Saturday, July 9, 2016

నా పద్యాలు

నా పద్యాలు
సర్వలఘు ఆటవెలది - 9/7/16


నిరతము నిను దలచు నినెమదిని నినుచు
నిజపదముల నిలుచు నెనరు కొలుచు
నిఖిలము నిగుడిన నినె హరిగ నెరుగుచు
నలరు బగుతుడె నిలనడయు నజుడు
భావము: నిరంతరం నిన్నే తలుస్తూ, నిన్నే మనసులో నిలిపి, నీ పాదాల వద్ద నిలచి, ప్రేమతో కొలిచి, అంతటా నిండిన నిన్ను హరిగా గుర్తించి మెలిగే భక్తుడు ఇలలో నడిచే దైవమే కదా!
***********************************************************************



మహా లింగావిర్భావము  -7/3/16
శివానుగ్రహంతో – భావరాజు పద్మిని
ఆ.వె.
తాను గొప్ప యనుచు దల్బమాడె విరించి
తానె గొప్ప యనుచు దబ్బె హరియు
వాదు లాడు చుండ వారిమధ్య వెలసె
దివ్య కాంతు లెగయు తేజ మొకటి
(దల్బము , దబ్బె = దంభము, గొప్ప )
భావము : ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య తాను గొప్ప అంటే, తానే గొప్ప అన్న వివాదం రేగింది. వారు అలా వాదములో ఉండగా, వారి మధ్యన దివ్య కాంతులు చిందుతున్న ఒక తేజస్సు ఉద్భవించింది.
కం.
ఉదరథి తేజపు కంభము
పొదలుచు మిరుమిట్లు గొలుప బుగులుచు మనమున్
మొదలును తుదియును తేల్చగ
కదిలిరి నిరువురు వడివడిగ నిరు కకుభమున్
(పొదలు = ప్రకాశము , ఉదరధి =సూర్యుడు, కకుభము =దిక్కు )
భావము : సూర్యుడి వంటి తేజస్సు కలిగిన స్తంభము తమ కనులకు మిరుమిట్లు గొలపగా, కలవర పడినవారై, దాని మొదలును, తుదిని తేల్చాలని, ఇద్దరూ చెరో ప్రక్కకూ బయలుదేరారు.
సీ.
ధగధగ మెరిసెడి తళుకుల తుదియును
వెదకుచు మింటికి వెడలె శలుడు
మిలమిల కాంతుల మిసమిస మొదలును
నరయుచు కిందకు నరిగె హరియు
మొగలి సుమమొకటి ముందర నగపడ
బెదిరించి రుజువిడ బెమ్మ దెచ్చె
యాదియు గానని యంబుజ నాభుడు
యలసి వెనుదిరగ యంత లోనె
ఆ.వె.
కంబ మధ్య మునను కన్పించె ముక్కంటి
సత్య మొప్ప హరిని జాలి బ్రోచె
ధాత మొగలి బొంక తామసము రగుల
శాప మిడెను హరుడు శంక బాప
భావము : ఆ దివ్య జ్యోతిర్ స్తంభము చివరను కనుగొనేందుకు పైకి వెళ్తాడు బ్రహ్మ, ఆ స్తంభము మొదలును చూసేందుకు క్రిందికి వెళ్తాడు విష్ణువు. దారిలో బ్రహ్మకు ఒక మొగలి పువ్వు కనిపిస్తే, దాన్ని బెదిరించి, తాను ఆ జోతిస్స్తంభం మొదలును చూసానని, దొంగ సాక్ష్యం చెప్పమని ఒప్పించి తీసుకుని వస్తాడు. ఆ స్థంభం మొదలు చూడలేని విష్ణువు అలసిపోయి వెనక్కి వచ్చేంతలో జరుగుతుంది ఒక అద్భుతం ! ఆ స్థంభం మధ్యలో శివుడు ఉద్భవిస్తాడు. నిజము చెప్పిన శ్రీహరిని అనేక వరాలు ఇచ్చి, రక్షిస్తాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును, ‘నా పూజకు పనికిరావని’ శపిస్తాడు. అలాగే గర్వంతో బీరాలు పలికిన బ్రహ్మ ఐదవ తలను, కాలభైరవుడిని సృష్టించి కొనగోటితో పెరికిస్తాడు. వారి పాపాన్ని నిర్మూలించడానికే కదా, శివుడు ఏది చేసినా !
తే.గీ.
దివ్య లింగము నర్చింప దివిజులెల్ల
తరలి వచ్చి మొరలిడిరి ధరణి వెలయ
యంత నరుణాచలంబున యమరె శివుడు
మాఘ శివరాత్రి నందు శమము లిడంగ
భావము : అంతట ఆ దివ్య లింగాన్ని కొలిచేందుకు దివి నుంచి దేవతలు దిగి వచ్చి, ‘స్వామీ, భక్త రక్షణకు ఈ భూమిపైనే కొలువుండు, అని వేడుకుంటారు. వారి ప్రార్ధనలు మన్నించిన శివుడు మాఘమాసంలో, శివరాత్రి రోజున, అరుణాచలంలో దివ్య జ్యోతిగా , అందరికీ మోక్షాన్ని ఇచ్చేందుకు వెలిసాడు. ఇదే మహాశివరాత్రి కధ !
సర్వం శివార్పణమస్తు !!

