భద్రా కళ్యాణం
మూలం- డా . కే .వి .కృష్ణ కుమారి గారి భద్ర కల్యాణం .
కోటి సూర్యులతో సమానమయిన తేజస్సు ఉన్నవాడు, లోక మనోహరుడు, సర్వ లక్షణ శోభితుడు అయిన శ్రీ కృష్ణ పరమాత్మ, ఏకాంతంలో, చిన్మయానందభారితుడై ఉండగా,...
అప్సరసలను తలదన్నే మిసిమి వన్నెతో, యోగినులను తలపించే పవిత్ర భావనలను రేకెత్తించే, అపురూప సౌందర్యవతి ఆకాశమార్గాన ,కృష్ణుడిని సమీపించింది. సర్వము తెలిసిన స్వామికి తెలుసు, వచ్చింది శ్రుతిరంజని అని, తెచ్చింది, తన భద్ర నుంచి సందేశమని. ఆ ముగ్ద మోహన స్వరూపుడిని చూస్తూ తన్మయురాలయ్యిందా దివ్య కాంత. తన కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకుని, ఇలా చెప్పసాగింది. ' స్వామీ! నా పూర్వ జన్మ సుకృతం వలన ఈ సౌధం పైన మిమ్మల్ని ఏకాంతంలో చూడగలిగాను. నా పేరు శ్రుతిరంజని, ఒక దేవరుషి కుమార్తెను. భక్తి యోగాన్ని జీర్ణించుకుని, తమ దర్సనం కోసం తపించిన యోగినిని. బ్రహ్మ లోకం నా నివాసం. సరస్వతి దేవి ప్రాణ సఖిని.దుర్గా దేవి వర ప్రభావం వల్ల, కేకయ పురాధీశుడు, సాక్షాత్తు, శ్రీ లక్ష్మి దేవి అంశతో, కళలతో, విరాజిల్లే చక్కని కుమార్తెను కన్నారు. ఆ సుగుణ శీలి, అద్భుత రూప లావణ్యం కల కుమార్తెకు, భద్ర అని పేరు పెట్టుకున్నారు. ' భద్రా దేవి ప్రస్తావన రాగానే, శ్రీకృష్ణుడి కళ్ళలో విచిత్రమయిన మెరుపు కనిపించింది. ఆ నటన సూత్రధారి కుతూహలాన్ని ఆలంబనగా చేసుకుని, ఇంకా చెప్పసాగింది.
'అపురూపంగా పెంచబడిన భద్రాదేవి, దిన దిన ప్రవర్ధమానమవుతూ అసమాన సౌందర్యంతో, అపూర్వ తేజస్సుతో, ఎదగసాగింది. ఒక నాడు, లక్ష్మి దేవి ఆదరంతో నన్ను పిలిచి, 'ఓ శ్రుతిరంజని! నా అంశతో జన్మించిన భద్రను నృత్య గాన చిత్ర కళల యందు, సాహిత్యము, రాజనీతి, సౌశీల్యము, నందు ప్రావీన్యురాలిని గావింపుము. భద్రను మించిన సకల కళా విశారద , సౌందర్యాది దేవత, సృష్టి లోనే లేని విధంగా తీర్చిదిద్దు.' అని ఆనతిచ్చింది.
'స్వామీ! మీ మేనత్త కూతురయిన భద్రాదేవి అద్భుత సౌందర్య రాశి. తామర పూవులను పోలిన చేతులు, మృదు మధురమయిన పలుకులు, లేలేత చిగురాకుల ఎర్రదనంతో తేనెలూరే పెదవులు, విద్యుల్లతల్లా ప్రకాశించే చూపులు, ఆవిడ తనువు వసంత కాలంలో విరబూసిన సుగంధ భరిత పుష్పలత వంటిది. ఆవిడ యవ్వన సంపద , అపురూపము, దైవ ప్రసాదితము, ఆవిడ దైవార్పితము కొరకే సృష్టించబడింది. ఆ విశాలమయిన కళ్ళలోని జీవకళ వెలుగు, మెరుపు, మైమరపు అంతా క్రిష్ణమయం. అందుకేనేమో, ఆ అద్దాల చెక్కిళ్ళపై నీలాల వెలుగులు ప్రతిబింబిస్తూ ఉంటాయి.'
సౌందర్యోపాసకుడయిన కృష్ణుడి హృదయ వీణ, తన్మయత్వంతో మూగబోయింది. ఆయన హృదయంలో, భద్ర ముగ్దమోహణ రూపం క్షణ కాలం నిలిచింది. వెన్నెల వెలుగులో ఆ దివ్య మంగళ స్వరూపుడి తేజస్సును చూస్తూ నిశ్చేష్టురాలయ్యిందా అమరాంగన. ఆ చూపుల్లో కోటి వెన్నెలల చల్లదనం, ఆ మందస్మిత వదనంలో శతకోటి నెలవంకల అమృతత్వం. భద్ర తలపులతో సర్వం మరచి, క్షణ కాలం మైమరచిన, కృష్ణుడిని చూసి, ఉత్సాహంతో, ఇంకా ఇలా చెప్పసాగింది, శ్రుతిరంజని.
