Sunday, November 6, 2016

కోటి సోమవార పద్యాలు

కోటి సోమావారం సందర్భంగా శివుడికి తేటగీతిలో ఐదు పద్యాల మాలిక... తప్పులుంటే పెద్దలు దయుంచి తెలుపగలరు.

తుమ్మి పువ్వుల పూజను తుష్టి నీకు
ముళ్ళ కాయల నిడగను ముదము నీకు
అల్ప వస్తువుల నొసగ యాదరించె
హరుడ నీసరి ఎవ్వరు అమరులందు ||

విషము గళమున దాచేవు వింత కాద ?
విషపు పాముల చుట్టేవు బెదురు లేద ?
భూత గణములె బంటులై పొలయుచుండు
హరుడ నీసరి ఎవ్వరు అమరులందు ||

అగ్గి కంటిని దాచేవు ఆర కుండ
గంగ జడలను చుట్టేవు కార కుండ
శీత చంద్రుని కాపాడ శిఖను తొడిగె
హరుడ నీసరి ఎవ్వరు అమరులందు ||



జంతు చర్మము బట్టగ చాప చుట్టి
వల్ల కాటినె ఇంటిగ వరల బెట్టి
బుగ్గి ఒంటికి పూసుకు పొంగిపోవు
హరుడ నీసరి ఎవ్వరు అమరులందు ||

రాగ మెరుగని వైరాగ్య రాయుడీవు
సంగ మెరుగని జంగమ సామివీవు
భవ హరుడ కలి తమమును బాపి కాచు
హరుడ నీసరి ఎవ్వరు అమరులందు ||

- భావరాజు పద్మిని



7/11/16

Saturday, October 15, 2016

నీసరి ఎవ్వరు నీలకంధరా !

నీసరి ఎవ్వరు నీలకంధరా !
---------------------------------
భావరాజు పద్మిని - 16/10/16

సుమశరుడిని నువు కాల్చినావట
దక్షుని మదమును ద్రుంచినావట
బ్రహ్మ మత్సరము అణచినావట
వికారమంటని విహితయోగివట

చంద్రుని కావగ శిరసునుంచితివట
గంగను నిల్పగ జడనుగట్టితివట
విషపు నాగులను కట్టుకొందువట
గరళమె గళమున అదిమినావట

మంచుకొండవలె కరిగిపోదువట
మ్రొక్కిన గ్రక్కున వరమిచ్చెదవట
లోకువ గట్టిన లెక్క చేయవట
రాగము తెలియని విరాగి నీవట

సగము దేహము సతికినిత్తివట
దక్షిణ మూర్తివై జ్ఞానమొసగెదవట
భక్తుల మృత్యువు బాపి కాతువట
నీసరి ఎవ్వరు నీలకంధరా !



కామము కమ్మెను క్రోధము కాల్చెను
లోభము కూల్చెను మదము ముసిరెను
మత్సరమణచెను మోహము మీరెను
ఆరుశత్రువుల నరికట్టలేనైతి.

ఇన్నిటి నడుమన ఇరుకునబడితిని
అన్నిట గెలిచిన నిన్ను చేరితిని
శిరమును వంచి శరణు వేడితిని
శంకర పాపముబాపి గావుమా !

పిలచినంతనె పరుగున వచ్చెడి
బోళాశంకర మొరలాలింపుము
సంగము బంధము రాగామంటని
జ్ఞానజ్యోతినే ఆత్మను నిలుపుము

గురువే శివుడని చాటిన స్వామీ !
గురుపాదుకలను గురిని నిల్పుము
గురుధ్యానమునే మరలనీయక
గురునె లయమగు మార్గము జూపుము.






Saturday, September 3, 2016

నీడ చెప్పిన నిజం

ఒక స్థితిలో భక్తుడి మనసు భగవంతుడిలో లయమైపోతుంది. ప్రతి శ్వాసలో , ప్రతి స్పర్శలో , ప్రతి పిలుపులో , ప్రతి ప్రాణిలో అనంతుడి స్వరూపమే గోచరిస్తుంది. జీవాత్మ పరమాత్మలో లయమైన అద్వైత స్థితి అది. పరమాత్మ దయ ఉంటే తప్ప, ఆ స్థితి భక్తుడికి త్వరగా అవగతం కాదు. కృష్ణారాధిక రాధిక కూడా ఇప్పుడు అదే స్థితిలో ఉంది. 'నల్లనయ్య లాగే నీవూ కృష్ణ వర్ణంలోనే ఉంటావు కదూ, నాలో ఈ తృష్ణ ఎందుకో చెప్పవూ...' అని యమునమ్మను అడిగింది. ఆమె ఏమి చెప్పిందంటే...

