Wednesday, August 5, 2015

గురువెక్కడ ?

"మీ గురువుగారు ఎక్కడుంటారు ?" అని అడిగితే, లౌకిక విషయాసక్తి కలవారికి చెప్పడం చాలా కష్టం... "ఎక్కడ లేరు ? " అన్నదే సమాధానమేమో. గురుకృప కలిగిన శిష్యుడు మెరిసే తారల్లో, వెలిగే భానుడిలో, కురిసే వానలో, తినే ఆహారంలో, ఆఘ్రాణించే వాసనలలో, వినే శబ్దాలు అన్నింటిలో, చూసే ప్రతి వస్తువులో, ఆత్మీయ స్పర్శలో గురువునే అనుభూతి చెందుతాడు. వెలుపలా ఆయనే, బయటా ఆయనే... రెండు దేహాలలో జీవిస్తున్న ఏకాత్మ వారు.   గురుశిష్యులు బింబ ప్రతిబింబాల్లా ఉంటూ, ఒకరితో ఒకరు ఎల్లప్పుడు సంభాషించుకుంటూ ఉంటారు. ఇదే భావాన్ని అక్షరాల్లో ఇమడ్చడానికి ప్రయత్నించాను.

గురువెక్కడో నీవు గురుతెరగవోయి 
గుడి ఇక్కడేనంటు గనిమ్రొక్కవోయి 

గురువంటె శివుడంటు గురుగీత చెప్పెను 
శివుడంటె జగమంత వ్యాపించి ఉండును 
కదిలేది కదలనిది కానిదేది గురుమయం 
                                   ఇది తెలిసి మెలుగుటయె గురుకుల జీవనం // గురువెక్కడో నీవు//

కనిపించునది ఎంతొ కనువిందుసేయగా 
గుర్తించు కణకణమునున్నదే గురువని 
చవులూరు రుచులన్ని చవిజూచు వేళలో 
                               గమనించు అన్నపానీయాలన్ని గురువని // గురువెక్కడో నీవు//

ప్రియమైన కటువైన వినిపించునదియంత 
రవళించు గురువు నిను పలికించు గురువు 
భావమై భాషయై మనసంతటా నిండి 
                                నడత నేర్పును గురువు నడిపించు గురువు // గురువెక్కడో నీవు//

స్పర్శించునదియంత సమ్మిళితమైయుండి 
పొదువుకొను గురువు ప్రేమించు గురువు 
ఉచ్వాసనిశ్వాసలో ఊయలూగే 
                               ఊపిరి గురువు నీ ఉసురు గురువు // గురువెక్కడో నీవు//

గురుశిష్యులంటేను బింబప్రతిబింబాలు 
ఇరుదేహముల నమరు ఏకాత్మ రూపాలు 
మనసుతోనే వారు జరుపు సంభాషణలు 
                               పరమాత్మ ప్రమిదలో అలరారు దీపాలు // గురువెక్కడో నీవు//

వెలుపల లోపల నున్నారు గురువు 
వదలక వెన్నంటి కాచు గురువు 
గురువేక్కడోలేరు గాలించకోయి 
                                     గుండెలోనున్నారు  గుట్టుతెలియవోయి  // గురువెక్కడో నీవు//






Thursday, June 4, 2015

రుద్ర సమాగమం

రుద్ర సమాగమం 
------------------
భావరాజు పద్మిని - 4/6/15 

పాడెనెక్కినంత బతుకు పండిపోయే 
కాటికెళ్ళినంత కధ మారిపోయే  

మేలుపూతలు పూసి, పెంచు మేనికాంతి 
మండు కట్టెలలోన మసిబారిపోయే

నీలాల కురులంటు జాలువారిన సొగసు 
నిముషాల్లో నిలువెల్లా నిగిరిపోయే 

తప్పొప్పులెంచుతూ తరచి చూచిన కళ్ళు 
ఇంద్రియములు తోడుగా పేలిపోయే 

కన్నవారినైనా కాలదన్నిన కాళ్ళు 
కరకు కట్టెలలోన కాలిపోయే 

అన్నినావేననుచు బారజాచిన చేయి 
ఏమందుకోలేక ఇగిరిపోయే   

పొట్టకూటి కొరకు పొట్టలు గొట్టిన బుద్ధి 
కపాలమోక్షమున కరిగిపోయే 



నీకు తోడు నేను – అన్న ఆప్తులంత
ఆమడ దూరానే ఆగిపోగా ...
రక్తమాంసములన్ని రగిలి బూడిద కాగ 
ఒంటరైన ఆత్మ వగచుచుండ ...
అపుడు వచ్చునట నీకై భస్మధారి.

ఏకాకి ఆత్మలకు ఆత్మజ్ఞానము నొసగి,
జన్మ బంధమని, మృత్యువే స్వేచ్చని,
తెలిపి తన బిడ్డలను దరిజేర్చి ఓదార్చ,
మరుభూముల తిరుగుచుండు భూతపతి..

మరణ భయమేల తెలుసుకొనవే మనసా,
కరుణ గాచును నిన్ను కైలాసనాధుడు. 
నటనలు ముగిసే నవజన్మంబిది,
మృత్యువనగా రుద్ర  సమాగామమే !

Thursday, February 12, 2015

ప్రతిక్షణం చంద్రోదయమే !

ప్రతిక్షణం చంద్రోదయమే !
----------------------------
భావరాజు పద్మిని 

అరచేతులు చాచి మోడ్చి,
ఆకాశంలో చంద్రుడిని చుస్తారొకరు 

నీటిచుక్కైనా త్రాగక ఉపవశించి,
జల్లెడలో చంద్రుడిని చూస్తారొకరు 

సంకష్టినాడు వినాయకుని పూజించి,
చంద్రోదయానికై నిరీక్షిస్తారు ఒకరు  

చంద్రకళల తోటి పున్నమికొక, 
ముద్ద తగ్గిస్తూ వ్రతాలు చేస్తారొకరు 

మాకా నిరీక్షణలు లేవు...

కనులు మూసుకుని ధ్యానిస్తే,
ప్రతి క్షణం గురుచంద్రోదయమే !
పదహారు కళల పూర్ణచంద్రుడు...
ఆయన మోమే పున్నమి జాబిలి...
ఆయన మనసే వెన్నెల చలువ...
ఆ చలువకు వికసించే కలువలం.
మాకు ప్రతిక్షణం చంద్రోదయమే !