నన్ను నడిపించు ...
---------------------
ఏది బంధం ?
నీ నుంచి దృష్టి మరల్చే భ్రాంతే బంధం
ఏది ప్రేమ?
నీ బిడ్డలపై నీకున్న వాత్సల్యమే ప్రేమ
ఏది నడత ?
నీ సృష్టిని నొప్పించని విజ్ఞతే నడత
ఏది బలిమి ?
నీవే రక్ష అన్న మహావిశ్వాసమే బలిమి
ఏది ఆనందం ?
నీవే అన్నీ అని తెలియడమే ఆనందం
ఏది ధర్మం ?
నీ దరికి దారి చూపే దీపమే ధర్మం
ఏది మార్గం ?
నీ పాదధూళి పరచిన పధమే మార్గం
ఏది గమ్యం ?
నీలో ఐక్యమయ్యే గమనమే గమ్యం
పరమాత్మా !
చలించే నా మనసుని నీవైపే అదిలించి,
తడబడే నా అడుగుల్ని నీకేసే మళ్ళించి,
బాహ్య తమస్సు నుంచి అంతః తపస్సులోకి,
సంబంధాల సంకెళ్ళు తెంచే ఆత్మజ్యోతిస్సులోకి,
నీ దివ్యపధమనే అలౌకిక ఆనందానికి,
నన్ను నడిపించు !
No comments:
Post a Comment