**********************************************************************************************************


ఇవాళ అహోబిల వాసుడు అనుగ్రహించిన పద్యం.
వసంత తిలక ఛందస్సు :
శ్రీగోమినీశ/ నిజచిన్మయ/క్రోడరూపా
రాగానులోల/ శ్రికరంజన/ యుగ్రజ్వాలా
వాగీశవంద్య/ జనపావన /భర్గపూజ్యా
యోగానురక్త/ శ్రియహోబిల/ సార్వభౌమా
పద్య విశేషాలు : గోమిని -లక్ష్మి(మాలోల నృసింహ స్వామి), క్రోడరూప(వరాహ నృసింహ స్వామి), రాగానులోల( ఛత్రవట నృసింహ స్వామి ), శ్రికరంజన (కారంజ నృసింహ స్వామి), ఉగ్రజ్వాలా(జ్వాలా నృసింహస్వామి), జనపావన (పావన నృసింహస్వామి), భర్గపూజ్యా - పరశురాముడి చేత పూజింపబడిన భార్గవ నృసింహ స్వామి, యోగానురక్త - యోగానంద నృసింహస్వామి, అహోబిల సార్వభౌమా - అహోబిల నృసింహ స్వామి.
పద్య విశేషాల కంటే, ఈ పద్యం పుట్టుక గురించి కాస్త చెప్పుకోవాలి. ఈ సారి గురూజీ నిర్వహిస్తున్న మహాయజ్ఞానికి వెళ్ళినప్పుడు, ఎలాగైనా జ్వాలా నృసింహ స్వామి దర్శనం చేసుకోవాలని అనిపించింది. ఒక రోజున మాలోల నృసింహస్వామి వరకూ వెళ్ళినా, జ్వాలా వెళ్ళే అదృష్టం దక్కలేదు. మర్నాడు పిల్లలతో వెళ్ళినప్పుడు, ఎలాగైనా జ్వాలా చూడాలని ఉందని మా వారితో అన్నాను. 'పిల్లలతో కష్టం' అన్నారు. పిల్లలూ వెళ్దామని మారాం చేసారు. నేనూ బుంగమూతి పెట్టేసాను. మావారు, 'సరే పదండి' అంటూ బయల్దేరారు.
ఎప్పుడూ, ఏ.సి లేక హీటర్ లో బ్రతికే నా ఇంక్యుబేటర్ కోళ్ళు (పిల్లలు), ఎలాగో నడుస్తున్నాయి. చేతిలో కర్రలు, ముందు రాళ్ళు, రప్పలు తప్ప దారి లేదు. అలాగే సెలయేరు మధ్యనుంచి నడుస్తూ, రాళ్ళపైనుంచి పాకుతూ, ముందున్న వారిని అనుసరిస్తూ వెళ్ళసాగాము. కాసేపటికి ఓ బ్రిడ్జి, పక్కన మెట్లు వచ్చాయి. మెట్లు ఎక్కుతూ, ఆ కొండల సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, జ్వాలానృసింహ స్వామి కొండపై ఉన్న అమృతతుల్యమైన భవనాశిని జలపాతంలో నీటిని త్రాగి, ఆడి పాడుతూ ఉండగా, 'ఈ సువిశాలమైన అహోబిలం అనే సామ్రాజ్యానికి రారాజు ఆ స్వామే కదా, అనిపించింది. అనిపించగానే, వెనువెంటనే - అహోబిల సార్వభౌమా అన్న మకుటం స్ఫురించింది. 'ఎప్పటినుంచో శతకం రాస్తానని, గోల పెడుతున్నావ్ కదా, ఓ చండీరాణి, ఈ మకుటంతో రాయి,' అన్న ఆజ్ఞ వినవచ్చింది. నేనలా స్వామితో మనసుతో మాట్లాడుతూ ఉంటాను, ఆయన నన్ను, నేను ఆయన్ను ఆటపట్టించుకుంటూ ఉంటాము. అసలు నిజమైన భక్తిలో ఆ మాత్రం చనువు ఉండాలట !
