ విషాదము తీర్చిన ఆ వనిత దగ్గరకే పొమ్ము. ఎర్రనయిన నీ కన్నులు, కాటుక కనులను చుమ్బించుట వల్ల నల్లబారిన నీ పెదవులు, చూస్తే మన ప్రేమ భంగమయినదని తెలుస్తోంది. నీ మనస్సు లాగ శరీరము
కూడా అపవిత్రమయ్యింది. నీవు అబలలను కబలించడానికే తిరుగుతున్నావు. బాల్యంలోనే
పూతనను చంపిన నిర్దయుడవు. నిన్ను చూస్తుంటే, దుఃఖం కంటే, సిగ్గు, బాధ కలుగుతోంది. ఇక వెళ్లు...'
రాధచే
తిరస్కరింపబడిన కృష్ణుడు అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. అప్పుడు చెలి మళ్ళి రాధను
సముదాయించి, కృష్ణుడి వద్దకు పంపే ప్రయత్నం చేస్తుంది. మిత్రులారా, ఇక్కడ చిన్న విషయాన్ని గమనించాలి. దేవదేవుడు-
గురువు- జీవుడు, ఈ పాత్రల్లో కృష్ణుడు- రాధ చెలి- రాధ ను ఊహించుకోవాలి. జయదేవ కవి,రాధా క్రిష్ణులని నేరుగా కలపక, ఇన్ని మలుపులు ఎందుకు పెట్టినట్టు? మనం పుట్టింది దేవుడిని తెలుసుకుని, ఆరాధించి, మంచి మార్గంలో ప్రయాణించి, చివరికి అతన్ని చేరుకోడానికి. ఇది
ఒక్క జన్మలో సాధ్యం కాదు.
అనేక జన్మల
సంస్కారమే, మోక్షానికి దారి తీస్తుంది. మనం దేవుడి వద్దకు వెళ్ళడానికి సుముఖంగా
ఉండం. ఉదాహరణకు, వేడుకలకు, విందులకు, విహారాలకు, సినిమాలకు సంబరంగా వెళ్ళే మనం, గుడికో, భజనకో వెళ్ళమంటే, 'ఇప్పుడు కాదులే, మళ్ళి ఇంకోసారి చూద్దాం,' అంటూ వాయిదా వేసేస్తాం. నిజానికి
భగవంతుడు కూడా నిజమయిన భక్తుల కోసం పరితపిస్తాడు. మనం నిరాకరించినా బెట్టు చేసినా,తిరస్కరించినా, తన బిడ్డలను యే నాడు తిరస్కరించని
తల్లిలా,నదులను వెనక్కి తిప్పి పంపని సముద్రంలా,దయాళువై ఉంటాడు.
ఆలోచించండి, దేవుడిని తిరస్కరించేన్త వాళ్ళమా మనం? సద్గురువు, దేవుడికి మనకు ఉన్న'మత్సరం'(ego) అనే మంచు తెరను తొలగించి, కరిగించి,మనల్ని దేవుడి వద్దకు చేర్చే ప్రచండ
సూర్య కిరణం వంటి వాడు.
ఇక్కడ చెలి కూడా
అదే పాత్రను పోషిస్తూ, ఇలా చెబుతోంది.
' ఓ మానవతి! కృష్ణుడిపై ఊరికే
కోపించకు. మనస్సును ఆకర్షించు గోపాలుని విడువకు. ఈ మాట ఎన్నో సార్లు చెప్పి
ఉన్నాను. ఇది మరువకు. కృష్ణుడిని సేవించి, నీ జన్మ సఫలం చేసుకో. మదిలో అంత
పడతావెందుకు?
నీ ప్రియుడు నీ
యెడల అనురాగం కురిపించినా, ఎందుకు ద్వేషిస్తూ మాట్లాడతావు? అతడు ప్రమాణం చేస్తున్నవినిపించుకోవు. అతడు ఇష్టపడుతుంటే, నువ్వు అయిష్టంగా ఎందుకు ఉన్నావు? నీ విపరీత ప్రవర్తన వల్ల చందనం
విషంగాను, చంద్రుడు సూర్యుడిలాగాను, హిమము అగ్నివలెను, ఆనందము యాతన గాను మారి, నిన్నే కాల్చేస్తున్నాయి. అతడు
మళ్ళి నీ దగ్గరకు వచ్చి, మధురమయిన పలుకులు పలుకుతాడు, నిరాకరించకు' , అంటూ చెబుతుంది. శ్రీహరి, బిడియంతో, రాధను చూస్తున్న ఆనందంతో తడబడుతూ
వచ్చి, రాధతో ఇలా అంటున్నాడు.
