ఏది నీది జీవా ?
ఏది నీది జీవా ? ఏది నాది ?
కట్టు గుడ్డ లేక ఇలను పుట్టినావు
వట్టి చేతుల తోటి ఊరకొచ్చినావు
తల్లి మావి వీడ నీకు సత్తువ లేదు
చీము నెత్తురు కడగ నీకు శక్తి లేదు
ఉమ్మ నీరు మ్రింగి గొంతు పెగలలేదు
ఏ బలిమి లేక భువిన ఉద్భవించినావు
ఏది కలిమి నీకు ఏది బలిమి ?
ఏ ఇంట ఏ కడుపు పంటగా పుట్టాలో
ఏ ఘడియ ఏ రీతి వెతలు చెందాలో
ఏ చోట తిరిగాలో ఏ దేశమేగాలో
ఏ నోట పొగడాలో ఏ నోట తెగడాలో
ఏ గడపలెక్కాలో ఏ కాళ్ళు పట్టాలో
ఏది నీవె ఎంచి నిశ్చయించగలేవు
ఏది నీది ? ఇక ఏది నాది ?
నాది నాది యనుచు మిగుల విర్రవీగేవు
నాదన్న సంసారం నాదన్న సంపద
నాదాన్న దేహము ఆడంబరాదులు
నాదన్నవేవి నీ వెంట రాబోవు
నాదన్న లోభాన్ని కాస్తంత విడిచి
నేర్పుగా నొసగిన దానఫలము
నిశ్చయముగ నీది నీదేను జీవా !
వట్టి చేతుల బుట్టి వట్టి చేతుల పోయే
ఒట్టి బ్రతుకుల కేల ఇంత తపన
బట్ట లేక పుట్టి బట్ట లేక పోయే
ఇట్టి బ్రతుకునెరిగి మేలుకోనుమా
గట్టిగా శ్రీహరి పాదాలు చేపట్టి ,చను
నట్టి వారల దయబ్రోచును హరి
అట్టి నిశ్చల భక్తియే దన్నుగా
నినుగాచి నీవెంటే వచ్చు జీవా !
- భావరాజు పద్మిని
11/10/2014
No comments:
Post a Comment