'స్వామీ, సర్వజ్ఞుడవు. అయినా, భద్రా దేవి దూతగా, ఆవిడ సందేశాన్ని మీకు వినిపించడానికి వచ్చానుగనుక, నివేదిస్తున్నాను. చిన్నతనం నుంచి మీపై మరులు గొన్న భద్ర తనువు, మనసు,శ్వాస, ధ్యాస, అంతా మీరే. తనలోని ఊపిరి మీరే. కళ్ళలో మీ రూపాన్ని ముద్రించుకుని, చకోరమై, మీ నిరీక్షణ లోనే తనను తాను
శుష్కింపజేసుకుంటోంది . తన మనసెరుగక, ఆమె తండ్రి గారు, భద్రాదేవి స్వయంవరాన్నిప్రకటించారు. సంప్రదాయ బద్ధమయిన ఆ వేడుకలు తప్పనిసరి. అయితే, ఆమె మీకు ఆత్మార్పణ చేసుకుని ఉండడం వల్ల, ఇతర రాజుల గుణగణాలు, శౌర్య ప్రతాపాలు, వినలేక, అసహ్యించుకుంటూ, తన హృదయ వేదనను ఎవరితోనూ చెప్పలేక మధన పడుతోంది. నాకు తన మనసు తెలియజేసి, తన సందేశం మీకు వినిపించమంది. మీరు స్వయంవరానికి విచ్చేసి,
భద్రను పరిగ్రహించి, మీ అర్ధాంగిగా చేసుకొమ్మని అర్దిస్తోంది. మీరు వస్తారన్న ఆశతో, మిమ్మల్ని చూడాలన్న ఆరాటంతో, మీలో ఐక్యం అయిపోవాలన్న తమకంతో, నిద్రాహారాలు త్యజించి ఎదురుచూస్తోంది. ఆమెను స్వీకరించమని నా మనవి కూడా. '
కృష్ణుడు అనురాగాన్ని వర్షించే దివ్య చక్షువులతో, ఇలా అన్నాడు,' శ్రుతి రంజని, నీ మాటలు మాకు అమితమయిన ఆనందాన్ని, సంతృప్తినీ కలుగజేసాయి. సకాలంలో నీ రాక శుభసూచకంగా కనిపిస్తోంది. నేను తప్పక స్వయంవరానికి వచ్చి, భద్రను, నా పట్టమహీషిగా చేసుకుంటాను. ఇది నా ఆన. ' అంటూ ప్రమాణం చేసాడు. తన బాధ్యతను విజయవంతంగా ముగించుకుని, ఆకాశ మార్గాన తిరుగు ప్రయాణమయ్యింది శ్రుతిరంజని.
పరమాత్మ తన మనసులో ఇలా అనుకుంటున్నాడు. 'భద్ర వేదన అనుక్షణం నా హృదయాన్ని తాకుతోంది. తన విరహం నాలో విరహాగ్నిని రగులుస్తోంది.తన భక్తిప్రపత్తులు నా మనస్సును పులకిమ్పచేస్తున్నాయి. భద్ర తీయని పిలుపులు, నన్ను అనురాగ స్రవంతిలో ముంచి, ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక ఉపేక్ష తగదు. భద్రను భద్రంగా నా
హృదయంలో దాచుకునే శుభ సమయం ఆసన్నమయ్యింది...'
కృష్ణ ధ్యానంలో , వియోగ బాధలో, ఉన్న భద్ర, తనలో తాను ఇలా అనుకుంటోంది. ' ఎందరు భార్యలు ఉన్నా, శ్రీవారు తనని వారిలో మరోకరిగా స్వీకరించకూడదా ? ఎక్కడ ఎవరితో ఉన్నా, కనీసం రోజులో ఒక్కసారయినా, ఒక్క క్షణమయినా మనసారా, 'భద్రా' అని పలకరిస్తూ, విశాల నేత్రాల నుంచి జాలువారే అనురాగామ్రుతాన్ని తనకు అందించకూడదా?
అంతర్లీనంగా, తను స్వామిలో ఏనాడో మమేకమయ్యింది. అయితే, ఆత్మసాక్షిగా కాక అగ్నిసాక్షిగా కూడా తన అర్ధాంగినన్న సత్యాన్ని, పంచభూతాల సాక్షిగా కూడా స్వామీ స్వీకరించి చూపాలి. ఈ ప్రపంచమంతా తమ జంటను చూసి పరమానందం చెందాలి. స్వామీ! చూపులతో నా గుండెల్ని చిలికివేసారే. నా హృదయ తంత్రుల్ని మీటుతూ నవరసాల సారాన్ని నాలో నింపారే. మీ మనోహర రూపాన్ని కళ్ళ నిండుగా చూసుకోవాలనే కాంక్షల బరువుతో వాలిన కనురెప్పలు మీ మధుర భావనలతో ,మనసారా మిమ్మల్ని చూడనివ్వలేదు. మీ అద్భుతమయిన కళ్ళను చూసి నిశ్చేష్టురాలిని అయ్యాను. లోకాన్ని మరచి, మీ సూదంటురాయి లాంటి కనురెప్పల ఆలంబనతో, నిశ్చలంగా చూస్తున్నప్పుడు, ఎటువంటి మత్తును రేకెత్తిస్తున్నాయి మీ కళ్ళు? కృష్ణా! నాకు తెలిసిన భక్తి మార్గం ప్రేమే. ప్రేమతో ఒక హృదయం స్పందిస్తే, ఆ ప్రేమ కోసం మీ హృదయం తల్లడిల్లిపోతున్దంటారే . మరి నా పై ఎందుకీ అలక్ష్యం? ఇంద్రనీల మణి కాంతులని తలపించే, మీ దివ్య దర్సన భాగ్యంతో, ఎండిన చేనుకు కొద్దికొద్దిగా నీరందించినట్టుగా, నా తాపాన్ని హరించకూడదా ? చాతక పక్షికి స్వాతిబిందువులు ఆధారమయినట్టు, మీరే నా జీవనాధారము. దయా సముద్రులయిన మీరు , ఆ సముద్రం ఉవ్వెత్తున ఉరకలు వేసి, పొంగి పొరలి, నన్ను ముంచి వేసినా ఆనందమే.
