Thursday, August 4, 2016

//ఏమీ చిత్రం ! //

//ఏమీ చిత్రం ! //
---------------------
భావరాజు పద్మిని - 5/8/16

ఏమీ చిత్రం ! ఏమి విచిత్రం !
హరి నీ లీలలు ఊహాతీతం!

పాములు పక్షులు జన్మవైరులు
ఎదుటన బడ్డనె యుద్ధము తధ్యం
మరి శేషుని గరుడుని దరినె బెట్టుకుని
తిరమున కొలువై ఉండుటె చిత్రం !

వాడి చూపుల ఎరను కనుగొని
వాయువేగమున గోళ్ళను బట్టి
వడితో అలజడిరేపే గరుడుడు
నీకడ మిన్నకుండుటే చిత్రం !

ఏడుపడగల భూభారమును
మ్రోయు శేషుడే అలసి విరతికై
నల్లమలకు తిరుగాడగ వచ్చి
పవళించుటె ఎంతటి చిత్రం !

హరిత శోభకు మురిసి ముద్దుగా
పవళించిన శేషుని పడగలపైన
కలియుగ వరదుడై వేంకటేశుడై
కొలువుండుట అది ఎంతటి చిత్రం!



శేషుని హృదయం హరికి మందిరం
అచట నీవు అహోబిల మనుపురి
సృష్టి చేసి అట వెలసిన తీరును
పరికించగ అది ఎంతటి చిత్రం !

జయవిజయులకు శాపము నీవే!
శాపమునకు మరి ముక్తియు నీవే!
ప్రహ్లాదుడు, హరి భక్తియు నీవే !
భక్తి కొరకు అవతారము నీవే !

అసురుని మనమున విరక్తియు నీవే!
అసురుడు తిరిగెడు పురముయు నీవే!
అసురుని చీల్చిన చేతులు నీవే !
అటనె కొలువైన ఆద్యంతుడ వీవే!

ద్వారపాలకులను దైత్యుల జేసి,
దైత్యుల కూల్చెడు తీరును రాసి
అణువణువున నీవే నిండుతు
ఆటలాడుతీరు మరి ఎంతటి చిత్రం!

హరిహర అభేద భావము చాటగ
శేషుని తోకపై మల్లిఖార్జునిగ
శ్రీశైలమున వెలసిన శుభకర !
మనోవాక్కులకు అందని అనంత!

పడగల పైన భూమిని మోసే
శేషుడు భువిలో పవళించుటయా?
అటుపై నీవట కొలువుండుటయా?
ఇన్ని మాయలందుకు సేయుటయా?

భూమికావల శేషుడు, లోపల శేషుడు
శేషుని వెలుపల లోపల యంతటశౌరి
విషపు పడగలను వేడుక నిలిచి
వింతలు చూపే జగన్నాటక రాయా!

ఇన్ని చేయుచు ఏమి తెలియనటుల
ఇల్లరికపు అల్లుని వలెను హాయిగా
క్షీరాబ్ధిని తేలెడు శేషుని ఒడిలో
పవళించిన హరి నీ మాయలు చిత్రం!

మాయామానుష వేషము గట్టి
మమ్మాడించుట చాలు మురారి
మక్కువ నీదరి చేరెడు మార్గము
గ్రక్కున చూపుము భవాబ్ది తారి !

(నేను రాస్తున్న శ్రీ అహోబిల నృసింహ శతకం కోసం, అహోబిల చరిత్రను అధ్యయనం చేస్తున్నప్పుడు కలిగిన భావాలు... ఇలా స్వామి దయతో వర్షించాయి.)

Tuesday, August 2, 2016

//గోదా కల్యాణం//

//గోదా కల్యాణం//
---------------------
అమ్మవారి అనుగ్రహంతో...
భావరాజు పద్మిని - 28/7/16

శ్రీవిల్లిపుత్తూరు ప్రాంతమందున
భట్టనాధుడను భక్తుడుండెను
చిత్తము విష్ణుని కంకితమనిగని
'విష్ణుచిత్తుడని' జనులు పిలిచిరి

సమ్మోహనమగు విష్ణురూపమును
నిజముగ గన్న పెరియాళ్వారుడు
మంగళ శాసనములనే రాసి
నిజపదదాసుడు హరికర్పించెను

తులసీప్రియునికి వనమునుబెంచ
పాదుల పాతర తీయుచుండగా
ముద్దుల పాపయె కానవచ్చెను
కొమరికగా గొని పెంచసాగెను

'కోదై' అను పూమాలల పేరును
పెట్టి ప్రేమగా పిలువసాగెను
అదియె 'గోదా' యనుచునేర్పడి
గోవిందుని నామము జతనుగూడెను

బాలిక కాదూ హరికి ప్రేమిక
నల్లనివానిని నుల్లము నింపెను
కృష్ణలీలలా ఆడి పాడెను
తన్మయత్వమున కృష్ణునికొల్చెను

విల్లిపుత్తూరు వ్రజపురముగా
చెలులె గోపికల రూపుగ నెంచి
హరిమాలికలను తను ధరియించి
తీసి ఇచ్చెనీ 'ఆముక్తమాల్యద'.

అపచారమనుచు విష్ణుచిత్తుడు
గోదాదేవిని మందలించెను
ఆ మాలికలే తనకు ప్రాణమని
కృష్ణుడె కలలో నగుపడి జెప్పె

యంతట గోదా బాలిక కాదని
తమను కావగా వచ్చిన వేల్పని
తెలిసిన విష్ణు చిత్తుడు ఆమెను
"ఆండాళ్" అంటూ పిలువసాగెను

యుక్త వయసుకు వచ్చిన గోదా
కృష్ణుడినే తన భర్తగ నెంచి
తోటి చెలులతో భక్తిగ కూడి
కాత్యాయని వ్రతమాచరించెను

ధనుర్మాసమున తొలివేకువలో
స్నానము చేసి పూజలు సల్పి
పాశురమొకటి అనుదినమునను
రాసి చెలులతో కూడి పాడెను

తండ్రి చెప్పిన దివ్య తిరుపతుల
గాధలు విన్న గోదా యపుడు
రంగానాధునే తన నాధునిగా
నెంచి పరిణయము ఆడదల్చెను



రంగనాధుడు కలనగుపించి
గోదా అంటే భూమాతయని
ఆమెను తాను వివాహమాడగ
శ్రీరంగమునకు తోడ్కొని రమ్మనె

ఏమి చిత్రమిది ! ఏమి వింతయిది ?
యువతికి దేవుని శిలకు మనువట !
యనుచు జనులు గుమిగూడిన వీధి
'చిత్ర వీధియని' పేరు పొందెను

దేవుని యానను విని పూజారులు
గోదా పెండ్లిని ఘనముగ జరిపిరి
యందరి కన్నుల ముందే గోదా
స్వామి ప్రతిమలో లీనమాయెను

దేవుని చేరే మార్గము ఏదో
గోదా తన పాశురముల చాటెను
దివ్య ప్రబంధము లెన్నో రాసెను
ముందు తరాలకు అందజేసెను

భక్తి విజయమిది రమ్యచరితమిది
భక్తితొ కొలచిన హరియు కరుగునని
దేవుడు సైతం ప్రేమబద్ధుడని
నిజముగ చాటిన పుణ్యగాధ ఇది.

వచ్చి చదివినా రాక చదివినా
నచ్చిన వన్నీ ఇచ్చే చరితము
ఇహపరాలలో సౌఖ్యము గూర్చును
భువిని కల్పకము ఈ "తిరుప్పావై"!