Saturday, October 15, 2016

నీసరి ఎవ్వరు నీలకంధరా !

నీసరి ఎవ్వరు నీలకంధరా !
---------------------------------
భావరాజు పద్మిని - 16/10/16

సుమశరుడిని నువు కాల్చినావట
దక్షుని మదమును ద్రుంచినావట
బ్రహ్మ మత్సరము అణచినావట
వికారమంటని విహితయోగివట

చంద్రుని కావగ శిరసునుంచితివట
గంగను నిల్పగ జడనుగట్టితివట
విషపు నాగులను కట్టుకొందువట
గరళమె గళమున అదిమినావట

మంచుకొండవలె కరిగిపోదువట
మ్రొక్కిన గ్రక్కున వరమిచ్చెదవట
లోకువ గట్టిన లెక్క చేయవట
రాగము తెలియని విరాగి నీవట

సగము దేహము సతికినిత్తివట
దక్షిణ మూర్తివై జ్ఞానమొసగెదవట
భక్తుల మృత్యువు బాపి కాతువట
నీసరి ఎవ్వరు నీలకంధరా !



కామము కమ్మెను క్రోధము కాల్చెను
లోభము కూల్చెను మదము ముసిరెను
మత్సరమణచెను మోహము మీరెను
ఆరుశత్రువుల నరికట్టలేనైతి.

ఇన్నిటి నడుమన ఇరుకునబడితిని
అన్నిట గెలిచిన నిన్ను చేరితిని
శిరమును వంచి శరణు వేడితిని
శంకర పాపముబాపి గావుమా !

పిలచినంతనె పరుగున వచ్చెడి
బోళాశంకర మొరలాలింపుము
సంగము బంధము రాగామంటని
జ్ఞానజ్యోతినే ఆత్మను నిలుపుము

గురువే శివుడని చాటిన స్వామీ !
గురుపాదుకలను గురిని నిల్పుము
గురుధ్యానమునే మరలనీయక
గురునె లయమగు మార్గము జూపుము.