సరే, స్వామి మకుటం చెప్పారు. నేనా ఛందస్సు అనే సముద్రంలో పిల్ల చేపను. ఈ మకుటం ఏ ఛందస్సుకు సరిపోతే, అందులోనే పద్యాలు రాస్తాను, అని నిశ్చయించుకున్నాను. ఈ లోగా రేడియోలో 'మన దేవాలయాలు' అనే కార్యక్రమానికి అహోబిలం గురించి చెప్తుండగా, ఆహోబిలాన్ని దర్శించిన ఇదే మకుటంతో తిరుమంగై అనే ఒక తమిళ ఆళ్వారు 'నాలాయిర దివ్య ప్రబంధం' లో పది పాశురాలు రచించారని తెలుసుకుని, ఆశ్చర్యపోయాను. ఇక ఛందస్సు పుస్తకం ముందేసుకుని, ఈ అహోబిల సార్వభౌమా అనే మకుటం ఏ ఛందస్సుకు సరిపోతుందో చూసాను. అదే - వసంత తిలక. పేరు గొప్పగా ఉంది కదూ, ఇక్కడ మరో విశేషం కూడా ఉంది. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని తొలి పద్యాలు అన్నీ ఇదే ఛందస్సులో రాయబడ్డాయి. ఇది రీసెర్చ్ లో తెలిసింది. పేరు యెంత బాగుందో, ఛందస్సు కూడా అంత బాగుంది, నాకైతే భలేగా నచ్చింది.
కాని ఈ పద్యం రాసేందుకు పడ్డ తిప్పలున్నాయి చూసారూ... ఒక్క పద్యం స్వామి పాదాల దగ్గర పెట్టేసి, 'స్వామి, ఇదే శతకం అనుకోండి,' అని పారిపోయేంత కష్టం ఉంది. అదీ, నాలాంటి పిల్ల చేపకి - ఎందుకంటే - ఈ ఛందస్సులో 8/11 వ అక్షరం యతి. నన్నయ్య 8 వాడారు, వెంకటేశ్వర సుప్రభాతంలో 11 వ అక్షరం వాడారు. పెద్దల్ని కనుక్కుంటే, ఈ సుప్రభాతం సంస్కృతంలో ఉంది కనుక, 8 తో జతకట్టమన్నారు. ఇక్కడ మొదలైంది అసలు తిరకాసు. అహోబిల లో హో - అనే అక్షరానికి సరిపోయేలా ముందు పదం తయారు చేసుకోవాలి, తర్వాత ఆ పదం ప్రాసని బట్టి, పై పాదాల యతులు, ప్రాసలు. హో - అనే అక్షరానికి యో, యూ,హూ,హో(ఈ ఛందస్సులో తోలి అక్షరం గురువు కనుక) మాత్రమే సరిపోతాయి. యో, యూ,హూ,హో - వీటితో పదాలా , ఉన్నా ఎన్నుంటాయి, శతకం అవుతుందా లేదా ? హ. హ హ ... అని ఓ వెర్రి నవ్వు నవ్వడం తప్ప, నాకూ తెలీదు. సస్పెన్స్, ఈ దేవుడితో ఎప్పుడూ ఇంతే లెండి.
హా, హా , హూ, హూ - అనే గంధర్వుల గానాన్ని మెచ్చి వారికి శాపవిమోచనం కలిగించిన ఛత్రవట నరసింహ స్వామీ - మీరే కాస్త కనికరించి, ఎలా శతకం రాయిస్తారో రాయించుకోండి. యతి 11 తో అడ్జస్ట్ అవమంటారా లేక మకుటం మార్చేసి, ఆటవెలదితో ఆడుతూ, పాడుతూ ప్రొసీడ్ ఐపోమంటారా తర్వాత మనం మనం ఒక ఒప్పందానికి ఒద్దామే. 'నృసింహ స్వామిని వదలద్దు' అని గురూజీ ఈసారి చెప్పారు. పద్యం కుదరనంతసేపూ, స్వామిని తలచుకునే ఛాన్స్ దక్కుతుంది కదా ! ఇదీ మంచిదే కదా. " మేజిక్ బెగన్స్ వేర్ లాజిక్ ఎండ్స్'
తరవాయి భాగం దైవ నిర్ణయం మరి. జయ జయ నృసింహ.