క్రిష్ణానుగ్రహము వల్ల ప్రాప్తించే, అలౌకికానందము అనుభావిన్చాలనే కోరికా, అంత అదృష్టం లభిస్తుందో లేదో అన్న ఆవేదన నన్ను నిలువనీయడం లేదు. '
ఇంతలో శ్రుతిరంజని రాకను గమనించి, సంభ్రమంగా చూసింది భద్ర. ఇంతవరకు ఎదురుచూసింది ఒక ఎత్తయితే, ఆవిడ గొంతులోంచి, విషయం బయటపడబోయే క్షణం అంత కంటే వెయ్యి రేట్లు ఉత్కంటభరితంగా ఉంది. 'భద్రాదేవి, కళ్యాణమస్తు!' అంది శ్రుతిరంజని, హర్శాతిశయంతో, భద్ర నుదుటి మీద ప్రేమగా చుంబిస్తూ.( ఇక్కడెన్దుకో నాకు హనుమంతుడు, లంకకు వెళ్లి వచ్చి, 'కాంచితి సీతను' అని చెప్పే సందర్భం గుర్తుకొచ్చింది. ఇది, అవతలి వ్యక్తి ఆరాటాన్ని, తపనను గమనించి, క్లుప్తంగా చెప్పే దూత మేధా సంపత్తి కదూ.) 'నీ ప్రాణ సఖుడు కనిపించాడు. ఆ దివ్య రూపాన్ని తనివి తీరా చూసే భాగ్యం, నీ వల్ల నాకు కలిగింది. ఇంతకు మించిన గురు దక్షిణ ఈ భూమండలంలో యే గురువుకూ, ఎవరూ ఇచ్చి ఉండరు. లక్ష్మీపతి, తన మాటగా నీతో ఇలా విన్నవించమన్నాడు. ఈ భద్ర
కరపద్మాలను భద్రంగా అందుకుని, పాణిగ్రహణం కావించగల తరుణం ఎంతో దూరంలో లేదని చెప్పమన్నాడు. సంప్రదాయ బద్ధంగా, తన ప్రియ సఖి భద్రను అర్ధాంగిగా స్వీకరించే తరుణం కోసం నీకన్న ఎక్కువగా తనే ఆరాటపడుతున్న విషయాన్ని వివరించమన్నాడు. నిన్ను తనలో ఐక్యం చేసుకోగలనని, తన మాటగా చెప్పమన్నాడు.'
భద్ర తన అదృష్టాన్ని నమ్మలేక, శిలా ప్రతిమలా నిలబడిపోయింది. శ్రుతిరంజని తన పాదాలకు
నమస్కరించాబోతున్న భద్ర చేతుల్ని అందుకుని, గాడంగా హృదయానికి హత్తుకుంది.
స్వర్గ తుల్యమయిన బంగారు సౌదాలతో, ఆకాసహర్మ్యాలతో, ఉండే పాండవుల ఇంద్రప్రస్త పురానికి వస్తాడు కృష్ణ పరమాత్మ. ఎంతో కాలానికి, కనుల విందుగా ఆ మోహనాకారుడిని చూడగలుగుతున్నందుకు, తన్మయత్వంతో ఆనంద పరవసులవుతారు పాండవులు. ఆప్యాయంగా వారి కుశల ప్రశ్నలు అడుగుతూ, ఆతిధి మర్యాదలు చిద్విలాసంగా స్వీకరిస్తూ, యోగక్షేమాలు విచారిస్తాడు పరమాత్మ. శ్రీ కృష్ణునిలో మంగళకరమయిన
మార్పుని గుర్తించిన పార్ధుడు కారణాన్ని అన్వేషిస్తాడు. ఎంతయినా, నరనారాయణుల మధ్య దాపరికాలు ఉండవు కదా, స్వామి కళ్ళలో కళ్యాణ శోభను, కొంటెగా దోబూచులాడుతున్న శృంగార వీచికలను కుతూహలంతో చూస్తూ, విషయ నిర్ధారణ కోసం వేచి ఉన్నాడు పార్ధుడు. ఇంతలో, కేకయ రాజ పురోహితుడు, పాండవులకు భద్రా దేవి స్వయంవర ఆహ్వానాన్ని తీసుకు వస్తాడు. అక్కడే ఉన్న కృష్ణ పరమాత్మను చూసి, ఆశ్చర్యపోయి,
అందరికీ వినమ్రంగా నమస్కరిస్తాడు. దూతను చూసి, కృష్ణుడి కళ్ళలోని ఆనందాన్ని పసిగట్టిన పార్ధుడికి విషయం అర్ధమయ్యింది. పార్దుడిని గమనించిన కృష్ణుడి కళ్ళు, కొంటేదనాన్ని నింపుకుని, అర్ధవంతంగా నవ్వాయి.
