Monday, January 23, 2017

సిత్తరాల దేవుడండి (జానపద గేయం)

సిత్తరాల దేవుడండి (జానపద గేయం)
-------------------------------------
రామానుగ్రహంతో – భావరాజు పద్మిని 23/1/17

ఈ మధ్యన భద్రాచలం వెళ్ళినప్పటి సంగతి. ‘సిత్తరాల దేవుడండి శ్రీరాముడు’ అన్న పల్లవి స్ఫురించింది. అవునా, ఎందుకు ? అని ఆలోచిస్తే... కోతులు, ఎలుగులు, ఉడుతలు... వీటిని వెంట బెట్టుకుని ఎవరైనా మహావీరుడైన రావణుడితో యుద్ధానికి వెళ్తారా ? ఒక పామరుడి దృష్టితో చూసి, దీనిమీద పాటరాయమన్న ఆజ్ఞ వచ్చింది. అసలే జానపద భాష... పాట రాయాలంటే, దానికో గతి, నడక, లెక్క ఉంటాయి. మధ్య మధ్య ప్రాసలు కలిస్తేనే పాటకు ఒక సొబగు ఒస్తుంది. మొత్తానికి రాములవారి దయతో ఇలా కుదిరిందండి. ఇవాళ చదివి ఆనందించండి, రేపు పాడి వినిపిస్తాను.

పల్లవి :
సిత్తరాల దేవుడండి సీరాముడు
పెజల/నా సిత్తమంత దోసెనండి ఈ రాముడు

చరణం 1 :
కుదురుగున్న రాయినేమో ఆడదాన్ని సేసెనంట
ఎంగిలి పల్లిత్తేనూ సంబరాన తిన్నడంట
పేద గుహుడి పడవనెక్కి పోయింది ఎందుకంట ?
ఎక్కువేమి తక్కువేమి లేదని సెప్పేందుకంట //సిత్తరాల//



చరణం 2 :
పక్షి మాటలాలకించి సీతజాడ దెలిసెనంట
ఎలుగులెంట బెట్టుకోని ఎదరకేగి నిలిచెనంట
కోతిమూక తోటిసేరి సంగరాన దూకెనంట
ఉడుత సాయమైన గాని వద్దనంక పొందెనంట //సిత్తరాల//

చరణం 3 :
జీవజంతులంటె ఇంత మక్కువేల సూపెనంట ?
తేరిపార సూడ నితనె ఎనక ఏమిసేసెనంట ?
జంతు జనమలెత్తుకుంట మడిసిగాను మారెనంట
గుట్టుగానె అన్నిట్లో నిండినట్టు సాటెనంట //సిత్తరాల//

శ్రీ రామ పాదుకార్పణమస్తు !



No comments:

Post a Comment