*****************************************************************************************************************
నిన్నమొన్న గెంతడం నేర్చుకున్న పిల్లకోతి హనుమంతుడి ముందు కుప్పిగెంతులు వెయ్యటం అంటే ఇదే... చూడండి... ఈ సమస్యకు నా పూరణ...
సమస్య : బావ లేక రుచులు వచ్చుటెట్లు
చూడ చక్కనమ్మ సోగకన్నుల కొమ్మ 
అయిన నేమి వంట యసలు రాదు
కలతనొందెనక్క కాంచి బంధువులను
బావ లేక రుచులు వచ్చుటెట్లు

*****************************************************************************************************************
మొదట్లో తెలుగు టైపింగ్ రాదన్నవారు ఈ బృందంలో చేరి నేర్చుకుంటే చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు, ఇక్కడ పిన్నులూ, బాబాయ్ లు అంతా కలిసి, మా అక్కయ్యలకి, తమ్ముళ్ళకి పద్యాలు రాయటం నేర్పేసి, వారు ఎడా పెడా పద్యాలు రాసి పారేస్తుంటే, చెప్పద్దూ, నాక్కూడా కాస్త ఉడుకొచ్చి, ఆ పై కాస్త పట్టుదల వచ్చి, రాత్రి 10 నుంచి ఒక అరగంట పుస్తకాలు చదివేసి, ఆ పై మధ్యాహ్నం 2 గంటలకు చెయ్యి తీరిక అయ్యాకా, పట్టువదలని విక్రమూర్ఖురాలిలా కూర్చుంటే, ఇదిగో గురు అనుగ్రహం వల్లా, శ్రీ కవుటూరు ప్రసాద్ గారి ఆత్మీయ సహకారం వల్లా... రాసిన తొలి పద్యం... గురు చరణాలకే అంకితం. పెద్దలు తప్పులుంటే, దయుంచి సరిచెయ్యగలరు.
ఆ.వె.
శ్రీకరమగు గురుని శ్రీచరణంబులె
శరణమనుచు నమ్మి శర్కరమగు |
అక్షర సుమములను అల్లిసమర్పింతు
మొదటి పద్యమమర ముదము తోడ || - 1/4/2015

గురు భక్తుల కధలు - గేయం

గురుభక్తుల కధలను మననం చేసుకునేలా గురుఅనుగ్రహంతో ఇదివరలో నేను రాసిన ఈ గేయం, గురుపౌర్ణమి సందర్భంగా మళ్ళీ మీకోసం...
గురు భక్తుల కధలు - గేయం
-------------------------------
(సద్గురు కృపతో - భావరాజు పద్మిని )