నీడ చెప్పిన నిజం 
-------------------------
భావరాజు పద్మిని  - 11/3/15

తనువు తాకే అనిలమైనా 
అనంతుడేనన్న అనుభూతి !

కన్నులు కాంచే ప్రతి రూపూ 
కన్నయ్యేనని కనికట్టు !

వీనుల మ్రోగే ప్రతి రవము 
మురళీధరుడని మైమరపు !

కలనైనా, మెళకువనైనా 
నల్లనయ్య మధుమురళీ రవళి !

పున్నమి సంద్రంలా ఎగసే,
అలౌకిక ఆనందతరంగం !




అంతలోనే చీకటి మబ్బులా, 
మనసును కమ్మే నిర్వేదం !

చెట్టూ, పుట్టా, చేమ, అంతటా 
లీలామోహనుడి లాస్యమే !

దృశ్యజగతికి దూరంగా ఆత్మ 
ఆనంద డోలికల్లో నర్తన !

నిలువెల్లా దహించే ఈ తపనఏల?
ఈ తృష్ణ ఎందుకో నువ్వైనా చెప్పవూ ?
నీవూ నల్లనమ్మవేగా యమునమ్మా !
అడిగింది కృష్ణారాధిక రాధిక !

నల్లని యమునమ్మ నవ్వి,
నీటిలో నీ నీడ చూసుకో అంది...
నీటిలోని కన్నయ్య నీడ నవ్వింది,
నీవే నేనంటూ నమ్మబలికింది.
నీ ఊపిరి, దేహం, ప్రాణం,
అంతా కృష్ణమయం అని,
తనువులు వేరైనా , ఏనాడో 
రాధ ఆత్మ కృష్ణునిలో లయమయ్యిందని.

అద్వైత భావనకు అర్ధం తెలిసి,
అన్వేషణ మానుకుంది రాధమ్మ.
అంతటా తానే ఉన్న స్వామిని,
అణువణువులోనూ ఆస్వాదిస్తోంది.
కృష్ణమయం జగత్ సర్వం !!

Thursday, August 4, 2016

//ఏమీ చిత్రం ! //

//ఏమీ చిత్రం ! //
---------------------
భావరాజు పద్మిని - 5/8/16

ఏమీ చిత్రం ! ఏమి విచిత్రం !
హరి నీ లీలలు ఊహాతీతం!

పాములు పక్షులు జన్మవైరులు
ఎదుటన బడ్డనె యుద్ధము తధ్యం
మరి శేషుని గరుడుని దరినె బెట్టుకుని
తిరమున కొలువై ఉండుటె చిత్రం !

వాడి చూపుల ఎరను కనుగొని
వాయువేగమున గోళ్ళను బట్టి
వడితో అలజడిరేపే గరుడుడు
నీకడ మిన్నకుండుటే చిత్రం !

ఏడుపడగల భూభారమును
మ్రోయు శేషుడే అలసి విరతికై
నల్లమలకు తిరుగాడగ వచ్చి
పవళించుటె ఎంతటి చిత్రం !

హరిత శోభకు మురిసి ముద్దుగా
పవళించిన శేషుని పడగలపైన
కలియుగ వరదుడై వేంకటేశుడై
కొలువుండుట అది ఎంతటి చిత్రం!



శేషుని హృదయం హరికి మందిరం
అచట నీవు అహోబిల మనుపురి
సృష్టి చేసి అట వెలసిన తీరును
పరికించగ అది ఎంతటి చిత్రం !

జయవిజయులకు శాపము నీవే!
శాపమునకు మరి ముక్తియు నీవే!
ప్రహ్లాదుడు, హరి భక్తియు నీవే !
భక్తి కొరకు అవతారము నీవే !

అసురుని మనమున విరక్తియు నీవే!
అసురుడు తిరిగెడు పురముయు నీవే!
అసురుని చీల్చిన చేతులు నీవే !
అటనె కొలువైన ఆద్యంతుడ వీవే!

ద్వారపాలకులను దైత్యుల జేసి,
దైత్యుల కూల్చెడు తీరును రాసి
అణువణువున నీవే నిండుతు
ఆటలాడుతీరు మరి ఎంతటి చిత్రం!

హరిహర అభేద భావము చాటగ
శేషుని తోకపై మల్లిఖార్జునిగ
శ్రీశైలమున వెలసిన శుభకర !
మనోవాక్కులకు అందని అనంత!

పడగల పైన భూమిని మోసే
శేషుడు భువిలో పవళించుటయా?
అటుపై నీవట కొలువుండుటయా?
ఇన్ని మాయలందుకు సేయుటయా?

భూమికావల శేషుడు, లోపల శేషుడు
శేషుని వెలుపల లోపల యంతటశౌరి
విషపు పడగలను వేడుక నిలిచి
వింతలు చూపే జగన్నాటక రాయా!

