Saturday, January 21, 2017

ప్రతిమను ప్రేమించితివా?

ప్రతిమను ప్రేమించితివా?
**********************
భావరాజు పద్మిని – 22/1/16

ప్రతిమను ప్రేమించితివా - ప్రీతి ఎటుల చెబుదువమ్మ?
చెప్పిన నవిపోదురుగా - ప్రాణమెటుల ఓపునమ్మ ?
ఉలకడమ్మ పలకడమ్మ - ఊరకనే నిలుచునమ్మ
కదలడమ్మ మెదలడమ్మ - కాంక్షలెటుల దీరునమ్మ?

భూజాతవుగా గోదా – భూమి వలెనె ఓర్పు నీకు
సహజముగా అబ్బెనేమో – సహనమె నీకెక్కువమ్మ
అమరికగా పూలుగోసి - అందమైన మాలలల్లి
స్వామికెటుల నుండునని - నీవుదాల్చి జూచితివే.

మాలలవే తానుదాల్చి - మురిసెగాని మాధవుడు
మక్కువెంత తనుదాచెనొ - పెదవివిప్పి జెప్పడమ్మ.
తండ్రి జూచి కేకలేసి – అపచారము వలదన్నను
వలచినాను హరిననుచును – చెప్పజాలవైతివమ్మ.

తల్లిలేని బిడ్డవమ్మ – తండ్రికేమి తెలియునమ్మ
చిలుకతోను జెప్పుకున్న – పక్షికేమి తెలియునమ్మ
అన్నిటను అమరిన హరి – మూగ మనసు తెలుసుకుని
చెంగటనే చేర్చకున్న – చెలువమెటుల ఓపునమ్మ?

మార్గశిరపు మాసమున - చెలులగూడి వ్రతముజేసి
కృష్ణుడినే భర్తగాను - కోరమని చెబితివమ్మ.
నమ్మికెంత నున్నగాని - నిబ్బరంగ నున్నగాని
బేలగుండె మాటుదాగు - బెంగనెటుల ఓర్తువమ్మ.



గుండెలోన నింపుకున్న - ప్రేమయంత జ్వాలయయ్యి
కణకణము కాల్చెనమ్మ- ఎంత పరితపించితివమ్మ?
నీ ఊపిరి సెగలు రేగి – దిగులు మబ్బు మనసు మూగి
హరిమదినేయదిచేరి – ప్రేమజడిని తడిపెనమ్మ.

ప్రణయమెంత చిత్రమమ్మ – విరహమెంత వింతయమ్మ
కలసినంత సుధలుజిలుకు – విడచినంత విషముతొలుకు
మోదమైన ఖేదమైన – సమముగాను జంటకొసగు
నొప్పినొసగు ప్రేమయే – దాని కౌషధమూయగుగదమ్మ.

హరినిగాక పరుని చూడ – నిరసించెను నీ కనులు
పెండ్లాడగ నితరులనే – ప్రతిఘటించె నీ మనసు
రంగనాధునే నాధునిగా – వలచిన నీ మది యెరిగి
పెండ్లాడగ కబురంపెను – హరియే నీకోసమమ్మ.

ప్రతిమను పెండ్లాడగాను – తరలి పోయినావు తల్లి
చిత్రముగా జూచుజనుల –మ్రొక్కిపోయినావు తల్లి
వైభవముగ రంగపతిని – కూడి రంగ నాయకివై
పెండ్లి తంతు ముగియగానె – పతిలోనే కలసితివి.

నిండు ప్రేమ మదినున్నను – రాయి కూడ కరుగునని
జీవుడైన దేవుడైన – దిగివచ్చి వలచునని
ప్రతిమలోన ప్రభుని జూచి – వలచీ వలపింపజేసి
భువికి చాటినావు తల్లి – ధన్యచరిత వైతివమ్మ.

(అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. గోదామాత దయామృతపాతమిది.)

No comments:

Post a Comment