'కళ్యాణ మూర్తీ, భద్రా కళ్యాణ స్వయంవర ఆహ్వాన లేఖ మీకు స్వయంగా అందించగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేటికి ఆరోదినమున భద్రదేవి స్వయంవరం. ఈ లేఖను తమ ప్రత్యేక్ష ఆహ్వానంగా భావించి, తప్పక విచ్చేయమని, మహారాజులు విన్నవించమన్నారు. చెల్లెలు భద్రా దేవిని ఆశీర్వదించడానికి విచ్చేయమని, పాండవ శ్రేష్టులకు వారి తరపున వర్తమానం అందించమన్నారు.' అంటూ లేఖలను అందజేశాడు. పాండవుల అతిధి
మర్యాదలు స్వీకరించి, వారు వీడ్కోలు అందిస్తుండగా, కేకయ రాజ్యానికి బయలు దేరాడు జగన్నాధుడు.
ప్రేమాధీనుడయిన జగన్నాధునికి, ప్రేమ స్వరూపులయిన భక్తుల గురించిన ధ్యాసే. ప్రేమ పూజారికి, అనునిత్యం ప్రేమ గల హృదయవేదనను తీర్చాలన్న ఆరాటమే. భక్త వత్సలుడికి నిరంతరం భక్తుల గురించిన ఆలోచనలే. దేవకీ వసుదేవుల ఆశ్సీస్సులు తీసుకునేందుకు, వినమ్రుడై, వారి పాదాల చెంత కూర్చుని శిరస్సు వంచాడు శ్రీకృష్ణ
పరమాత్మ. ప్రేమగా నుదుటి మీద చుమ్బిస్తూ, ఆ అద్భుతమయిన తేజస్సుకు అవాక్కయ్యి చూస్తుండిపోయింది , దేవకి. 'నన్ను ఎప్పుడూ అలా చూస్తూనే ఉంటావు, తనివి తీరదా అమ్మా?' అడిగాడు కృష్ణుడు. నల్లనయ్య కళ్ళలోని ప్రేమవాహినికి ఆ మాత్రు హృదయం ద్రవించిపోయింది. క్షణమాగి, అర్దోక్తిగా చూసి, ఏదో చెప్పాలని చెప్పలేక
తడబడుతున్న నల్లనయ్య కళ్ళలోని అవ్యక్త భావాన్ని అర్ధం చేసుకోలేక, ప్రశ్నార్ధకంగా చూసింది దేవకీదేవి.
'ఏమిటి తండ్రీ, కొత్తగా కనిపిస్తున్నావు? ఏదో విషయాన్ని చెప్పడానికి సంకోచిస్తున్నావు. నా మనసుకు అది శుభప్రదంగా అనిపిస్తోంది.' కన్నయ్య కళ్ళలో కోటి వెన్నెలలు విరిశాయి. 'భద్రాదేవి స్వయంవరానికి వెళ్తున్నానమ్మా ,' ఇద్దరి హృదయాలు, మధురాతి మధురంగా స్పందించాయి. తన నిర్ణయాన్ని అభినందిస్తూ, జరగబోయే
తన కల్యాణానికి ముందుగానే ఆశీస్సులు అందిస్తున్న తల్లిదండ్రుల సన్నిధిలో ఎంతో ఉల్లాసంగా ఉన్నాడు .
రుక్మిణి అంతఃపుర అభ్యంతర మందిరంలో...., శ్రీవారి సేవలో నిమగ్నమయిన రుక్మిణికి శ్రీవారి చర్యలో ఏదో మార్పు కనిపించింది. లక్ష్మీపతి మనస్సు పరధ్యానంలో ఉన్నట్లు గమనించింది. ' దేవి, నీ సన్నిధిలో నా మనసు వేరే చోట ఉందని గ్రహించావు. మరి నీకు ఆగ్రహం రాలేదా?' తెలిసీ అడుగుతున్న శ్రీవారి కొంటేతనానికి, రుక్మిణి నవ్వి,' మీ సంకల్పం లేనిదే యే భావం కలుగదు కదా. మీ నిజ స్థితిని తెలుసుకుని, దివ్యమయిన ఆత్మానుభూతులను పొందే అదృష్టవంతులకు మీతో వియోగం ఎక్కడుంటుంది?' రుక్మిణి మాటలకు అడ్డు వస్తూ,' రుక్మిణి లాగా ...'
అంటున్న స్వామి వ్యాఖ్యకు ఆ ముగ్దత్వంలో కొంటెతనం తొంగి చూసింది. ఆటనాడించే వాడిని, ఆటపట్టించాలి అన్నట్టు, 'ఇంకా ఉన్నారు కదా స్వామీ...'అంది. 'రుక్మిణి, రాధ, గోపికలు, ఇంకా...'తరచి తరచి రుక్మిణి కళ్ళలోకి చూస్తున్న శ్రీవారి కళ్ళలోకి నిర్మలంగా చూస్తూ ,' ఇంకా, ఇందాక మీ పరధ్యానానికి కారణమయిన మీ ప్రేయసీ భద్రా దేవి. ప్రేమకు మాత్రమే వశమయ్యే పరమాత్మను, తన అద్భుత ప్రేమారాధనతో వశం చేసుకోగలిగింది. భద్రా స్వయంవర విషయం విన్నాను. ఆ సుకుమారి చేయ్యన్దుకుని ,చరితార్దురాలిని చెయ్యండి.' రుక్మిణిని ప్రేమాతిశాయంతో, హృదయానికి హత్తుకున్నాడు ఆ రుక్మిణీ నాధుడు.
