Wednesday, August 5, 2015

గురువెక్కడ ?

"మీ గురువుగారు ఎక్కడుంటారు ?" అని అడిగితే, లౌకిక విషయాసక్తి కలవారికి చెప్పడం చాలా కష్టం... "ఎక్కడ లేరు ? " అన్నదే సమాధానమేమో. గురుకృప కలిగిన శిష్యుడు మెరిసే తారల్లో, వెలిగే భానుడిలో, కురిసే వానలో, తినే ఆహారంలో, ఆఘ్రాణించే వాసనలలో, వినే శబ్దాలు అన్నింటిలో, చూసే ప్రతి వస్తువులో, ఆత్మీయ స్పర్శలో గురువునే అనుభూతి చెందుతాడు. వెలుపలా ఆయనే, బయటా ఆయనే... రెండు దేహాలలో జీవిస్తున్న ఏకాత్మ వారు.   గురుశిష్యులు బింబ ప్రతిబింబాల్లా ఉంటూ, ఒకరితో ఒకరు ఎల్లప్పుడు సంభాషించుకుంటూ ఉంటారు. ఇదే భావాన్ని అక్షరాల్లో ఇమడ్చడానికి ప్రయత్నించాను.

గురువెక్కడో నీవు గురుతెరగవోయి 
గుడి ఇక్కడేనంటు గనిమ్రొక్కవోయి 

గురువంటె శివుడంటు గురుగీత చెప్పెను 
శివుడంటె జగమంత వ్యాపించి ఉండును 
కదిలేది కదలనిది కానిదేది గురుమయం 
                                   ఇది తెలిసి మెలుగుటయె గురుకుల జీవనం // గురువెక్కడో నీవు//

కనిపించునది ఎంతొ కనువిందుసేయగా 
గుర్తించు కణకణమునున్నదే గురువని 
చవులూరు రుచులన్ని చవిజూచు వేళలో 
                               గమనించు అన్నపానీయాలన్ని గురువని // గురువెక్కడో నీవు//

ప్రియమైన కటువైన వినిపించునదియంత 
రవళించు గురువు నిను పలికించు గురువు 
భావమై భాషయై మనసంతటా నిండి 
                                నడత నేర్పును గురువు నడిపించు గురువు // గురువెక్కడో నీవు//

స్పర్శించునదియంత సమ్మిళితమైయుండి 
పొదువుకొను గురువు ప్రేమించు గురువు 
ఉచ్వాసనిశ్వాసలో ఊయలూగే 
                               ఊపిరి గురువు నీ ఉసురు గురువు // గురువెక్కడో నీవు//

గురుశిష్యులంటేను బింబప్రతిబింబాలు 
ఇరుదేహముల నమరు ఏకాత్మ రూపాలు 
మనసుతోనే వారు జరుపు సంభాషణలు 
                               పరమాత్మ ప్రమిదలో అలరారు దీపాలు // గురువెక్కడో నీవు//

వెలుపల లోపల నున్నారు గురువు 
వదలక వెన్నంటి కాచు గురువు 
గురువేక్కడోలేరు గాలించకోయి 
                                     గుండెలోనున్నారు  గుట్టుతెలియవోయి  // గురువెక్కడో నీవు//