గురు భక్తుల కధలను వినరండి -గురు మహిమను కనుగొనరండి
ఆదిశంకరుడే ఆదిగురువని- ఆరాధించెను సనందుడు
ఆతని గురుభక్తికి మెచ్చి- అనుగ్రహించెను శంకరులు
అసూయతో తక్కిన శిష్యులు- ఆలోచించిరి కారణము
అనన్యభక్తిని నిరూపించగా -సంకల్పించెను తొలిగురువు
అద్దరినున్న సనందుని పిలిచి - గంగకు ఇద్దరి వేగరమ్మనె
ఆత్మను గురుని స్మరించి - నదిపై వేగమె పరుగిడె శిష్యుడు
అడుగడుగుకూ పద్మమొక్కటి -ఆవిర్భవించె గురుమహిమన
ఆ నదిపై మునగక నడచిన - సనందుడయ్యెను పద్మపాదుడు
అచ్చెరువున శిష్యగణము - యెరిగిరి నిశ్చల గురుభక్తి మహిమ || గురు భక్తుల ||
గురుసేవయే పరమార్ధమని - వేదధార్యుని చేరే దీపకుడు
గురుని వినయమున సేవించి - వేదవిద్యల అభ్యసించెను
గత జన్మకర్మల నివృత్తికై - తా వ్యాధుల కృంగాలనె గురువు
గురుని వీడక దీపకుడు - గురుసేవకై కాశీ పయనమాయెను
ఘోర రూపమున గుడ్డియై - కుష్టువ్యాధితో కుమిలెగురవు
పుండ్లను కడిగి,మలమును తుడిచి - భిక్ష తెచ్చెను దీపకుడు
కసిరిన విసిరిన కలత చెందక - సహనము వీడక సేవచేసేను
గురుని సేవయే సకల పూజలని- ప్రసన్నులాయిరి దేవతలు
అచంచల గురభక్తియే చాలని - వరమడిగి తరించె దీపకుడు || గురు భక్తుల ||

         

ధౌమ్యుని గురుకులమున నుండిరి – అరుణి ఉపమాన్యువు బైదులు
అరుణి పొలమునకు అడ్డుకట్టయై – గురుకృపచే యోగగురువయ్యెను
బైదుడు గురువాజ్ఞను క్షేత్రమును- సాగుచేసేను కాయకష్టమున
పంటను ఇంటికి తెచ్చు త్రోవలో – కాడెద్దులు కుంటుపడెను
తానే బండిలాగుతూ సోమ్మసిల్లగా- గురువు బ్రోచి విద్యలనిచ్చెను
ఉపమాన్యుడు గురుఆజ్ఞ మీరక – ఆహారము వీడి ఆకుల తినెను
గుడ్డివాడుగా కూపమున పడగా – కరుణను గురువే కనికరించెను
అశ్వినీ దేవతల కరుణను పొంది – చదువకయే సకలజ్ఞాని అయ్యెను
ఉద్దాలకుడను శిష్యుని గురువై – దేవతలు మెచ్చే గురువాయెను || గురు భక్తుల ||
గురుమహిమను చాటి చెప్పగా –భాషయే అవిటై మూగబోవును
చండాలునిచే వేదము చెప్పించే – భక్తుల ‘దత్తుడు’ దత్తాత్రేయుడు
చాకలిని రాజును చేసెను – కరుణామయుడు శ్రీపాదవల్లభుడు
నరహరి శర్మను కృపతో కాచి – కుష్టు మాపెను నృసింహసరస్వతి
మాణిక్య ప్రభువుగ మహిమచూపి – స్వామిసమర్ధగ అవతరించెను
షిరిడి సాయిగా వెలసిన దత్తుడు – ప్రేమతో మార్గదర్శకుడాయెను
గురుచంద్రుడే శిష్యుల కావగ – షోడశావతారములను దాల్చెను
ఇత్తడి పుత్తడి సేయు పెన్నిధే – సద్గురువనే ఘన పరశువేది
గురుపాదుకలే వదలక పట్టిన – దక్కనిదేదీ లేదీ జగమున || గురు భక్తుల ||