సత్యభామ అలకగ్రుహంలో....అణువణువూ సౌందర్యదీప్తులతో దేదీప్యమానమై ప్రకాశిస్తూ, సౌందర్యో పాసకుడయిన శ్రీకృష్ణుడిని తన అద్భుత సౌందర్యంతో మైమరపిమ్పచేస్తూ ఉంటుంది, సత్యభామ. దేనిని పంచి ఇచ్చినా, శ్రీవారి ప్రేమను మటుకూ ఇతరులకు పంచి ఇవ్వలేని నిగూఢ ప్రేమతో, తన హృదయంలో మందిరం కట్టుకుని అందులోనే తన స్వామిని ప్రతిష్టించుకుని, ఆ ధ్యానంలోనే అమితమయిన ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటుంది అభిమానవతి అయిన సత్యాదేవి. చక్కని చుబుకాన్ని అందుకుని, కళ్ళలోకి తనివితీరా చూడబోయి, తొట్రు పడ్డాడు వాసుదేవుడు. ' ఏమిటిది సత్యా? కలువ కళ్ళలో ఆ నీరెందుకు?' ఏమి తెలియనట్టు అడుగుతున్న శ్రీవారి కళ్ళలోకి చూసి, ఏదో
చెప్పబోతున్న సత్యాదేవిని అడ్డుకుంటూ, 'సత్యా! నువ్వు చెప్పలనుకున్తున్నది నాకు అర్ధం కాదని అనుకుంటున్నావా. నీ మనసు చదివి, నీ ఆనతి ప్రకారం నడచి, సత్యాపతిగా నిలిచిపోవాలనే నీ కోరిక తీర్చడం కోసం నేను ఎంత ముచ్చట పడుతుంటానో, కదా. ఎందరున్నా, కొత్తగా ఎందరొచ్చినా, నీ స్థానాన్ని మటుకు ఎవరూ ఆక్రమించలేరు. నీ అద్భుత సౌందర్యాన్ని ఎవరూ అధిగమించలేరు. నా హృదయాన్ని నీలా ఎవరూ
రంజిమ్పచేయ్యలేరు. ఇది సత్యం.' శ్రీకృష్ణుడి మృదుమధుర భాషణలకు, ఆ కళ్ళలోని ప్రేమ వాహినికి మైమరచిన సత్య దేవి, అతని కౌగిలిలో కరిగిపోయింది.
జాంబవతీ దేవిని నీ అనురాగానికి బద్ధుడనని, సూర్యపుత్రి కాళిందిని, నిన్నువిడచి క్షణమయినా ఉండలేనని, నమ్మబలికాడు నల్లనయ్య. మేనత్త కూతురయిన మిత్రవిందను బంధుత్వం ఆపాదించిన సాన్నిహిత్యంతో, మరపిమ్పజేస్తూ, నాగ్నజితిని ఆమె సౌందర్యాన్ని ప్రశంసిస్తూ, అలరించాడు నటనసూత్రధారి. తన హృదయ నివాసిని అయిన భద్ర సన్నిధి కోసం ఆత్రపడుతూ, భద్రా స్వయంవరానికి పయనమయ్యాడు పరమాత్మ.
జగన్నాధుడి రధం శర వేగంతో ముందుకు దూసుకు పోతోంది, స్వామి మనస్సు కన్నావేగంగా. భద్రాదేవి పరమయిన విరహాగ్ని తన నులివేచ్చదనంతో, శ్రీకృష్ణుడి హృదయంలో ప్రేమ సుమాన్ని వికసింపజేస్తోంది. సర్వాంతర్యామి అయిన తన ఉనికినే, భద్ర ప్రేమ ప్రశ్నార్ధకం చేస్తోంది. నిర్మల ప్రేమకు భక్తి, నిజాయితీ గల దర్పణం. ఇంతటి ప్రేమపూర్వకమయిన భక్తిని భగవంతుడు తట్టుకోలేడు. ఆ భక్తిలో కరిగి మమేకం అవ్వకుండా భగవంతుడు ఒక్క క్షణం కూడా నిలువలేడు. భద్రను సేద తీర్చడం, భద్రను సమాధాన పరచడం, తన కర్తవ్యంగా భావించిన కృష్ణుడు, తన సంకల్పాన్నే చెల్లెలు సుభాద్రగా రూప కల్పన చేసాడు. తన మనస్సు కన్నా వేగంగా , తన ప్రతిరూపాన్ని సుభద్ర రూపంలో భద్ర దగ్గరకు తక్షణమే ప్రత్యేక్షమయ్యేలా చేసాడు. స్వయంవర సమయం దగ్గర పడుతుంటే, భద్రలో అనుకోని అలజడి మొదలయ్యింది. అనేక అనుమానాలు చుట్టుముట్టి, అశాంతిని పెంచివేస్తున్నాయి. శరీరమంతా నిండి కాంతివంతమై ఉన్న కృష్ణ తేజం తనకు తట్టుకోలేని స్పందనను కలుగజేస్తోంది.'ఎందుకు నాకీ పరీక్ష స్వామి? తల్లడిల్లుతున్న నా మనసు తెలుసుకుని, నా వేదన తీర్చే
ఆత్మబంధువులు ఒకరయినా ఇటు రాకూడదా?' అనుకుంటూ, ఒక ఉద్వేగస్థితిలో ఉండిపోయింది.
