Friday, January 13, 2017

//ఆనందాశ్రువు//

//ఆనందాశ్రువు//
**************
భావరాజు పద్మిని - 27/12/16.

ఓ విధాతా !
వేకువ సూర్యుడి కాంతిని ఇచ్చి,
కాంతికి కరిగే మంచును ఇచ్చి, 
జాలువానలను జగతికి ఇచ్చి,
వానకు అవిరిసే హరివిల్లును ఇచ్చి, 
కన్నుల కట్టే వెన్నో సొబగుల.


పట్టు పానుపుల సుఖముల నిచ్చి, 
పలు తెరగుల వస్త్రములను ఇచ్చి,
ప్రేమ దారులను పులకల నిచ్చి, 
మేనికి మెత్తటి సుఖముల నిచ్చి,
తనువును తేల్చేవెన్నో హంగుల.


గాలికి పూవుల పరిమళ మద్ది,
మేనికి అత్తరు గంధములలది,
వంటల వాసన పీల్చగ చెలగి,
మట్టి వాసనకు మనసే పొంగి,
ఊపిరినింపే వెన్నో ఊహల.



మధుర గానమున మైమరపించి,
పక్షుల కువకువ సడులనుముంచి,
మమతల మాటల మానసమెగసి,
నాదము వినగా మోదము పొంగి,
వీనుల కొసగే వెన్నో విందుల.


కమ్మని రుచులకు కాంక్షలు రేగె,
మాటల తేటలు కోటలు దాటే,
పాటల తేనెల ఊటలు పారె,
భావములన్నీ భాషను అమరె,
రసనను నింపేవెన్నో రసముల.


ఎన్ని మాయలను ఇలను నింపినా,
దయతో ఎన్నో వరముల నిచ్చిన,
కన్నుల మూసి నిను మది నింపి,
భక్తిని పొంగే మానసమందున,
తాదాత్మ్య మొందిన మేను మరువగా,
తెలియకె కంటను కారెనొకశ్రువు.


ఆనందాంబుధి జాలుయశ్రువే,
అన్నిటికన్నను తియ్యగనున్నది.
అన్నిటి కన్నను మిన్నగనున్నది.
నీదు సృష్టిని, కల్గు సుఖములను,
ఇంద్రియ బలముకు దీటుగ నిలచి,
అశ్రువు తలదన్నుటయే చోద్యము,
అశ్రువు మించుటె కాదా రమ్యము?
ఏమి చిత్రమిది ? వింతయిదేమి?

No comments:

Post a Comment