దివ్వెల కళ్ళు

దివ్వెల కళ్ళు
-----------------
భావరాజు పద్మిని - 28/4/16


విశ్వమునేలే మాయల వేలుపు 
నాటకసూత్రము నింపిన కళ్ళు 
కనికట్టేమని తరచి చూడగా 
కన్నులు కావవి ఆత్మ సంకెళ్ళు

సర్వజీవులకు సమ్మోహనమై
సర్వకళలకు సమ్మేళనమై
సకలప్రాణులను సమభావనతో
కంటికి రెప్పగ కాచే కళ్ళు

సంద్రపు లోతుల నిగూఢతత్త్వం
గగనపు విశాల వ్యాపక నైజం
ప్రణవ నాదపు ప్రశాంత భావం
నిబిడీకృతమై వెలిగే కళ్ళు



కన్నులు కాంచే దంతయు మిధ్యని
చూడలేనిదే శాశ్వత నిధియని
బైటవెతుకక లోన చూడుమని
చెప్పక చెప్పే దివ్వెల కళ్ళు

దృష్టియు ద్రష్టయు అంతా తానని
ప్రాణుల నుండెడి జీవము తానని
తనను చేరుటే జన్మ గమ్యమని
వేద సారమును తెలిపే కళ్ళు

దీపపు కాంతికి శలభము వోలె
కన్నుల జ్యోతికి బానిసనైతి
అక్కున జేరే మార్గము జూపి
ఆదరించుమా ఆత్మదీపమా!

//గురు హృదయం//

//గురు హృదయం//
---------------------------
భావరాజు పద్మిని - 15/5/16

కొందరు బిడ్డలె ఒక్కతల్లికి 
అందరు బిడ్డలె అమ్మగురునికి 
అక్కున చేరిచి ఆదరించును 
కంటికి రెప్పగ కాచుచుండును.

తాను తిన్నను బిడ్డడి ఆకలి,
కన్నపేగును కలచివేయును. 
శిష్యుల పస్తు గురువుకు బరువై,
కడుపునింపగా కలవరపడును.

నిద్దుర చాలక నీరసపడినా 
అలసట కమ్ముచు ఆవరించినా 
తరుణోపాయము తక్షణమేనిచ్చును 
హితులనుకొను పగవారిని జూపును.


చేయి పట్టుకొని నడకలు నేర్పి,
ముక్తిమార్గమును తాను చూపును 
విద్యాబుద్ధులు అక్కరలు దీర్చి,
ఆపదలందున ఆదుకొందును.

మంచిని పెంచగ నడవడి తెలిపి,
మార్గము మార్చగ మందలించును 
దానము సేవ ధర్మము నేర్పును 
మాటల జెప్పక చేసి చూపును.

అన్నీ ఉన్న బిడ్డడి కన్నను, 
కొరతలు ఉన్న బిడ్డని మీదనె 
మమత ఎక్కువట మాతృమూర్తికి 
అదియె సత్యము తల్లిగురువుకు.

బిడ్డ ఎదుగుతూ తల్లిని మరచిన 
తన సంతోషమె తగని పెన్నిధని 
దూరమునున్నా పూజలు చేయును 
గురువటులె వీడక క్షేమము కోరును.

పేగు బంధమా ప్రేమ పాశమా 
ఏది గొప్పయని తరచి చూచిన
ఏమరుపాటున తల్లి మరచినా 
గురువు వీడరు జన్మజన్మలా.

(పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజీ కృపావాహిని )

శ్రీ అహోబిల నృసింహ దండకం

ఓం నృసింహ దేవాయ నమః 
నృసింహ స్వామి అనుగ్రహంతో మే 18, 2016 న వర్షించిన ఈ దండకంలో అహోబిలంలోని నవనారసింహాల సంక్షిప్త చరిత్ర, 'ఉగ్రం వీరం 'అనే మంత్రరాజపద స్తోత్రం లోని నామాలు, 'అహో వీర్య మహో శౌర్యం' అనే శ్లోక భావం క్లుప్తంగా పొందుపరచడం జరిగింది. సర్వం శ్రీ నృసింహార్పణమస్తు !