ఇంతలో తన కమల నయనాలను అనునయంతో తెరిపిస్తున్న అమృత స్పర్శ తలపయిన చల్లగా తాకింది. 'భద్రా! నేనెవరినో చూడు.' సంభ్రమంగా కళ్ళు తెరిచింది భద్ర. కళ్ళ ముందు కనిపిస్తున్నదొక ముగ్దమోహన రూపం. ఆ పరిసరాలన్నీ సుగంధ సౌరభాలతో గుబాలించడం మొదలుపెట్టాయి. ఎదురుగా, తన కళ్ళ లోకి లాలనగా చూస్తూ, సుభద్ర. సుభద్రలో ఏనాడు ఎరగని దివ్య తేజస్సు. 'ఏమిటిది? ఇలా అయిపోయావేమిటి? అందుకే నీకు ధైర్యం చెప్పి రమ్మని పంపించాడు మా అన్నయ్య. ఇలా క్షీనిన్చిపోతే నిన్నెలా ఎంచుకుంటాడు? ఇలా ఏలుకుంటాడు?' చుబుకాన్ని అందుకుని, తదేకంగా చూస్తున్న సుభద్ర స్పర్శ భద్రలో కోటి వీణలు మీటినట్టయ్యింది. సుభద్ర స్పర్సలో, లాలనలో, తనలో కలుగుతున్న స్పందనలో, ఆ జగన్నాధుని తాలూకు అంతర్గత మధురానుభూతి, మధురమయిన సౌఖ్యమే చిత్రాతిచిత్రంగా హృదయ తంత్రుల్ని మీటుతొంది.
'వదినా! ఈ సమయంలో నీ రాక నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. నా మనసులోని భావాలు నీతో పంచుకోవాలని ఉంది. చిన్నతనం నుంచే దేవకి దేవి నుంచి పతివ్రతల కధలు, కృష్ణ లీలలు, యశోదానందుల నుంచి బావా బాల్యక్రీడలు, రాధ ద్వారా రాసక్రీడలు, కుంతీ దేవి ద్వారా ఆర్తత్రాణ పరాయణత్వాన్ని, అక్రూర, నారదాదుల ద్వారా
కృష్ణతత్వాన్ని, చెప్పించుకుని, ఆనందపరవసురాలిని అయ్యేదాన్ని. బావను తలచుకున్న క్షణాన నా శరీరం అణువణువూ ప్రేమతో నిండిపోతుంది. నా మాటలు తడబడతాయి. నా హృదయం కరిగి కన్నీరవుతుంది. నాకీ పరిసరాలు పట్టవు. ఆయన అందాన్ని గానం చేస్తాను.
ఆనందంగా నాట్యం చేస్తాను. స్వామి చిత్రాన్ని నా హృదయపు లోతుల్లోనే ఆవిష్కరిస్తాను. దేనికీ లొంగని నా స్వామీ ప్రేమకు లొంగిపోతాడు. నా అనంత ప్రేమతో స్వామిని పొందగాలనన్న నమ్మకం నాకుంది.' సుభాద్రగా వచ్చిన కృష్ణుడికి ముగ్ద భద్ర హృదయావిష్కరణ ఆనందాన్ని కలిగిస్తోంది.
ఆ సుకుమారి ప్రేమైక హృదయం తన్మయత్వాన్ని కలిగిస్తోంది. సుభద్ర మొహం చూస్తూ అవాక్కయ్యింది భద్ర. తన ముందున్నది ఆ మదనగోపాలుని దివ్యమూర్తి. ముత్యాల వంటి స్వేదబిందువులు కస్తూరి తిలకం పై వింత వెలుగుల్ని వెదజల్లుతున్నాయి. సర్వం సుగంధ భరితం. తన కోసం ఎన్నో రేట్లు దిగి వచ్చిన చంద్రబింబపు కాంతితో, సంపెంగ వంటి నాసికతో, తన చెక్కిళ్ళను మృదువుగా స్ప్రుశిస్తున్నాడు. సిగ్గులమొగ్గయ్యి,
తీవ్రంగా కంపిస్తున్న తనూలతతో, సుభద్ర రూపాన్ని అల్లుకుపోయింది భద్ర. 'భద్రా! ఏమిటిది? నేను నీ బావను కాదు, నీ వదినను. అన్నిటా కృష్ణుడిని చూడగల భక్తిప్రపత్తులు ఉన్నదానివి. అన్నయ్యను నాలో చూడగలగడంలో ఆశ్చర్యం లేదు. మా అన్నపాండవులతో పాటుగా, నీ స్వయంవర శుభలేఖను అందుకున్నాడు. అంతకన్నా ముందే, నీ విరహాగ్ని జ్వాలతో మరింత నీలి వర్ణుడయ్యాడు. అంతకన్నా ముందుగానే, నీ భక్తిపారవశ్యం ముందు వోడిపోయాడు. అంతకన్నా ముందుగానే, నీ ప్రేమవాహినిలో మునిగిపోయాడు. అంతకన్నా మరింత ముందుగా...'