'మంచి శీలము కల ఓ ప్రియురాలా! నా పై
అనవసరంగా కోపించకు. నీవు మాట్లాడితే,నీ దంతముల కాంతి అనే వెన్నెలతో, నాలోని భయం అనే చీకటి తొలగిపోతుంది. నా నయన చకోరాలకు, చంద్ర బింబము లాంటి నీ ముఖమే, ఆనందం కలిగిస్తోంది. నా పై కోపమయితే, నన్ను గిల్లు, బంధించు, కొరుకు, నీకు తోచిన శిక్ష విధించు. నీవే నా
ఆభరణం, జీవనం. నీకు నమస్కరిస్తున్నాను. నన్ను ప్రేమతో అంగీకరించు, నా మనస్సుఅందుకోసమే ప్రయత్నిస్తోంది. ఎర్ర కలువల వలే ఉన్న నీ
చూపులనే మన్మధ బాణాలు, నన్ను ఎర్రగా చేస్తే, నేను ఇంకా అందంగా కనిపిస్తాను. నీ ఆభరణాల కాంతిలో నన్ను
వెలగనివ్వు. అందమయిన నీ పాదాలకు పారాణి పూస్తాను. చిగురుటాకు లాంటి నీ పాదాలను, నా తలపై ఉంచు. అవి, నా మదనాగ్నిని దహింప చేస్తాయి. నీవు
ఈ భూమిపై ఉన్నదేవ కంతవు . నన్ను నమ్ము, నీవు తప్ప నా హృదయంలో వేరెవరు లేరు.
ఓ తరుణీ, నీ మౌనం విడనాడు. నీ చూపులతో, నా తాపాన్ని తొలగించు. ఎంతో ప్రేమతో
నీ దగ్గరకు వచ్చాను, నన్ను తిరస్కరించకు. ' కృష్ణుడి అనునయ వాక్యాలకు, రాధ శాంతించి, చక్కగా అలంకరించుకుని, కృష్ణుడిని చేరుతుంది. దేవదేవుడే, నీ పాదములు శిరసుపై పెట్టుకుంటాను, అంటే, ఎంతటి అహంకారమయినా, ఇట్టే కరిగిపోతుంది.
చంద్రుడిని చూసి, ఉప్పొంగిపోయే సముద్రంలా, రాధను ముఖం చూసి , మాధవుడి హృదయం సంతోషంతో పొంగిపోతోంది. అదే సమయంలో, మన్మధ జనకుడయిన కృష్ణుని, రాధ చూసింది. కృష్ణుడు రాధను
ఆలింగనం చేసుకున్నాడు. ఆ సమయంలో, రాధ మెడలోని ముత్యాల హారం యొక్క
కాంతి, కృష్ణుడి ఎదపై బడి, అతడు తెల్లని నురుగుతో మెరిసే
నల్లని యమునా నదిలా ఉన్నాడు. పీతాంబరం కట్టుకున్న నల్లనయ్య,రాధకు, పచ్చటి పుప్పొడి కప్పిన నల్ల కలువ
వలే అనిపిస్తున్నాడు. రాధ ముఖ కమలాన్ని చూడడానికి వచ్చిన సూర్యుడిలా
కనిపిస్తున్నాడు, కృష్ణుడు. నల్లని కేశాల్లో, తెల్లటి పూలు ధరించిన కృష్ణుడు, మధ్యను వెన్నెల గల నల్లని మేఘంలా అనిపిస్తున్నాడు. అలా వచ్చిన
రాధతో కృష్ణుడు ఇలా అంటున్నాడు,' ఓ రాధా! అప్పుడే వికసించిన పూల
కన్నా, సుకుమారమయిన నీ పాదాలను, ఈ పూల పాన్పు పై ఉంచి, వాటి గర్వము అణచుము. ఎంతో దూరం నా కోసం నడచి వచ్చావు, శ్రమ తీరునట్టు, ఒత్తెదను. నా లాగా ,ఎల్లప్పుడూ, నీ వెంట ఉండే కాలి అందెలను, పాన్పు పై ఉంచుము. మధురమయిన నీ
మాటలతో, నన్ను ఆనందింపజేయుము. నీ ఎడబాటుతో, చచ్చిన వాని వలే ఉన్న నన్ను, నీ అధరామృతము నిచ్చి, బ్రతికించుము. ఈ కృష్ణుడు నీ దాసుడు, నన్ను స్వీకరించుము.'
పిమ్మట రాధా
కృష్ణులు అనురాగాచిత్తులై, బాహ్య ప్రపంచము మరచి, ఏకమయ్యిరి. కృష్ణుడు చెదరిన రాధ అలంకారములన్ని, తిరిగి సరిచేసి, ఆమె సౌందర్యమును చూసి ఆనందించెను.
ఇవి నాద బ్రహ్మ
త్యాగయ్య, చిన్నప్పుడు పూజామందిరంలో నిత్యం ఆలపించిన కీర్తనలు. అన్నమయ్య తన
భక్తికీర్తనల్లో, కొనియాడిన కీర్తనలు. ఆచార్యులు అంగీకరించిన,ఆళ్వారులు అనుసరించి,అనుభవించిన మధుర భక్తి రస 'ఇష్టపదులు'.
జయదేవ కవి కృత ఈ
కావ్యము చదివిన వారికి, ఆ బృందావన విహారి కృప కలిగి,సకల శుభములు చేకూరుగాక!....
****
|
Friday, June 8, 2012
జయదేవుడు - అష్టపదులు
Subscribe to:
Post Comments (Atom)
చాలా బావున్నదండి
ReplyDeleteధన్యవాదాలు నారాయణ స్వామి గారు.
Delete