శ్రీ అహోబిల నృసింహ దండకం
--------------------------------------
శ్రీనార సింహా ! మహాభాగ !యాహోబిళా సార్వ భౌముండ వైనీవు లోకాల రక్షింప ఈరూపు తోడన్ !ఇలన్బుట్టి కొండంత నీరూపు కారుణ్య మున్తోడ కుంచించి, మాకన్నులాపంట గానీవు నిండార వేంచేసి తీవయ్య ఓభక్త చింతామణీ ! దుష్ట శిక్షాగ్రణీ !శిష్ట రక్షాకరానిత్య పారాయణీ దేవ|
ఓస్వామి ! యుగ్రుండ వీరుండ శ్రీమాహ విష్ణుండ! హేజ్వాల రూపుండ ! సర్వాతొ ముఖ్ఖుండ ! నౄసింహ దేవుండ! భీషాణ కారుండ ! భద్రుండ !మృత్యూవు కేనీవు మృత్యుండ వైనావు గాదా మహావీర!
ముమ్మూడు మూర్తూల నున్ దాల్చి నీవేయహాబీల తీర్ధాన నొప్పీతి వీగాద యాగాధ నూవిన్న నాకెంతొ నచ్చెర్వు నాయెన్ గదాదేవ దేవాధి దేవేశ!
జ్వాలానృసింహుండవైనీవు కంబమ్ము నందున్జనించిన్ ని, భక్తుడ్ని రక్షించి, హీరణ్య కాశీపు నిన్ద్రుంచి, అత్యుగ్ర రూపంబు తోడన్ చరించంగ, భీతిల్లి లోకాలు నల్లాడగాజూచి, బాలున్త పస్సూను జేయంగ నంతాట, కోపమ్ము వీడి, స్వయంభూవు గానీవు భవ్నాశి తీరంబు నందున్యహోబీల నౄసింహ దేవూని గానొప్పి నావూగ !
వేదాద్రి పైనీవు మాలోల సామీగ వేంచేసి ఈకొండ పైనేను భూమాత నూగాచ, వేదాల రక్షింప వారాహ మూర్తీగ జన్మించి నావే ! హనూమంతు నిన్ కోర్కె దీర్చంగ కారంజ వృక్షంబు ఛాయన్ ధనస్సున్ ధరించీ బయల్పాడి తీవోయి నాస్వామి !
అక్షాయ తీర్థంబు చెంతాను భర్గుండు నీపూజ జేయంగ మెచ్చీయు భార్గోటి రాయూని గానొప్పి తీవంట! యోగమ్మునందున్న యానందమున్దెల్ప పట్టంబు వేసీన తీరూన, యోగానృసింహమ్ము గావచ్చి యాబ్రహ్మ కేశాంతి నిచ్చీతి వీగాద !
హాహాహు హూయాను గంధర్వులా శాపమున్బాప నాదివ్య గానమ్ము,నృత్యమ్ము నాలించి తాళమ్ము వేయూచు ప్రత్యక్ష మైతీవి! పాపూల పాపాలు గాంచీన వెన్వెంట బాపేటి పావాన మూర్తీగ భారద్వజాద్రష్ట ప్రార్ధన్ను మన్నించి, లక్ష్మీస మేతుండవై, యాది శేషూని నీడన్వెలాసీతివీ స్వామి!
ప్రహ్లాదునీగాచ నీలీలలంజూచి ‘యాహో’యనీ దేవతాలెల్ల నచ్చెర్వు నొందూచు ‘వీరాధి వీరుండ! శూరాధి శూరుండ! బాహూపరాక్రామ ధీరుండ!’ నంచూను కీర్తించి నర్చించి ధన్యూల యీరంత !
యంతాటి వారాలె నిన్నున్ న్నుతించంగ మాటాలు రానట్లు మూగాలు యైనారు నిన్నెంచ నేనెంత నోస్వామి నీదాస దాసీని నీపాద ధూళిన్ ప్రభోనేను ! యల్పూల మీదానె నీజాలి జాస్తీగ వర్షింతువూగాద !నోదేవ ఈయాత్మ నీచెంత కున్చేర్చి పాలింప వాస్వామి ! ఓప్రాణ నాధా !నమస్తే నమస్తే నమస్తే నమః !