సుభద్ర కొంటె చూపుల్లో చిక్కుకున్న భద్ర కళ్ళు భారంగా వాలిపోయాయి. సిగ్గు అనే అత్యంత విలువయిన ఆభరణంతో ప్రకాశించే స్త్రీలో అతి పవిత్రమయిన తేజస్సు అంతర్లీనమై ఉంటుంది. తనకు ఎంతో ప్రీతిపాత్రమయిన ఆ ముగ్దత్వాన్ని, సిగ్గును, భద్రలో మురిపెంగా చూసుకుంటున్నాడు, కృష్ణుడు. తనను తాను అదుపులో పెట్టుకోవడం
నిగ్రహానిగ్ర సమర్దుడికే, ఎంత కష్టమో తెలిసి వచ్చింది.
అయినా, రేఖా మాత్రంగా అయినా భద్రలో మిగిలి ఉన్న గర్వాన్ని పరీక్షింపదలచి, 'భద్రా! మా అన్న నీ విషయంలో నిర్దయగా ప్రవర్తిస్తున్నాడు. అటువంటి పాషానుడి కోసం తపించడం కన్నా, నిన్నందుకోవాలని కలలు కనే చక్రవర్తులూ, రాజాదిరాజులూ ఎవరినయినా...' తన స్వామిని గురించి దూషణ సహించలేక పోయింది భద్ర. 'సుభద్రా!
నువ్వనాల్సిన మాటలేనా ఇవి?సామాన్య మానవుల్ని కోరుకునే వారు, దైవ ప్రేమను అనుభవించే అర్హత లేనివారు. నాకు తనే గమ్యం, మార్గం, ప్రయత్నం, సాఫల్యం. అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ పోటి పది నన్ను పరీక్షిస్తున్నారు. అసలు నువ్వు సుభాద్రవేనా, లేక ఆ రూపంలో వచ్చిన...'బాధతో వెక్కిళ్ళు పెడుతున్న భద్రను ప్రేమాతిశయంతో గాధంగా దగ్గరకు తీసుకుని, ' భద్రా! నిన్ను బాధించినందుకు క్షమించు. నీ మనోభావాలు విని ఆనందించాలన్నదే ఆయన సంకల్పం. అందుకే నాతొ అలా అనిపించి ఉంటాడు' అంది సుభద్ర. 'భద్రా! నువ్వు తనను ఎంతగా ప్రేమిస్తున్నావో,
ఆరాదిస్తున్నావో, అంతకు మించిన ప్రేమను అందుకోబోతున్నవని, తన మాటగా చెప్పమన్నాడు. అణువణువునా తనని వెతికి తపించే అవసరం ఇంక లేదని, ఆణువణువూ తనే ఆక్రమించి ఊహాతీతమయిన ఆనందాన్ని, అనుభూతులను నీ పరం చేస్తానని చెప్పమన్నాడు.
ఇదిగో, నీ బావ నీకు ఈ కానుక పంపి, స్వయంగా నన్ను అలంకరించమన్నాడు. ఈ తోమ్మిదిరేకులున్న హారం, నవ బంధానికి సంకేతం. చెలికాడుగా, హితుడిగా, స్నేహితుడిగా, భర్తగా, రక్షకుడిగా, సంరక్షకుడిగా, గురువుగా, సర్వం తానుగా, నీ హృదయంలో తన స్థానాన్ని భద్రపరిచే అమూల్య కానుక ఇది', అంటూ మెడలో వేసింది.
మెడనిండా కౌస్తుభ స్పర్సలా అనిపిస్తున్న హారం, స్వామీ స్వయంగా అలంకరించి, హృదయానికి హత్తుకున్నట్టు ఉంటే, తన్మయత్వంలో, సుభద్ర వడిలోకి వదిగిపోయింది భద్ర. తల్లి నిద్రలేపడంతో, 'సుభద్ర ఏది?' అని అడుగుతున్న భద్ర మాటలు అక్కడ ఎవరికి అర్ధం కాలేదు. 'ఇదంతా కలా?' అనుకుంటూ అప్రయత్నంగా మెడ తడుముకుంది.
సుభాద్రగా తన బావ రావడం నిజం. పులకితురాలయిన భద్ర వదనంలో వేవేల చంద్రకాంతులు.
సోగకళ్ళు బరువై వాలుతుంటే, బుగ్గల్లో గులాబీలు పూస్తుంటే, ఆ హారాన్నిఅపురూపంగా హృదయానికి హత్తుకుని, మురిపెంగా దాచుకుంది.
శ్రీకృష్ణ భగవానుడి ఆగమనంతో కేకయ దేశం నూతన శోభను సంతరించుకుంది. సమస్త ప్రకృతీ పరవశించింది. ఉద్యానవనంలో దేవకన్యలా అత్యద్భుతంగా కనిపించిన భద్ర కళ్యాణ రూపం సకల హృదయ మనోహరుని సైతం మొహాతిశయంతో ముంచివేస్తోంది. పూతీవేలను చీల్చుకుని, మబ్బుచాటునుండి- పున్నమి చంద్రుడి ప్రకాశంతో వచ్చినట్టు, అరుదెంచిన భగవానుడిని చూసి, భద్రా దేవి చెలులు నిశ్చేష్టులై నిలబడిపోయారు. కన్నులారా, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలని మనసు తొందర చేస్తున్నా, మితిమీరిన సిగ్గు భద్రను నిస్సహాయురాలిని చేస్తోంది. నుదిటిపైన చిరుచెమటలు, పెళ్లకళ వచ్చిన ప్రకృతీ కాంతకు సహజ ఆభరణాలుగా అనిపిస్తున్నాయి. భద్రాదేవి చెలులు కృష్ణుడిని ఇలా వేడుకున్నారు,' స్వామి, మాంగల్య బంధంతో మా చెలిని బంధించి, అనురాగ బంధంతో ఆమె హృదయాన్ని మధించి, మిమ్మల్ని తప్ప మరేది కోరుకొని మా చెలిని స్వీకరించి, మమ్మల్ని చరితార్ధులను చెయ్యవలసిందిగా ప్రార్దిస్తున్నాం.' తన మనోభావాలను చక్కగా చెబుతున్న చెలులను చూసి ముచ్చటపడింది భద్ర. 'భద్రా! స్వయంవరంలో నీవు కోరినట్టే నిన్ను చేపడతాను. ఈ సమయంలో నీతో ఏకాంతంగా ఉండడం సంప్రదాయాన్ని మన్నించడం కాదేమో, కళ్యాణమస్తు!' అంటూ వెనుదిరిగాడు కృష్ణుడు.