ఇన్ని చేయుచు ఏమి తెలియనటుల
ఇల్లరికపు అల్లుని వలెను హాయిగా
క్షీరాబ్ధిని తేలెడు శేషుని ఒడిలో
పవళించిన హరి నీ మాయలు చిత్రం!

మాయామానుష వేషము గట్టి
మమ్మాడించుట చాలు మురారి
మక్కువ నీదరి చేరెడు మార్గము
గ్రక్కున చూపుము భవాబ్ది తారి !

(నేను రాస్తున్న శ్రీ అహోబిల నృసింహ శతకం కోసం, అహోబిల చరిత్రను అధ్యయనం చేస్తున్నప్పుడు కలిగిన భావాలు... ఇలా స్వామి దయతో వర్షించాయి.)

Tuesday, August 2, 2016

//గోదా కల్యాణం//

//గోదా కల్యాణం//
---------------------
అమ్మవారి అనుగ్రహంతో...
భావరాజు పద్మిని - 28/7/16

శ్రీవిల్లిపుత్తూరు ప్రాంతమందున
భట్టనాధుడను భక్తుడుండెను
చిత్తము విష్ణుని కంకితమనిగని
'విష్ణుచిత్తుడని' జనులు పిలిచిరి

సమ్మోహనమగు విష్ణురూపమును
నిజముగ గన్న పెరియాళ్వారుడు
మంగళ శాసనములనే రాసి
నిజపదదాసుడు హరికర్పించెను

తులసీప్రియునికి వనమునుబెంచ
పాదుల పాతర తీయుచుండగా
ముద్దుల పాపయె కానవచ్చెను
కొమరికగా గొని పెంచసాగెను

'కోదై' అను పూమాలల పేరును
పెట్టి ప్రేమగా పిలువసాగెను
అదియె 'గోదా' యనుచునేర్పడి
గోవిందుని నామము జతనుగూడెను

బాలిక కాదూ హరికి ప్రేమిక
నల్లనివానిని నుల్లము నింపెను
కృష్ణలీలలా ఆడి పాడెను
తన్మయత్వమున కృష్ణునికొల్చెను

విల్లిపుత్తూరు వ్రజపురముగా
చెలులె గోపికల రూపుగ నెంచి
హరిమాలికలను తను ధరియించి
తీసి ఇచ్చెనీ 'ఆముక్తమాల్యద'.

అపచారమనుచు విష్ణుచిత్తుడు
గోదాదేవిని మందలించెను
ఆ మాలికలే తనకు ప్రాణమని
కృష్ణుడె కలలో నగుపడి జెప్పె

యంతట గోదా బాలిక కాదని
తమను కావగా వచ్చిన వేల్పని
తెలిసిన విష్ణు చిత్తుడు ఆమెను
"ఆండాళ్" అంటూ పిలువసాగెను

యుక్త వయసుకు వచ్చిన గోదా
కృష్ణుడినే తన భర్తగ నెంచి
తోటి చెలులతో భక్తిగ కూడి
కాత్యాయని వ్రతమాచరించెను

ధనుర్మాసమున తొలివేకువలో
స్నానము చేసి పూజలు సల్పి
పాశురమొకటి అనుదినమునను
రాసి చెలులతో కూడి పాడెను

తండ్రి చెప్పిన దివ్య తిరుపతుల
గాధలు విన్న గోదా యపుడు
రంగానాధునే తన నాధునిగా
నెంచి పరిణయము ఆడదల్చెను



రంగనాధుడు కలనగుపించి
గోదా అంటే భూమాతయని
ఆమెను తాను వివాహమాడగ
శ్రీరంగమునకు తోడ్కొని రమ్మనె

ఏమి చిత్రమిది ! ఏమి వింతయిది ?
యువతికి దేవుని శిలకు మనువట !
యనుచు జనులు గుమిగూడిన వీధి
'చిత్ర వీధియని' పేరు పొందెను

దేవుని యానను విని పూజారులు
గోదా పెండ్లిని ఘనముగ జరిపిరి
యందరి కన్నుల ముందే గోదా
స్వామి ప్రతిమలో లీనమాయెను

దేవుని చేరే మార్గము ఏదో
గోదా తన పాశురముల చాటెను
దివ్య ప్రబంధము లెన్నో రాసెను
ముందు తరాలకు అందజేసెను

భక్తి విజయమిది రమ్యచరితమిది
భక్తితొ కొలచిన హరియు కరుగునని
దేవుడు సైతం ప్రేమబద్ధుడని
నిజముగ చాటిన పుణ్యగాధ ఇది.

వచ్చి చదివినా రాక చదివినా
నచ్చిన వన్నీ ఇచ్చే చరితము
ఇహపరాలలో సౌఖ్యము గూర్చును
భువిని కల్పకము ఈ "తిరుప్పావై"!