కృష్ణుడి దర్శనంతో, కోటి సూర్య ప్రభలు వదనంలో వేలుగుతుండగా, కొత్త అందాలను సంతరించుకుంది భద్ర. రుక్మిణి కల్యాణం లాగే, భద్రా కల్యాణం కూడా, లోక ప్రసిద్ధం కావాలని, కేవలం బంధుత్వం వల్ల జరిగిన వివాహంగా మిగిలిపోకూడదని, కృష్ణుడిని కోరుతుంది భద్ర. భగవానుని, ఆనందభాష్పాలతో, ఎదురేగి, ఆహ్వానించిన
దృష్టకేతు మహారాజు, అతిధి మర్యాదలతో సంతుష్టి పరచడానికి తలమునకలవుతున్నాడు.
స్వయంవర ముహూర్తం సమీపించింది. అత్త్యుత్సాహంతో, తమ అర్హతలను మరచి మితిమీరిన కాంక్షతో వచ్చిన విందుడు, అనువిందుడు అనే ఇద్దరు రాజులు, గౌరీ పూజకు వెళ్ళిన భద్రా దేవిని అపహరించుకుపోయారు. శత్రువుల పాలిటి కాల యముడిలా, విన్దానువిన్డులతో తలపడి, వాళ్ళను వోడించి, బెదిరిన భద్ర చేయ్యన్దుకుని,
రధంపైన తన సరసన చేర్చుకున్నాడు, లక్ష్మీపతి. శ్రీకృష్ణుడి హ్రుదిపైన తల వాల్చి, లక్ష్మిదేవిలా భాసించింది భద్ర. వీరోచితంగా గెలుచుకొచ్చిన మరుక్షణమే, భద్ర కృష్ణుడి సోట్టయ్యింది. ఇక కృష్ణుడి అనుమతి కోసం, కళ్యాణ శుభలేఖను ఆస్థాన పురోహితుడి ద్వారా పంపి, ఆమోదాన్ని తీసుకున్నాడు మహారాజు.
భద్రా - కృష్ణుల కళ్యాణ వేడుకలకు పాండవులు, బంధువులు,దేవతలు తరలి వచ్చారు. కేకయ నగరమంతా కళ్యాణ శోభ సంతరించుకుంది. భగవానుడు సర్వాలంకార భూషితుడై, రవ్వల ఆభరణాలు నీలమేఘ కాంతితో కలిసి ప్రకాసిస్తుండగా, కన్నులపండుగగా బయలుదేరాడు. సమస్త వజ్రవైడూర్య మణిమయ భూషిత అయిన అన్నుల మిన్న భద్రను వివాహ వేదిక దగ్గరకు తీసుకువచ్చారు. తన ముద్దుల పట్టి భద్రను, గంగాజలంతో, కాళ్ళు కడిగి, కన్యాదానం చేసాడు మహారాజు. పసిడి తెర తొలగించగా, కృష్ణుడి చిలిపి చూపులు ఎదురుకోలేక సిగ్గులమొగ్గయ్యి, తల వాల్చేసింది భద్ర. నవరత్నాలు కలిపినా తలంబ్రాలు, మాంగల్య ధారణా, సప్త పది, పేలాల నివేదనా, అరుంధతి నక్షత్ర దర్సనం వంటి సంప్రదాయ వేడుకలన్నీ, అత్యంత వైభవోపేతంగా జరుపబడ్డాయి.ఆహుతులంతా, వెలకట్టలేని, అమూల్య సంపదలను కానుకగా సమర్పించుకున్నారు. ప్రధమ సమాగమ సుముహూర్తాన, తెల్లని
వస్త్రాలు ధరించి, సర్వాలంకార శోభిత అయిన భద్రా దేవిని, కృష్ణుడి సన్నిధిలో విడిచారు సఖులు. ' మీ అర్ధాంగిగా, మీ అడుగుజాడల్లో నడవాలని, సతీధర్మాన్ని సక్రమంగా నిర్వహిస్తూ, వన్నె తెచ్చే విధంగా ఉండాలని, నన్ను ఆశీర్వదించండి. మీ పై ప్రేమానురాగాలు స్థిరంగా ఉండే విధంగా దీవించండి,' అంటూ ప్రణమిల్లింది భద్ర.
భద్రా- కృష్ణుల సమాగామానికి ప్రకృతి పులకించింది. పరమ పురుషునిలో ప్రకృతి కాంత లీనమైంది.
No comments:
Post a Comment